మాటలో ఆదర్శం, మనసులో విషం
డేట్‌లైన్ హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల అధికార పక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న భౌతిక దాడులు అధికార గణం మహిళా సమస్యల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగా దెబ్బతిని పోతున్న సీఎం ఆయన ప్రభుత్వ ఇమేజ్‌ని జాతీయ మహిళా పార్లమెంట్‌ల పేరిట ఎన్ని జాతరలు జరిపినా తిరిగి తెచ్చి పెట్టలేవు. ప్రభుత్వ ఉద్యోగి వనజాక్షి మొదలుకుని అనంతపురం జిల్లాలో ఒక అబల దాకా ఏపీలో అధికార పక్ష ప్రజా ప్రతినిధులు, నాయకులు వ్యవహరించిన తీరు ఆ రాష్ట్ర ప్రతిష్టను పెంచేదిగా ఎంతమాత్రం లేదు.
‘బసవతారకపుత్ర బాలకృష్ణ’ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూసి నా ఫ్రెండ్ ఒకరు ఫేస్‌బుక్ లోనో, వాట్స్‌యాప్‌లోనో స్పందిస్తూ ఈ సినిమాకు సంబంధించి అందరి పేర్ల ముందూ ఇలా తల్లుల పేర్లు ఉండటం చాలా సంతోషం కలిగించిందన్నారు. ఆ ఫ్రెండ్ చాలా ప్రగతిశీల భావాలు గల మహిళ. మానవ హక్కుల ఉద్యమ కార్యకర్త, మహిళా పక్షపాతి. పైగా విషయాలను విమర్శనా దృష్టితో పరిశీలించగల పాత్రికేయురాలు కూడా. ఆ ఫ్రెండ్ ఈ సినిమా చూశారో లేదో తెలియదు. చూసి ఉంటే ఆమె అందులో భారీ డైలాగ్‌లలో మహిళలకు లభించిన గౌరవానికి మరింత ఆనందంలో తల మునకలు అయ్యేవారేమో! శాతకర్ణి ఒక సందర్భంలో తన తల్లికి అగ్రపూజ చెయ్యాలనుకుంటే; కొందరు స్త్రీకి అగ్రపూజ ఏమిటి అని అభ్యంతరం తెలిపి నప్పుడు ఆయన చెప్పిన డైలాగు విని కచ్చితంగా మహిళలందరూ సంతోషి స్తారు. శాతకర్ణి నిజంగా అగ్రపూజ తల్లికి అందించాడా లేదా అనడానికి చారి త్రిక ఆధారాలు ఏమీలేవు. అసలు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మొత్తం చరిత్రను వక్రీకరించి తీసిందే అన్న విమర్శ ఉంది. ఇక్కడ ఆ చర్చ అప్ర స్తుతం. క్రిష్ అనే దర్శకుడు చెప్పినట్టు నటించడం, బుర్రా సాయిమాధవ్ అనే మాటల రచయిత రాసిచ్చిన డైలాగ్‌లను బట్టీ పట్టి అప్పచెప్పడం తప్ప అది బాలకృష్ణ ఒరిజినల్ క్యారెక్టర్ అనుకుంటే పొరపాటు.
తెర మాట మనసు మాట కాదు
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది, వియ్యంకుడు, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ఒరిజి నల్ క్యారెక్టర్ మహిళల విషయంలో ఏమిటో ఇటీవల ఒక సినిమా ఫంక్షన్ వేదికగా మాట్లాడిన మాటలు స్పష్టం చేస్తాయి. ఆ మాటలు చాలా మంది మీడియా ద్వారా విని ఉన్నారు, చదివి కూడా ఉన్నారు. మళ్లీ ఉచ్చ రించడానికి సిగ్గుగా ఉంది. చాలా మంది మగవాళ్లకు స్త్రీలంటే అటువంటి చిన్న చూపే ఉంటుంది, అయితే బయటపడరు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు తమ ఈ ఒరిజినల్ క్యారెక్టర్‌ని బయటకు రాకుండా జాగ్రత్త పడ తారు. హీరో బాలకృష్ణకు తాను రాజకీయాల్లో ఉన్నాననీ, అధికారపక్షంలో ఉన్నాననీ స్పృహ లేనట్టుంది. తరచూ సినిమా వాళ్లు చాలామంది మాట్లాడే భాషే ఆయనా మాట్లాడారు. అందుకే ‘బసవతారకపుత్ర బాలకృష్ణ’ అని స్క్రీన్ మీద కనిపించినంత మాత్రాన్నే ఆ ఫ్రెండ్ ఎక్సైట్ కావడం ఆశ్చర్యం కలిగించింది. బాలకృష్ణకు రాజకీయాలు తెలియవు, పైగా స్టార్ హీరో, అభి మానులను అలరించడానికి ఎన్నో మాట్లాడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు కూడా బాలకృష్ణ స్థాయిలోనో, అంత కంటే క్రింది స్థాయిలోనో మాట్లాడితే ఏమనుకోవాలి?
పేరు గొప్ప సదస్సు దిబ్బ
జాతీయ మహిళా పార్లమెంట్ పేరుతో ఆంద్రప్రదేశ్ శాసనసభ ఆధ్వర్యంలో మొన్న అమరావతిలో జరిగిన మూడురోజుల సమావేశాలు జరిగిన తీరు, ఆ సందర్భంగా ఈ ఇద్దరు నాయకులు చేసిన వ్యాఖ్యానాలు, జరిగిన పరిణా మాలు ఈ ప్రశ్నకు తావిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృ«థా చేసి నిర్వహించిన ఈ మూడురోజుల సభలు తమకు అనుకూలురయిన వారి చేత తమకు సంతోషం కలిగించే కొన్ని ముచ్చట్లు చెప్పుకోడానికి తప్ప సాధిం చింది శూన్యం, కొండను తవ్వి ఎలుకనయినా పట్టలేకపోయారు. జాతీయ మహిళా పార్లమెంట్ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు? అందులో ఎంతమంది ప్రజా ప్రతినిధులను దేశవ్యాప్తంగా ఆహ్వానించారు? అందులో భిన్నాభిప్రా యాలు ఏమయినా వెలువడ్డాయా? వాటి మీద చర్చ జరిగిందా? వాటి సారాంశంగా తీర్మానాలు, సిఫార్సులు ఏమయినా చేశారా..? అంటే ఏమీ లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు మహిళా సాధికారత విషయంలో గతంలో చాలానే జరిగాయి. ఇది వాటికి భిన్నంగా ఏమీలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ఇమేజ్‌ను పెంచుకోడానికి జరిపిన ఒక ఈవెంట్‌గా ముగిసింది.
ఏపీలో మహిళల దుస్థితి తెలియనిదా?
కానీ గత రెండున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల అక్కడి అధికార పక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న భౌతిక దాడులు అధికారగణం మహిళా సమస్యల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగా దెబ్బ తిని పోతున్న ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వ ఇమేజ్‌ని జాతీయ మహిళా పార్లమెంట్‌ల పేరిట ఎన్ని జాతరలు జరిపినా తిరిగి తెచ్చిపెట్ట లేవన్నది సత్యం. ప్రభుత్వ ఉద్యోగి వనజాక్షి మొదలుకుని అనంతపురం జిల్లాలో ఒక అబల దాకా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్ష ప్రజా ప్రతినిధులు, నాయకులు వ్యవహరించిన తీరు ఆ రాష్ట్ర ప్రతిష్టను పెంచేదిగా ఎంతమాత్రం లేదు. ఆయా సంఘటనల్లో పోలీసు యంత్రాంగం ధోరణి దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఉంటున్నది. కర్నూలు జిల్లాలో అత్యాచారానికి గురయిన ఒక మహిళ తన భర్తను వెంట బెట్టుకుని న్యాయం కోసం రాష్ట్ర రాజధాని పోలీ సుల దగ్గరికి వెళితే జాతీయ మహిళా పార్లమెంట్ భద్రతా పనుల్లో తీరిక లేని పోలీసులు ఆమె గోడు పట్టించుకోక పోవడం ఆ రాష్ట్ర పోలీసు పెద్దల ప్రాధా న్యతలను స్పష్టం చేస్తున్నది.
ఏం మాట్లాడాలో పోలీసులు చెబుతారా!
మహిళా జాతీయ పార్లమెంట్‌లో ఒక శాసనసభ్యురాలు ఆర్ కే రోజా ఏం మాట్లాడాలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సాంబశివరావు నిర్దేశిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యురాలి హోదాలో రోజాకు ఈ సమావేశాలకు ఆహ్వానం అందుతుంది, హోటల్ గది బుక్ చేస్తారు, విమానాశ్రయానికి కార్ కూడా పంపుతారు. తీరా ఆమె వెళ్తే అరెస్ట్ చేసి దొంగ దారిలో తిప్పి తిప్పి హైదరా బాద్ పంపించేస్తారు! ఇదేమి అన్యాయం అని అడిగితే డీజీపీ సాంబశివరావు ఆమె వివాదాలు రేగకుండా ఉండేవిధంగా మాట్లాడుతానని హామీ ఇస్తే అను మతిస్తాం అంటారు. సభలను నిర్వహించేదీ, ఆహ్వానాలు పంపేదీ శాసనసభ స్పీకర్. అందులో పాల్గొనే వాళ్లు ఏం మాట్లాడాలో నిర్ణయించేది పోలీసు బాస్. భిన్నాభిప్రాయాలు చర్చకు రావలసిన, ఆ చర్చల ద్వారా మహిళా సాధి కారతకు ఏ కొద్ది మేలు అయినా జరగవలసిన వేదిక మీద ఏం చర్చించాలో పోలీసులు నిర్ణయించడానికి మించిన దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండ దేమో! ప్రత్యేక హోదా కోసం జనం శాంతియుతంగా విశాఖపట్నం రామ కృష్ణా బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినా, కడప జిల్లాలోమంచి నీళ్ల కోసం మహిళలు బిందెలతో ప్రదర్శనలు జరిపినా వాటిని ప్రజాస్వామ్య కోణం నుంచి కాకుండా పోలీసు కళ్లతో చూడటం, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను కూడా ఇష్టం వచ్చినట్టు అడ్డగించడం అరెస్టులు చెయ్యడం ఆంధ్రప్రదేశ్‌లో నిత్యకృత్యం అయినట్టుంది.
అన్నీ ఒక తాను ముక్కలే
ఇక ప్రారంభంలో చెప్పుకున్నట్టు శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన మాటలు వింటే పోలీసు పెద్దలు అట్లా వ్యవహరించడాన్ని తప్పు పట్టి లాభం ఏముం దిలే అనిపించక మానదు. సమావేశాల సందర్భంగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ కొత్త కారు గ్యారేజ్‌లో, స్త్రీలు ఇంట్లో ఉంటేనే ప్రమాదాలు జరగవు, భద్రంగా ఉంటారని అన్నారు. కొన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి ప్రజల కోసం చట్టాలు చెయ్యవలసిన సభకు అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ఇట్లాంటి అభి ప్రాయం కలిగి ఉండటం దేశవ్యాప్తంగా విమర్శకు, నిరసనకు దారితీసింది. ఇది వ్యక్తీకరణ లో లోపం తప్ప స్పీకర్ మాట్లాడిన దానిలో తప్పేముంది అని ఆయనను వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ మీడియా కూడా అమ్ముడుపోయింది. కాబట్టి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది అని విరుచుకుపడ్డారు.
నాయకుడి తీరే అదే అయితే...?
మీడియా మేనేజ్‌మెంట్‌లో కాకలు తీరిన చంద్రబాబు నాయుడు ఒక్కసారి మీడియాలో సత్యాలు వినిపిస్తే సహించలేక పోతున్నారు. అదే నిజమయితే అనుకూల మీడియా అంతా ఆయనకు అమ్ముడు పోయినట్టేనా? ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వ్యవహారంలో గతంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దు అంటుందా?’ అని ఆడవాళ్లను అవమానించే విధంగా మాట్లాడిన చంద్ర బాబునాయుడుకు స్పీకర్ మాట్లాడిన మాటల్లో తప్పు ఎందుకు కనిపిస్తుంది? స్థాయి వేరయినా, హోదాలు వేరయినా బాలకృష్ణ, కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు నాయుడు తదితరుల ఆలోచనా ధోరణిలో తేడా ఉండదన్న విషయం స్పష్టం. అన్నీ ఆ తానులో ముక్కలే కదా!
datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్