‘నివాళి’ చెబుతున్న నిజాలు | Devulapalli Amar Writes on TDP and BJP | Sakshi
Sakshi News home page

‘నివాళి’ చెబుతున్న నిజాలు

Published Wed, Feb 28 2018 12:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

Devulapalli Amar Writes on TDP and BJP - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌కు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ, టీడీపీ రెండూ కూడా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ అన్న విషయం గుర్తించాలి. కేంద్రం నుంచి ఏ సహాయమూ రాలేదంటున్న చంద్రబాబు కేంద్ర సహాయం అద్భుతం, అమోఘం అని ఈ నాలుగేళ్లు ఎందుకు భజన చేశారో  చెప్పాలి. తాము ఇచ్చిన నిధులకు ఇప్పుడు లెక్కలు చెపుతూ అందులో బోలెడు అవినీతి జరిగిందంటున్న బీజేపీ నాయకులు అధికారం తమ చేతిలో ఉండి కూడా ఇంతకాలం లెక్కలు ఎందుకు అడగలేదో, ఎందుకు అవినీతికి అడ్డుకట్ట వేయలేదో కూడా చెప్పాలి.

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర చదువుకున్నవారికి వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ గురించి తెలియకుండా ఉండదు. బీజేపీ, ఆరెస్సెస్‌ సహా హిందూత్వవాదులంతా ఆయనను స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌ అని పిలుచుకుంటారు. దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న మితవాదశక్తులు నిద్రలో కూడా కలవరించే ‘అఖండæభారత్‌’ఆలోచన వీర్‌ సావర్కర్‌ బలపరిచినదే. స్వాతంత్య్రోద్యమంలో సావర్కర్‌ పాత్ర గురించి రెండు వాదనలు ఉన్నాయి. దేశæస్వాతంత్య్రం కోసం పోరాడినందుకు సావర్కర్‌కు బ్రిటిష్‌ పాలకులు 50 ఏళ్ల జైలు శిక్ష విధించి అండమాన్‌ సెల్యూలర్‌ జైలుకు పంపారని బీజేపీ, ఆరెస్సెస్‌ తదితర హిందూత్వ అనుకూలవాదులు చెబుతారు.

బ్రిటిష్‌ పాలనకు అనుగుణంగా నడుచుకుంటాననీ, క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటూ లేఖ రాసినకారణంగా ఆయనను విడుదల చేశారనీ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు జరిగిన క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దనీ, బ్రిటిష్‌ వారిచ్చిన పదవులకు రాజీనామా చెయ్యొద్దనీ తన వారికి పిలుపు ఇచ్చిన సావర్కర్‌ స్వాతంత్య్రవీరుడు ఎట్లా అవుతాడని కాంగ్రెస్‌ వాదులూ కమ్యూనిస్ట్‌లూ వాదిస్తుంటారు. బీజేపీ, ఆరెస్సెస్‌లకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ సావర్కర్‌ ఆరాధ్యదైవమే.

నివాళిలోనూ రాజకీయమే
సరే, సావర్కర్‌ను ఎవరి కోణం నుంచి వారు విశ్లేషించవచ్చు. స్వాతంత్య్ర పోరాటకాలంలో వ్యవహార శైలిని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరయినా అంచనా వెయ్యవచ్చు. ఎవరికయినా, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఇటువంటి విషయాల్లో స్పష్టమయిన అభిప్రాయం కలిగి ఉండాలి, ఉంటారు కూడా. అయితే ఇప్పుడు సావర్కర్‌ ప్రస్తావన ఎందుకు అనే సందేహం కలగవచ్చు. మొన్న అంటే ఈ నెల 26వ తేదీ సావర్కర్‌ వర్ధంతి. 1966 ఫిబ్రవరి 26 వ తేదీన, అంటే 52 ఏళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఆ సందర్భంగా దేశంలో చాలామంది సావర్కర్‌ అభిమానులు ముఖ్యంగా హిందూత్వవాదులు తమకు తోచిన పద్ధతుల్లో నివాళులు అర్పించారు.

