ఆవేశంతో ఊగిపోతున్న నిరసనకారులు సుప్రసిద్ధమైన బెర్లిన్ గోడను కూల్చివేసి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత, నగరం తిరిగి ఒకటిగా అల్లుకుపోయింది. ఇది ఐక్య జర్మనీ నూతన రాజధానిగా మాత్రమే కాకుండా, యూరప్ రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా అవతరించింది. (విడిపోయినప్పుడు పశ్చిమ జర్మనీ రాజధాని బాన్ నగరం). పాత తూర్పు బెర్లిన్ శివార్లలో భాగమైన ప్రెంజ్‌లయర్ బెర్గ్ ఇప్పుడు జర్మనీలోనే అత్యంత ఆకర్షణీయ ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఐస్ క్రీమ్ లాగిస్తున్న గుంపులు ట్రెప్‌టవర్ పార్క్‌లో, సోవియట్ యుద్ధంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన భారీకట్టడం వద్దకు వెళుతుండగా మరి కొందరు తూర్పు జర్మనీ పాత టీవీ టవర్ ఛాయలో రూపొందించిన కారల్ మార్క్స్, ఎంగెల్స్ భారీ విగ్రహాల వద్ద ఫోటోలు తీసుకోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు.
కొనసాగుతున్న అవశేషాలు
తూర్పు జర్మనీ ప్రభుత్వ వ్యవస్థను మొత్తంగా లొంగదీసుకుని బెర్లిన్ గోడను తెరువగలిగిన భారీ స్థాయి ప్రజాందోళనలకి 30 సంవత్సరాలు తర్వాతకూడా పాత బెర్లిన్ అవశేషాలు నేటికీ కొనసాగుతుండటమే కాదు.. ఇంకా వృద్ది చెందుతున్నాయి. కాకుంటే పాత బెర్లిన్‌లో ఇష్టానుసారంగా పరిణామాలు జరగటం లేదు. తూర్పు జర్మనీ పార్లమెంట్ భవనం అయిన పీపుల్స్ ప్యాలెస్ (ప్రజల ఉపయోగార్థం ఇక్కడ థియేటర్లు, రెస్టారెంట్లు, డిస్కో కూడా ఉండేవి)ని 2006–2008 మధ్య కాలంలో నాటకీయంగా కూల్చి వేశారు. ఆ కాలంలో అక్కడ గడిపి తమ మధురానుభూతులను పండించుకున్న చాలామందికి ఈ భవనం కూల్చివేతతో గుండె పిండినంత పనయింది.
కొంతమంది తూర్పు జర్మన్ పౌరులు తమ గతానికి సంబంధించిన ముఖ్యమైన భాగాలు ఇప్పుడు తమ జ్ఞాపకాల దొంతర్లలో మరుగునపడిపోయాయని భావిస్తుండటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆనాటి సుపరిచితమైన ప్రకృతి చిత్రాలు, రంజింపజేసే పురాస్మృతులను ఇప్పుడు ఎయిర్ బ్రష్‌తో వాస్తవమైన వాటికంటే మించిన ప్రతిభతో చిత్రించారు. ఈ చిత్రాలు.. జాత్యహంకారపు నాజీ సామ్రాజ్యం, కమ్యూనిస్టు తూర్పు జర్మనీ రాజ్యంకి చెందిన రెండు నియంతృత్వాలతో కూడిన 20 శతాబ్దపు జర్మన్ ఏకాధిపత్య నిరంకుశ చరిత్రకు సమాన ప్రాతిపదికను కల్పిస్తుంటాయి.
ఇంకా వింత గొల్పేదేమిటంటే ఆనాటి పార్లమెంట్ భవనం స్థానంలో ఒకప్పుడు అక్కడే నివసించిన జర్మన్ కైజర్ల ప్యాలెస్ ప్రతిరూపాన్ని ప్రతిష్టించడమే. కమ్యూనిస్టులు, నాజీలూ అడుగుపెట్టని కాలానికి చెందిన ఈ ప్యాలెస్‌లో రాజ రికపు గతాన్ని ప్రదర్శించే మ్యూజియం కూడా నెలకొల్పారు. వలసవాదపు కళాత్మక చిహ్నాలెన్నో దీంట్లో కనిపిస్తాయి.
విస్తృతార్థంలో, పాత తూర్పు జర్మనీపై పాశ్చాత్యీకరణ మార్పు ప్రభావాలను ఇప్పుడు బెర్లి¯Œ లో స్పష్టంగా చూడవచ్చు. ప్రజల పాదార్థిక జీవన ప్రమాణాలు స్పష్టంగానే మెరుగుపడ్డాయి. పునరేకీకరణలో భాగంగా సంఘీభావ పన్ను విధిం పుద్వారా తూర్పు ముఖంగా వచ్చిపడిన బిలియన్ల కొద్దీ యూరోల కారణంగా తూర్పు ప్రాంతంలోని కొన్ని భాగాలు చాలా బాగా మెరుగుపడ్డాయి. అయితే వ్యవస్థాగత పునరభివృద్ధి ఇప్పటికీ ముళ్లబాటలోనే నడుస్తోంది.
పాశ్చాత్య వలసీకరణపై తీవ్ర నిరసనలు
తూర్పు జర్మనీలోని భారీ పరిశ్రమలను పశ్చిమ జర్మనీకి చెందిన ఆర్థిక పండితులు పట్టుబట్టి అమ్మివేయడం లేక మూసివేయడం చేసిన తీరు నూతన జర్మనీ దేశంలో పలు నిరసనలకు దారి తీసింది. పాశ్చాత్య వలసీకరణలో భాగంగా తూర్పు జర్మన్ కార్మికుల ఉద్యోగాలను పణంగా పెట్టి పశ్చిమ జర్మనీ ప్రాంతంలో పరిశ్రమలన్నింటినీ కేంద్రీకరించారంటూ ఐక్య జర్మనీలో పలువురు నిరసనకారులు నిరసిస్తున్నారు.
ఈ సెంటిమెంటును అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐక్యమయ్యాక తూర్పు జర్మనీలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. ఫలితంగా బెర్లిన్, లీప్జిగ్ వంటి నగరాలకు వెలుపల ఉన్న హిప్‌స్టెర్ హబ్‌లనుంచి అనేకమంది యువతీయువకులు చక్కటి కెరీర్లు, మంచి జీవన పరిస్థితులను అన్వేషిస్తూ పశ్చిమ జర్మనీ వైపు తరలిపోతున్నారు.
రాజకీయంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో గుర్తించదగిన స్థాయిలో వ్యత్యాసాలున్నాయి. దీని వల్ల తక్కువ బహుళ సంస్కృతీ వ్యవస్థ కలిగిన తూర్పు ప్రాంతంలో అసాధారణ స్థాయిలో ఛాందసవాద తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతుం డటం గమనించవచ్చు. ఉదాహరణకు చెమింట్జ్ (పాత కార్‌్లమార్క్స్ సిటీ) పట్టణంలో 2018లో మితవాద పక్షాల ర్యాలీల సంఖ్య పెరిగింది. వీటిలో కొన్ని జాత్యహంకారానికి వ్యతిరేక ర్యాలీలు కూడా ఉన్నాయి. డ్రెస్డెన్ పట్టణంలో నాజీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎందుకంటే పట్టణంలో ప్రజాస్వామ్య వ్యతిరేక జాత్యహంకారులతో పోరాడక తప్పని స్థితి. పాత తూర్పు జర్మనీకి చెందిన థురిగింయాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కరడుగట్టిన మితవాద పక్షమైన ‘ఆల్టర్‌నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ’ రెండో స్థానంలో నిలిచింది.
తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న కారణంగా పశ్చిమ జర్మనీలో ఎన్నికల్లో గెలవలేకపోతున్న లెఫ్ట్ పార్టీ తూర్పు జర్మనీ ప్రాంతంలో మాత్రం అనేక సంవత్సరాలుగా ప్రజాకర్షక ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ (ఎఎఫ్‌డి) తూర్పు జర్మనీ ప్రాంతంలో గణనీయంగా మెరుగుపడింది పైగా అది తూర్పుకు మాత్రమే పరిమితం కాలేదు. ఆశ్చ ర్యమేమిటంటే ఈ పార్టీ ప్రముఖ నేత జోర్న్ హోకె పశ్చిమ జర్మనీలోని పారిశ్రామిక కేంద్రమైన రుర్ ప్రాంతానికి చెందినవాడు. నియో నాజీల హింస జర్మనీలో పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర ఛాందసవాద మారణ కాండవైపు ఇలాంటి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.
మితవాదమే అసలైన ప్రమాదం
వలసల అనుకూల సీడీయూ నాయకుడు వాల్టర్ లుబేక్‌ను నాజీ అనుకూల ముఠాలు ఈ సంవత్సరం చంపేయడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ హత్య పశ్చిమ జర్మనీలోని కాజెల్ పట్టణంలో జరగటం గమనార్హం. తూర్పు జర్మనీలో మౌలిక వసతుల పునరుద్దరణ, పశ్చిమ జర్మనీని తలపించే జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో పాత తూర్పు జర్మనీ రాష్ట్రాల్లోని రాజకీయ, సామాజిక జీవితానికి నిజమైన ప్రమాదం ఏర్పడనుంది. ఇది జర్మన్లందరి భవిష్యత్తుకూ ప్రమాద హేతువే.
మేట్ ఫిట్జ్‌పాట్రిక్
వ్యాసకర్త అసోసియేట్ ప్రొపెసర్, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఫ్లిండర్స్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment