అభద్రతా వలయంలో చంద్రుడు
డేట్‌లైన్ హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిన ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో తమ పార్టీకి అన్యాయం జరిగిందంటూ నోరెత్తి చెప్పుకునే అర్హత పూర్తిగా కోల్పోయారు. ఓటుకు కోట్లు వ్యవహారం నడిపించి ఇంకొన్నాళ్లు హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించే అవకాశాన్ని వదులుకున్న చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పెద్దలు తెలంగాణలో తమ పార్టీకి అక్కడి అధికార పార్టీ వల్ల జరిగిన నష్టాన్ని గురించి నోరెత్తే అర్హతను కూడా సోమవారం రాత్రి భూమా నాగిరెడ్డి బృందాన్ని తమ పార్టీలో చేర్చుకుని కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజులలోనే ఆయనకు ఒక కోరిక ఉండేదట. దాని గురించి స్నేహితులతో చెబుతూ ఉండేవారట కూడా. ఏనాటికయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అన్నదే ఆ కోరిక. నారావారిపల్లె నుంచి తిరుపతికి బస్సులో రావడానికి కూడా డబ్బులు లేని రోజులవి. తాడూ బొంగరం లేదు, కాణీకి ఠికానా లేదు. బాబు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడని సావాసగాళ్లంతా ముక్కున వేలేసుకునేవారట.
అవి యూనివర్సిటీలో ఎం.ఎ. చదువుతున్న రోజులు. తీరిక దొరికి నప్పుడల్లా ఇదే పాట. కోరికలు అందరికీ ఉంటాయి. అవన్నీ నేరవేరేనా? అని ఆయన మాటలను తేలిగ్గా తీసుకునేది ఆయన మిత్రబృందం. ఓ ఇరవయ్యేళ్లు కాలగర్భంలో కలసిపోయాయి. చంద్రబాబునాయుడు 1995 చివర్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కల నెరవేరింది. పాత మిత్రులంతా ఆయన చిరకాల వాంఛను గుర్తు చేసుకుని మనవాడు పట్టుదలతో అనుకున్నది సాధించాడు, పట్టుదల అంటే అలా ఉండాలి! భేష్ అని మెచ్చుకున్నారు. ఇదంతా చంద్రబాబు తన మామగారు ఎన్.టి. రామారావుకు శ్రమతో దక్కిన అధికారాన్ని అక్రమంగా లాగేసుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పుడు కొన్ని పత్రికలలో ఆయన దృఢసంకల్పాన్ని వేనోళ్ల కీర్తిస్త్తూ రాసిన కథనాలలో భాగంగా మనం కూడా చదువుకున్నదే.
పదవే ముఖ్యం
చంద్రబాబు కోరిక నెరవేరింది నిజమే, కానీ అది ఏ విధంగా అన్నది ఆ మిత్రులు మరిచిపోయారు. మిత్రులు కాబట్టి, విషయం తెలిసినా, ఎలా అయితే ఏమి మన మిత్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని మురిసిపోయి ఉంటారు. ఏ మార్గంలో వెళ్లామన్నది అనవసరం. అంతిమ ఫలితం ఏమిటన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారై చాలా కాలమైంది. ఓ ఇరవై సంవత్సరాల క్రితమే రాజకీయాలలో నీతి అనేది నేతి బీరకాయలో నెయ్యి వంటిదని చెప్పినవారు చంద్రబాబు. దేశమంతటా సాగుతున్న ఫిరాయింపు రాజకీయాలకు ఆయన ఆదర్శం.
చంద్రబాబు 1995 ఆగస్ట్ సంక్షోభం సమయంలో వైస్రాయ్ హోటల్‌లో శిబిరం ఏర్పాటు చేసిననాడు 30, 35 మంది ఎమ్మెల్యేలకు మించి ఆయనతో లేరు. రెండోరోజు, మూడోరోజు గడిచే సరికి పత్రికల వార్తలకు భయపడి కొందరు, ప్రలోభాలకు లొంగి కొందరు మొత్తానికి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమయిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆయన పక్కన చేరారు. ఆ సంక్షోభం నాటి విషయాలు ఇప్పుడెందుకు అన్న సందేహం ఎవరికయినా కలగవచ్చు. అట్లా సందేహం కలగడం సహజం. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు లాక్కున్నాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పార్టీని గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారు కదా అన్న వాదన రావడం కూడా సహజమే. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ని సర్కస్‌లు చేస్తే అధికారంలోకి వచ్చిందీ అందరికీ తెలుసు. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ మధ్య ఓట్ల తేడా ఎంతో కూడా అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సిందే కానీ, ఈ 20 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజల భ్రమలు తొలగిపోయి ఎంత అసంతృప్తిలో ఉన్నారో కూడా ఆయనకు తెలుసు. ఎప్పుడేం జరుగుతుందో అనే అభద్రత ఆయనను వెన్నాడుతున్నట్టే ఉంది.
ఆది నుంచీ అభద్రతా భావమే
సోమవారం నాటి సాక్షి చానల్‌లో ఫోర్త్ ఎస్టేట్ చర్చలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం, అక్కడి ప్రభుత్వంలో భాగస్వామి భారతీయ జనతా పార్టీ నాయకుడు గరిమెళ్ళ చిట్టిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అభద్రతాభావం వల్లనే ప్రతిపక్ష శాసన సభ్యులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయిదేళ్లు పాలించమని ప్రజలు తీర్పు ఇచ్చాక అభద్రతాభావం ఎందుకు అన్న అంశం దగ్గరే 1995 ప్రస్తావన కూడా అవసరం. చంద్రబాబు నాయుడు చదువుకునే రోజులలో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న మాట నిజమే.
అప్పుడాయన యువకుడు. విద్యావంతులయిన యువకులు సహజం గానే నీతిమంతమయిన రాజకీయాల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమయినా మంచి చేద్దామనుకుంటారు. ఆయన ఆ దారి వదిలేసి, రెండో దారి వెతుక్కున్నారన్న విషయం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది. అడ్డదారులంటే కోపం రావచ్చు. ఇంగ్లిష్‌లో షార్ట్ కట్స్ అందాం. ఆయన షార్ట్ కట్స్ ద్వారానే ముఖ్యమంత్రి స్థాయికి రాగలిగారు. కాబట్టే అడుగడుగునా ఆయనను అభద్రతాభావం వెంటాడుతూ ఉంటుంది. అందుకే షార్ట్ కట్ పద్ధతులు అనుసరిస్తుంటారు. అత్యద్భుతమయిన ప్రజా తీర్పుతో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చాలా కొద్ది మాసాలలోనే కూలదోసి అధికారంలోకి రావడానికి కూడా చంద్రబాబునాయుడులో ఆనాడు ఉన్న అభద్రతాభావమే కారణం.
ఆనాటి మంత్రివర్గంలో రెండు ముఖ్య శాఖలు- రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇచ్చినా కూడా ఆయనలో అభద్రతాభావం అలాగే ఉండిపోయి, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసే దాకా వెళ్ళింది. ఆ తరువాత కూడా ఎన్టీఆర్‌తో ఉన్న శాసనసభ్యులను కూడా తన శిబిరంలోకి రప్పించుకునే వరకూ ఆయనను అభద్రత వదలలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని నడుపుకునేందుకు అవసరమైనంతమంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉన్నారు. అయినా ఎందుకు ప్రతిపక్ష శాసన సభ్యులను పార్టీలోకి లాక్కునే పనిలో పడ్డారు? తమ ప్రభుత్వ పనితీరు నచ్చి, అభివృద్ధిని కాంక్షించి ఓ నలుగురు శాసన సభ్యులు ప్రతిపక్షాన్ని వీడి తమ పంచన చేరారని తెలుగుదేశం వారు చెబుతున్నారు. మరి పక్క రాష్ర్టం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అధికార పార్టీలోకి వలసపోతే నీతిబాహ్యం అని నోరు పారేసుకున్నారెందుకు?
చంద్రబాబు అభద్రతాభావం కారణంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. అభద్రత కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అందులో నుంచి బయట పడాలనుకున్నారు. అది బెడిసి కొట్టి చివరికి తెలంగాణలో పార్టీ ఉనికి కూడా లేకుండా చేసుకున్నారు. తెలంగాణలో మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటున్నారు చూశారా తమ్ముళ్లూ అని జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు పక్షం రోజులు తిరక్కుండానే చేసిందేమిటి? ఆయనలో అభద్రతాభావం 2014 నాటి ఎన్నికలలో గెలిచిన క్షణం నుంచే ఉంది. అందుకే ప్రమాణ స్వీకారాలయినా కాకుండానే ఇద్దరు ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులకు తన పార్టీ కండువా కప్పారు. ప్రతిపక్ష శాసన సభ్యుల వేట కూడా ఆయన ఆనాడే ప్రారంభించారు. ఆ నలుగురిని లాక్కోడానికి 20 నెలలు పట్టింది.
నైతిక హక్కును కోల్పోలేదా?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిన ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో తమ పార్టీకి అన్యాయం జరిగిందంటూ నోరెత్తి చెప్పుకునే అర్హత పూర్తిగా కోల్పోయారు. ఓటుకు కోట్లు వ్యవహారం నడిపించి ఇంకొన్నాళ్లు హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించే అవకాశాన్ని వదులుకున్న చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పెద్దలు తెలంగాణలో తమ పార్టీకి అక్కడి అధికార పార్టీ వల్ల జరిగిన నష్టాన్ని గురించి నోరెత్తే అర్హతను కూడా సోమవారం రాత్రి భూమా నాగిరెడ్డి బృందాన్ని తమ పార్టీలో చేర్చుకుని కోల్పోయారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడే తల ఎగరేశారు. ఫిరాయింపు రాజకీయాల గురించి ఇక తెలంగాణ తెలుగుదేశం వీరుడు రేవంత్‌రెడ్డి ఏం ఫిర్యాదు చేస్తారు? తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరి చేతా రాజీనామాలు చేయించి మళ్లీ పోటీ చేసి గెలవండని శాసించే స్థితిలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మీ నిర్వాకం మాటేమిటి అని ఎవరయినా ఎదురు ప్రశ్నిస్తే? భవిష్యత్ రాజకీయాలను నడిపించాల్సిన యువతరం ఈ నీతిమాలిన వ్యవహారాలను నిలదీసి కడిగెయ్యాలి. కానీ నాన్న వేలు పట్టుకుని అలవోకగా పార్టీ మారిపోయిన యువ రాజకీయవేత్త అఖిలప్రియను చూశాక ఆ ఆశ కూడా సన్నగిల్లుతున్నది.
datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్