సీఎం చంద్రబాబు నాయుడు
డేట్‌లైన్ హైదరాబాద్
స్టేట్స్‌మన్ చంద్రబాబు ఈ మధ్య దిక్కు తోచని స్థితిలో పడ్డట్టున్నారు. సొంతంగా ఆలోచించి ప్రజా ప్రయోజనాల గురించి కానీ, రాజకీయంగా కానీ నిర్ణయాలు తీసుకోలేని స్థితి అది. ప్రతిపక్ష నాయకుడు ఎజెండా నిర్ణయిస్తుంటే ఆయన అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాన్ని వెంట తీసుకుపోవలసిన ముఖ్యమంత్రి అదే ప్రతిపక్షాన్ని అనుసరించాల్సిన పరిస్థితికి వచ్చారంటే దానికి ఆయనే బాధ్యుడనడంలో సందేహం లేదు. ఈ స్థితిలో అఖిలపక్షమో, అఖిల సంఘమో అర్థం కాని, ఏ మాత్రం ప్రయోజనం లేని కుప్పిగంతులు ఆపడం మంచిది.
నలుగురి అభిప్రాయాలు తెలుసుకోవడం, సలహాలు సూచనలు తీసు కోవడం, సంప్రదింపులు జరపడం, మంచిచెడులను బేరీజు వేసుకో వడం, ఫలితాలను అంచనా వేయడం వీటన్నిటి నుంచి అంతిమంగా తమకు వచ్చిన ఆలోచనను అమలు చేయడం విజ్ఞుల లక్షణం. ఇందుకు చాలా సమయం పట్టవచ్చు, అనేక అవరోధాలు ఎదురు కావచ్చు, ప్రతి ఘటన కూడా పెద్ద ఎత్తున ఉండవచ్చు. కానీ ఒక సమస్యకు సరైన పరిష్కారం సాధించాలనుకునే వారు విజ్ఞులయితే ఈ కష్టాన్ని భరిస్తారు, ఇదే మార్గంలో వెళతారు. రాజకీయాల్లో ఉన్న వారికీ, అందునా అధికా రంలో ఉన్నవారికీ ఇది చాలా అవసరం. ప్రజల జీవితాలతో, వారి మంచి చెడ్డలతో వ్యవహారం కాబట్టి, వారికి మంచే చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.
అట్లాంటి వారినే రాజకీయాల్లో రాజనీతిజ్ఞులు (స్టేట్స్‌మన్) అంటారు. ‘నేను మామూలు రాజకీయ నాయకుడిని కాను. చట్టసభలతో 40 ఏళ్ల అనుభవం నా ఒక్కడికే సొంతం. దేశంలో చాలామంది కంటే ముందే, అదీ చిన్న వయసులో ముఖ్యమంత్రిని అయ్యాను. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణశకం నాతోనే మొదలయింది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కాన్ఫరెన్స్ హాల్‌గా మారిన ఆ రాష్ట్ర శాసనసభలో గంటల తరబడి ఇదే విషయం చెబుతున్నారు. ఒక అసత్యాన్ని వందసార్లు చెబితే సత్యం అయి పోతుం దన్న సిద్ధాంతం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే బాగా ఒంట బట్టించుకున్నారు.
రాజనీతిజ్ఞుడనగా....!
ఆయన కన్నా చిన్న వయసులో ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచి ముఖ్య మంత్రులు అయిన పిన్న వయస్కులు చాలా మంది ఉన్నారు. ఆయన కంటే రాజకీయాల్లో తలపండిన భీష్ములు ఇంకా మిగిలే ఉన్నారు. కానీ ఆయన మాత్రం వాళ్లెవరినీ పరిగణనలోకి తీసుకోరు. తానే ‘సీనియర్’ని అంటారు. అందరూ నమ్మాలని కూడా చెబుతారు. సభలో తెలుగు తమ్ముళ్లకు మరో దారి లేదు కాబట్టి బల్లలు చరిచి హర్షామోదాలు ప్రకటిస్తుంటారు. నారా చంద్ర బాబునాయుడు స్వయం ప్రకటిత స్టేట్స్‌మన్. విజ్ఞులు, రాజనీతిజ్ఞులు (స్టేట్స్ మన్) ఎట్లా ఆలోచిస్తారో, ఎట్లా వ్యవహరిస్తారో ముందే మాట్లాడుకున్నాం. మరి మన స్వయంప్రకటిత స్టేట్స్‌మన్ చంద్రబాబునాయుడు వ్యవహారం మొదటి నుంచి ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం!
1995లో ఎన్టీ రామారావు కష్టఫలాన్ని కుట్రపన్ని చేజిక్కించుకున్న తరు వాత చంద్రబాబు బీజేపీ హవాలో, వాజ్‌పేయి ప్రజాకర్షణ తోడై 1999లో అధికారం సొంతం చేసుకున్నారు. అప్పుడే ఏదో సందర్భంలో అఖిలపక్ష సమావేశం ఒకటి నిర్వహించారు. సమావేశం ముగిశాక అఖిలపక్షం అన్నారు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆహ్వానించలేదు ఎందుకు అని విలేఖరులు అడిగితే శాసనసభలో వారికి ప్రాతినిధ్యం లేదు కదా అని తడుముకోకుండా జవాబిచ్చారు. ఆ ఎన్నికల్లో సీపీఐ శాసనసభలో ఒక్క స్థానం కూడా గెలవని మాట వాస్తవమే. కానీ సీపీఐ జాతీయ పార్టీకి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉంది.
ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది కదా అని మళ్లీ ప్రశ్నిస్తే స్టేట్స్‌మన్ దగ్గర జవాబు లేదు. సభలో ప్రాతినిధ్యం లేని పార్టీలను పిలవద్దనుకున్న ప్పుడు ఇది అఖిలపక్షం ఎట్లా అవుతుంది, ఫ్లోర్ లీడర్‌ల సమావేశం అనాలి కదా అని మరో విలేకరి రెట్టిస్తే స్టేట్స్‌మన్‌కు కోపం వచ్చింది. మీ మైండ్‌సెట్ మారాలి అని వెళ్లిపోయారు. ఈ పందొమ్మిదేళ్ల కాలంలో ఆ విలేకరి మైండ్‌సెట్ ఎంత మారిందో తెలియదు కానీ తన మైండ్ సెట్ ఏ మాత్రం మార్చుకోకుండా మీడియా మైండ్ సెట్ మాత్రం విజయవంతంగా మార్చే శారాయన.
అఖిలపక్షం ఎత్తుగడ
దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఆయనకు హఠాత్తుగా అఖిలపక్షం అవసరమైంది. సరే, ఇందులో ఒక దశాబ్దం పాటు అధికారానికి దూరంగానే ఉన్నారు కాబట్టి మళ్లీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లే లెక్కలోకి తీసు కుందాం. తన మీదా, తన పరిపాలన మీదా తనకే నమ్మకం లేక మాటి మాటికీ సర్వేలు చేయించుకునే స్టేట్స్‌మన్ చంద్రబాబునాయుడు ఆ సర్వేల్లో 95 శాతం జనం తన వెంటే ఉన్నారు కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు అవసరం లేదు అని దబాయించి, శాసనసభలో ఉన్న ఒకే ఒక్క బలమయిన ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసి, చివరికి ఆ ప్రతిపక్షం శాసనసభను నిరంతరంగా బహిష్కరించే పరిస్థితికి తీసుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రాజధాని లేని, రూ. 16 వేల కోట్లకు మించిన లోటుతో రాష్ట్రం మిగిలిపోతే ఏ ఒక్క రోజూ ఏం చేద్దాం ఈ పరిస్థితిని అధిగమించడానికి అని ఏ ఒక్క ప్రతిపక్షాన్ని సలహా అడిగిన పాపాన పోనీ స్టేట్స్‌మన్ చంద్రబాబు. రాజధాని కోసం అనువైన స్థలాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే ఆ కమిటీ నివేదికను ప్రజల ముందు ఉంచడం మాట దేవుడెరుగు. కనీసం శాస నసభకు సమర్పించని చంద్రబాబుకు, రాజధాని స్థల నిర్ణయం విషయంలో గానీ, అక్కడ వేలాది ఎకరాలు పంట భూములను రైతుల వద్ద నుంచి తీసు కున్నప్పుడు కానీ, అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తానని గొప్పలకు పోయి వందల వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేసినప్పుడు కానీ ప్రతిపక్షాలు గుర్తుకు రాలేదు.
ఎన్నికల హామీగా అయిదు నుంచి పదిహేను సంవత్సరాలకు పెంచిన ప్రత్యేక హోదాను ముగిసిపోయిన అధ్యాయంగా ప్రకటించి, కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీ మహా ప్రసాదంగా స్వీకరించిన నాడు ఒక్క నిముషం ఆగి ప్రతిపక్షాలను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచనే రాలేదు ఆయనకు. శాసనసభ సమా వేశాలు నడుస్తున్నాయి. కనీసం పొద్దుటి దాకా ఆగి సభకు సమాచారం అందించి బహిరంగ ప్రకటన చేద్దాం అన్న సోయి కూడా లేకుండా అర్ధరాత్రి దాటాక మీడియా ముందుకు వచ్చి కేంద్ర నిర్ణయాన్ని ఒక్కడే సమర్థించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అఖిలపక్ష/సంఘ సమావేశం అంటూ బయలు దేరారు. ఆనాడు కనీసం తన పార్టీలోని ముఖ్యులతో కూడా మాట్లాడని చంద్రబాబునాయుడు నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఈ నాలుగేళ్లూ అలుపెరుగని పోరాటం చేసి ప్రజలను మరింత జాగరూకులను చేశాక ఇప్పుడు తూతూ మంత్రంగా అఖిలపక్షం అంటూ బయలుదేరారు.
ఒక పక్క ప్రతిపక్షం వైఎస్సార్íసీపీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దాని మీద చర్చకు పట్టుపట్టి ఇతర పక్షాలను కూడ గట్టుతున్న స్థితిలో తప్పనిసరి అయి ఆ పార్టీని అనుసరించిన చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని పిలవడంలో అర్థం లేదు. పరిష్కారం ఏమిటో తెలియని స్థితిలో, అది సాధించడానికి అనుసరించాల్సిన మార్గాన్ని నిర్ణయించుకునే క్రమంలో ప్రతిపక్షాన్ని సంప్ర దించాలి కానీ సమస్యకు తానే కారకుడై, దాని పరిష్కారానికి ఇతరులు ఇప్పటికే పోరాటంలో చాలా దూరం వెళ్లిపోయాక వాళ్లను అందుకోలేక ఉన్నచోటనే చతికిలబడి సహాయం కోసం అర్ధించినట్టుగా ఉంది ముఖ్య మంత్రి వ్యవహారం.
కామ్రేడ్స్ దారెటు?
చట్టసభలో ప్రాతినిధ్యం లేని పార్టీని అఖిలపక్షానికి పిలవబోనని 1999లో చెప్పిన చంద్రబాబు ప్రస్తుత ఆహ్వానాన్ని అదే చట్టసభలో ప్రాతినిధ్యం కలి గిన పార్టీలు వైఎస్సార్‌సీపీ, బీజేపీ తిరస్కరిస్తే ప్రాతినిధ్యం లేని వామపక్షాలే ఆయనకు దిక్కయ్యాయి. పోనీ ఆనాడు పనికిరాని వాళ్లం ఇప్పుడెట్లా పని కొచ్చాం అని అడగడానికి సంకోచించారో, సరేలే ఇప్పటికయినా గుర్తించారు కదా అని సర్డుకుపోవాలని వెళ్లారో తెలియదు. ఆయన ఎవరినీ గుర్తించరు, అవసరం వచ్చినప్పుడు వాడుకుని వదిలేస్తారు, అంతే. 1995 ఆగస్టు 31 అర్ధరాత్రి (ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రాత్రి) కమ్యూనిస్ట్ పార్టీల శాసనసభాపక్షాల నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోసం అర్థించిన చంద్రబాబు, ఆ తరువాత దేశానికి కావలసింది కమ్యూనిజం కాదు, టూరిజం అనడానికి ఎక్కువ సమయం పట్టలేదని వామపక్షాలు జ్ఞాపకం చేసుకుంటే మంచిది.
స్టేట్స్‌మన్ చంద్రబాబునాయుడు ఈ మధ్య దిక్కు తోచని స్థితిలో పడ్డట్టున్నారు. సొంతంగా ఆలోచించి ప్రజా ప్రయోజనాల గురించి కానీ, రాజకీయంగా కానీ నిర్ణయాలు తీసుకోలేని స్థితి అది. ప్రతిపక్ష నాయకుడు ఎజెండా నిర్ణయిస్తుంటే ఆయన అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాన్ని వెంట తీసు కుపోవలసిన ముఖ్యమంత్రి అదే ప్రతిపక్షాన్ని అనుసరించాల్సిన పరిస్థితికి ఆయనే బాధ్యుడనడంలో సందేహం లేదు. ఇటువంటి స్థితిలో అఖిలపక్షమో, అఖిల సంఘమో అర్థం కాని, ఏ మాత్రం ప్రయోజనం లేని కుప్పిగంతులు ఆపడం మంచిది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా తెచ్చి తీరే విధంగా, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరే విధంగా ప్రధాన ప్రతిపక్షమూ, ప్రజలూ చేస్తున్న పోరాటాలకు ఊతం ఇచ్చే విధంగా స్టేట్స్‌మన్ చంద్రబాబు నిర్ణయాలు ఉంటేనే ప్రజలు హర్షిస్తారు.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment