‘ఒక సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇంకో పెద్ద సంఘటన సృష్టించే అతి తెలివిని చంద్రబాబు నాయుడు ఎప్పట్నుంచో అమలుపరుస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాప్రయత్నం దరిమిలా ప్రజల్లో రేగిన అలజడి నుంచి అందరి దృష్టిని వేరే అంశంవైపు మరల్చడానికే.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమ యం సందర్భం లేకుండా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా తన పాత మిత్రులం దర్నీ కలిసి వచ్చారన్నది తిరుగులేని వాస్తవం. ఆ హత్యాయత్నంపై ప్రభుత్వం స్పందించిన తీరును మెజారిటీ ప్రజలు ఈసడించుకోవడంతో తొలుత సినీనటుడు శివాజీ భవిష్యత్తును ఊహిస్తూ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందంటూ ప్రచారం మొదలు పెట్టారు. సదరు ప్రచారమూ ఎదురు తిరగడంతో ప్రజల దృష్టిని ఆ కేసు నుంచి మరల్చడానికి.. బాబు అప్పటికప్పుడు రాహుల్ అపాయింట్‌మెంట్ తీసుకొని పొత్తుల మిషతో ఢిల్లీకి వెళ్లారు. వెంటనే వై.ఎస్.జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన వార్తలను పక్కన పెట్టిన ఒక వర్గం మీడియా బాబు ఢిల్లీ పర్యటనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించింది.
తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయడానికి నిర్ణయించుకొని చాలా కాలమే అయింది. కూటమి ఏర్పాటై నెలన్నర దాటింది. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అంతకుముందే బాబు ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్, శరద్ యాదవ్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మాయావతి తదితరులను కలిసి వచ్చారు. తర్వాత తాను రాహుల్ ఇంటికి వెళ్లి పొత్తు కుదిరిందని ప్రకటించారు. రాహుల్‌తో అంతకుముందే అవగాహన కుదుర్చుకోకుండానే తెలంగాణలో పొత్తు ఎలా సాధ్యమైందని ఏ ఒక్క మీడియా ప్రతినిధీ ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం. ప్రజాస్వామ్యం దాని అనివార్యత గురించి మాట్లాడే బాబు వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని అవహేళన చేయడాన్ని యావత్ మీడియా తప్పుపట్టి ఉండవలసింది. కానీ ‘కోడికత్తి కేసు’ అంటూ బాబు, ఆయన అంతేవాసులు చేసిన దుష్ప్రచారానికి టీడీపీ అనుకూల మీడియా వంతపాడింది. ఆ దన్నుతోనే బాధితుడైన వై.ఎస్. జగనే ఈ కేసులో నిందితుడు అనే భావం ప్రజల్లో నాటుకుపోయేందుకు అధికార తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నించింది.
తమ పార్టీ నేతలు పాల్పడే దాష్టీకాలకు, దాడులకు బలైపోతున్న బాధితుల్నే నిందితులుగా చిత్రీకరించడం బాబుకు అలవాటు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా పాల్పడుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకొనే క్రమంలో టీడీపీ నేతలు చేసిన పాశవిక దాడికి గురై తీవ్ర అవమానం పొందిన కృష్ణా జిల్లా ఎమ్మార్వో వనజాక్షి ఉదంతం దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఆమె పట్ల సానుభూతి వెల్లువెత్తడంతో సాక్షాత్తూ బాబు రంగంలోకి దిగి 24 గంటల వ్యవధిలో ఆమెను విధులను అతిక్రమించిన అధికారిణిగా చిత్రీకరించేశారు. ఆమెను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిచి చీవాట్లు పెట్టి పంపించారు. బాధితురాలైన వనజాక్షిపైనే నిందితురాలిగా ముద్రవేశారు. అలాగే గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది దారుణ మరణాన్నికూడా బాబు మీడియా ద్వారా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి పక్షాల డిమాండ్ వల్ల సీఎం ఈ ఘటనపై నియమించిన కమిషన్ కూడా సీఎంకి తోడునీడై నిలిచింది. పుష్కరాల తొక్కిసలాట సంఘటనలో సైతం బాధితులే నిందితులని తేల్చేసింది! భక్తులు ప్రదర్శించిన ఆత్రుతే వారి ప్రాణాలు తీశాయి. ఇందులో సీఎం ప్రమేయమేమీలేదు, ప్రభుత్వ వైఫల్యం లేనే లేదట.
సంక్షోభాల నుంచి అవకాశాలు పొందడం తన నైజం అని బాబు పదేపదే చెబుతుంటారు. తాజాగా, వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం సంఘటనను, బద్ధ శత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బాబు తాపత్రయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపించి లబ్ధి పొందిన బాబు, 2019 ఎన్నికల్లో బీజేపీని; బీజేపీతోపాటు వైఎస్సార్‌సీపీ, జనసేనలను విలన్‌లుగా చిత్రీకరించి లబ్ధి పొందడానికి వ్యూహాలు రచిస్తున్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం సంఘటనలో కూడా రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రాణాలకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రజల్లో చర్చ మొదలైంది. కేవలం గెలుపే పరమావధిగా అన్ని విలువలకు మంగళం పాడుతూ దానిని ప్రజాస్వామ్య అనివార్యతగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు వేసుకున్న ముసుగును ప్రజలే తొలగించాల్సిన అవసరం ఏర్పడింది.
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ 81069 15555
Comments
Please login to add a commentAdd a comment