సావర్కర్‌ పాత్రను వ్యతిరేకించే వారు ఎవ్వరూ ఎక్కడా ఆయనకు నివాళులు అర్పించలేదు. అంతమాత్రాన ఆయన అభిమానులకు పోయేదేమీలేదు. అయితే సావర్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించి అంతలోనే నాలుక కరుచుకుని ఆ నివాళిని వెనక్కి తీసుకునే వాళ్లను ఏమనాలి? అదికూడా మామూలు వ్యక్తులు అయితే వేరు. రాజకీయ దిగ్గజం, అపర చాణక్యుడు అని పేరు తెచ్చుకున్న, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడు ఆ పని చేస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి?

పాపం, సావర్కర్‌ గురించి ఆయనకు ఏమీ తెలియదు, ఎవరో చెపితే పొరపాటున నివాళులు అర్పించారు. ఆ వెంటనే మరెవరో, అయ్యో సావర్కర్‌ బ్రిటిష్‌ పాలనను సమర్ధించినవాడు, క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాడు అని గుర్తు చేస్తే వెనక్కి తీసుకున్నారని అర్థం చేసుకోవాలా? ఆ పని చేసింది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు చాలా సీనియర్‌ నాయకుడు. ఆయనే తరచూ ఆమాట చెబుతూ ఉంటారు, దేశంలో ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వాళ్లందరిలో తానే సీనియర్‌నని. అంతేకాదు, తాను స్టేట్స్‌మన్‌ని అని కూడా ఆయనే పదే పదే గుర్తు చేస్తుంటారు.

వీర్‌ సావర్కర్‌ ఎవరో, ఆయనకు నివాళులు అర్పించాలా, కూడదా అన్న విషయాలు చంద్రబాబునాయుడు వంటి ‘స్టేట్స్‌మన్‌’కు తెలియకుండా ఉంటాయని ఎట్లా అనుకుంటాం? మొన్న 26వ తేదీన పొద్దున్నే చంద్రబాబునాయుడు ట్వీటర్‌లో వీర్‌ సావర్కర్‌కు నివాళులు అర్పించారు. అయితే కొద్దిసేపట్లోనే ఆ నివాళిని ట్వీటర్‌ నుంచి తొలగించేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది ఎవరూ పెద్దగా పట్టించుకునే విషయం కాదు. రాజకీయ అవసరాల కోసం ఎవరినయినా ఏ జంకూ లేకుండా వదిలించుకోగలిగిన చంద్రబాబు బీజేపీని మరొక్కసారి వదిలించుకోబోతున్నారనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్న సమయంలో ఇది జరిగింది.

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన వీర్‌ సావర్కర్‌ను కీర్తించాల్సిన అవసరం లేదు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ సిద్ధాంతాలను నూటికి నూరు శాతం సమర్ధించే వారే ఉండాలని లేదు. రాజకీయ అవసరాల కోసం, మళ్లీ మాట్లాడితే అధికారం కోసం ఎవరు ఎవరితో అయినా జత కడుతుంటారు, ఎవరినయినా వదిలేస్తారు. అందులో సిద్ధహస్తుడయిన చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2004 ఎన్నికల ముందటి అవతారం మళ్లీ ఎత్తదల్చుకున్నారు కాబట్టి చంద్రబాబునాయుడు ఇప్పుడు బీజేపీని వదిలించుకుని సెక్యులర్‌ బురఖా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టే ట్వీటర్‌లో నుంచి వీర్‌ సావర్కర్‌ నివాళి మాయమైంది.

ఇద్దరూ సమాధానాలు చెప్పాలి
చంద్రబాబునాయుడు తమను వదిలేస్తాడన్న విషయం బీజేపీకి కూడా తెలుసు. అందుకే కొన్నిరోజులుగా స్వరం పెంచింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్‌కి ఈ మూడున్నర ఏళ్లలో ఇచ్చిన నిధుల లెక్కలు చెబుతున్నారు. మరో బీజేపీ నాయకుడు, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు ఆ నిధుల్లో జరిగిన అవినీతి గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. 1995లో ఎన్టీ రామారావు నుంచి అక్రమంగా అధికారం లాక్కున్నాక, 1999లో బీజేపీ సహాయంతో, అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రజాకర్షణ శక్తి, కార్గిల్‌ వంటి అంశాలు కలిసొచ్చి అత్తెసరు మార్కులతో బయటపడ్డారు చంద్రబాబు.

మళ్లీ 2014లో అదే బీజేపీ సహాయం, మోదీ సమ్మోహన శక్తి, పవన్‌కల్యాణ్‌ సహకారంతో మరోసారి అత్తెసరు మార్కులతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మరోసారి బీజేపీని వదిలేయడం పెద్ద విశేషం ఏమీకాదు. ఆయనకు ఎన్నడూ స్వయం ప్రకాశకత్వం లేదు. అందుకే బహుశా 2019లో కొత్త మిత్రుల వెతుకులాటలో పడ్డారేమో! అయితే 2004లో ఆయన హైదరాబాద్‌లోనే అడ్వాణీ ర«థం దిగేసి తెగతెంపులు చేసుకున్నప్పటి బేలతనం ప్రస్తుత బీజేపీ నాయకత్వంలో లేదు. బీజేపీ ఇప్పుడు అమాయక చక్రవర్తి అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేతుల్లో లేదు. ‘కట్‌ త్రోట్‌’రాజకీయాలు నడుపుతున్న అమిత్‌ షా, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉంది.

2014లో ఆంధ్రప్రదేశ్‌కు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ, టీడీపీ రెండూ కూడా రాష్ట్ర ప్రజలకు అనేక విషయాల్లో జవాబుదారీ అన్న విషయం గుర్తించాలి. కేంద్రం నుంచి ఏ సహాయమూ రాలేదంటున్న చంద్రబాబునాయుడు కేంద్ర సహాయం అద్భుతం, అమోఘం అని ఈ నాలుగేళ్లు ఎందుకు భజన చేశారో ప్రజలకు చెప్పాలి. తాము ఇచ్చిన నిధులకు ఇప్పుడు లెక్కలు చెపుతూ అందులో బోలెడు అవినీతి జరిగిందంటున్న బీజేపీ నాయకులు అధికారం తమ చేతిలో ఉండి కూడా ఇంతకాలం లెక్కలు ఎందుకు అడగలేదో, ఎందుకు అవినీతికి అడ్డుకట్ట వేయలేదో కూడా ప్రజలకు చెప్పాలి. సరయిన జవాబులు రాకపోతే ఏం చెయ్యాలో ప్రజలు నిర్ణయించుకుంటారు.

విజన్‌ 2033లో చంద్రబాబు
చివరగా, చంద్రబాబునాయుడు చట్టసభల్లోకి ప్రవేశించి నిన్నటితో 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మానసపుత్రిక అయిన ఒక మీడియా సంస్థ యజమానితో పెట్టిన సుదీర్ఘ ముచ్చట్లలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు– క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటిరోజే మంత్రి పదవిని ఆశించిన విషయం. అట్లాగే రాజకీయ పుట్టుకే అసమ్మతితో అని కూడా చెప్పుకున్నారు.

మొదటిసారి 1978లో 26 ఏళ్ల వయసులోనే మంత్రి పదవి ఇవ్వనందుకు డాక్టర్‌ చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అసమ్మతి కార్యక్రమం మొదలు పెట్టానని గర్వంగా చెప్పుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా ఆంధ్రప్రదేశ్‌ వంటి సంక్షోభ స్థితిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పదవీకాలంలో ప్రజలకు ఏం చేసిందీ చెప్పే ప్రయత్నం లేకపోగా ‘మందు కొట్టేవారా, తోటి విద్యార్థుల చేత మందు కొట్టించి తగాదాలకు వెంట తీసుకువెళ్లేవారా, చిల్లర ఖర్చుల కోసం పేకాట ఆడేవారా’ వంటి చిల్లర ముచ్చట్లకు పరిమితం కావడంతో వీక్షకులు ముక్కున వేలేసుకున్నారు.

ఈ ముచ్చట్లలోనే ముఖ్యమంత్రి ఒక్క విషయం మాత్రం స్పష్టం చేశారు. అమరావతిలో రాజధాని నిర్మించడానికీ, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికీ తనకు ఇంకో పదిహేను సంవత్సరాలు అధికారం కావాలని చెప్పారు. బహుశా ఆయన విజన్‌ 2033 కావచ్చు.

datelinehyderabad@gmail.com   
దేవులపల్లి అమర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement