
లైంగిక హింస బాధితులపై దీర్ఘకాలపు దుష్ప్రభావాన్ని చూపడమే కాకుండా కుటుంబంపైన, జనసమూహంపైన, మొత్తం సమాజంపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా, అవి సరిపోవటం లేదు. ఒక జాడ్యంలా విస్తరిస్తున్న ఈ లైంగిక హింస పరిష్కారానికి గట్టి మార్గాన్వేషణ సాగాలి. అంతకు ముందు భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింది సెక్షన్లతో
నేరాల నియంత్రణ సాధ్యపడలేదు.
‘నీ మౌనం నిన్ను కాపాడదు’
అని ఎలుగెత్తి చాటారు ప్రఖ్యాత కవయిత్రి, పౌరహక్కుల ఉద్యమకారిణి అడ్రి లోర్డ్ (1934–92). మనుషుల్ని మనసారా నమ్మే మంచితనం, ‘దగ్గరి తనం’ ముసుగు కింది మృగాలనెరుగని అమాయకత, దురాగతాలపై పెగలని గొంతు.... వెరసి ఈ దేశపు బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేస్తున్నాయి. ప్రతి ఘటించని తప్పుడు భావనలతో తరాల తరబడి వారసత్వంగా వస్తున్న ఈ ‘మౌనమే’లైంగిక దాడులకు గురవుతున్న పసిమొగ్గలకు శాపంగా పరిణమిస్తోంది. వారి మౌనమే తమ వికృత క్రీడల మైదానంగా కామంతో కళ్లు మూసుకుపోయిన ‘మృగా’ళ్లు దేశంలో కోట్లాది మంది పసిమొగ్గల్ని కర్కశంగా నలి పేస్తున్నారు. తెలిసి చేసిన నేరమైనా, అది వెలుగుచూడక, సమాజంలో వారింకా పెద్దమనుషులుగానే చలామణి అవుతున్నారు. వివిధ స్థాయిల్లో కామవాంఛను తీర్చుకునే వీరి చేష్టలు చిన్నారుల భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నాయి. పసితనపు వాకిట్లోనే వారి నూరేళ్ల జీవితం దారితప్పుతోంది. తట్టుకోలేని వారు ఆత్మహత్యలతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మిగిలిన వారు, చేదు జ్ఞాపకాలు జీవితకాలం వెన్నాడుతుంటే ఏదోలా బతికేస్తున్నారు. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే, సమీప భవిష్యత్తులోనే ఒక బలహీనమైన సమాజావిష్కరణ తప్పదేమోనన్న ఆందోళన ఆలోచనాపరులకు కలుగుతోంది. తల్లిదండ్రుల తప్పుడు భావనలు, దారి తప్పిస్తున్న ఆధునిక సాంకేతిక సౌలభ్యాలు, గట్టిగా నిలవని చట్ట–న్యాయ ప్రక్రియలు ఈ దిశలో పిల్లల కష్టాలను మరింత ఎక్కువ చేస్తున్నాయి. అఖిల భారత స్థాయిలో జరిగిన సర్వే గణాంకాలు విజ్ఞానవంతమౌతున్న సమాజపు సభ్యులుగా మనందరినీ సిగ్గు పడేటట్టు చేసేవిగా ఉన్నాయి.
లైంగిక హింసకు రూపాలెన్నో....
పసిపిల్లలపై సాగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఇటీవల నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే లైంగిక దాడులు వివిధ రూపాల్లో ఉంటాయి. పెద్ద నేరంగా భావించలేమనిపించే పిల్లచేష్టలతో మొదలయ్యే ఈ దాడులు వికృతి రూపు సంతరించుకుంటాయి. మనోభావనల పరంగా, çసంజ్ఞలు–సంకేతాలుగా, మానసికంగా, శారీరకంగానూ పిల్లలపై సాగే ఈ లైంగిక దాడులు శరీరాన్ని తాకని పద్ధతిలోనే కాకుండా తాకి, భౌతికంగా తీవ్ర హింసకు గురి చేసే అత్యాచారాల వరకూ విభిన్న రూపాల్లో ఉంటాయి. అవన్నీ బాధితుల్లో వేదన కలిగించేవే! ఆడపిల్లలపైనే కాకుండా మగపిల్లలపైనా ఈ దాడులు జరుగుతున్నాయి. అమానుషంగా సాగే ఈ దాడులు లింగ, ప్రాంత, వయో, ఆర్థిక, అక్షరాస్యతా స్థాయి వ్యత్యాసాలకు అతీతంగా అంతటా జరగటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే వెల్లడైన ఓ సర్వే ప్రకారం 18 ఏళ్ల లోపు ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది. ప్రతి అయిదుగురిలో ఒకరు లైంగిక పరంగా అభద్రతతో ఉన్నట్టు గుర్తించారు. దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని, 45,844 మంది పిల్లలతో, వారి స్థాయికి దిగి మాట్లాడి సేకరించిన (డాటా) సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు. ‘వల్డ్ విజన్ ఇండియా’ నిర్వహించిన ఈ సర్వేలో చాలా విషయాలు వెల్లడయ్యాయి. నాలుగు కుటుంబాలలో ఒకటి కూడా ఫిర్యాదు చేయడం లేదు. కేంద్రం జరిపిం చిన ఒక సర్వేలోనూ, సమాజంలో జరుగుతున్న ఈ అనర్థాల్లో నమోదవుతున్న కేసులు నాలుగోవంతు కూడా ఉండటం లేదని తేలింది. అంతులేని మౌనం వల్ల సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఓ అంచనా దొరకటం లేదు.
దగ్గరివారి దాష్టీకాలే ఎక్కువ
పిల్లలపై జరుగుతున్న లైంగిక హింసలో 97 శాతం కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు పాల్పడుతున్నవే అన్నది గగుర్పాటు కలిగించే నిజం. అపరిచితుల నుంచి జరిగే నేరాలు చాలా తక్కువ. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితులు 304 మందిలో బాధితుల బంధువులే 128 మంది ఉన్నారు. 73 మంది వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. మిగిలిన 103 మందిలో పరిచయస్తులే ఎక్కువ. పిల్లల బంధువులు, సన్నిహితులు, పరిచయస్తులై ఉండీ వారిపై లైంగిక హింసకు తలపడటానికి, బాధితుల వైపు నుంచి రాజ్యమేలుతున్న మౌనమే ప్రధాన కారణం. ఎక్కడైనా జరిగేదే అనో, పెద్దవాళ్లకూ తమ చిన్నతనంలో అటువంటి అనుభవాలుండటమో, చెప్పుకుంటే బయట పరువు పోతుందనే భయమో.... మొత్తమ్మీద కారణమేదైనా, నిజాలు వెలుగు చూడటం లేదు. ఆ పరిస్థితే మృగా’ళ్లకు తెగించే ధైర్యాన్నిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి మౌనం వీడటం, ఈ అంశంపై ఎడతెగని చర్చను లేవనెత్తడం ఒక పరిష్కారం. పిల్లల్లో అవగాహన పెంచడం, ప్రతిఘటించి–దోషుల్ని శిక్షించి–ఇతర పరి ష్కారాలు వెతకడం గురించి వారు ఆలోచించేలా పరివర్తన తీసుకురావడమే మార్గమని ఈ అంశంపై పనిచేస్తున్న పౌర సంస్థల వారంటున్నారు. బావలు, మేనమామలు, వరుస సోదరులు, బాబాయ్‌లు, కడకు మారు తండ్రి, కన్నతండ్రి వరకు, నా అనుకునే వాళ్లే పసికందుల్ని కాటేసే ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. పని ప్రదేశాల్లో కొందరు యజమానులు, బడిలో కొందరు కీచక టీచర్లు చేసే పైశాచిక చేష్టలకు పిల్లలు నలిగిపోతుంటారు. వెకిలి మాటల నుంచి, రోత పుట్టించే సంజ్ఞలు–సంకేతాల నుంచి, శరీరాన్ని–ముఖ్యంగా జననాంగాల్ని తడిమే దుశ్చేష్టల వరకు అంతే ఉండదు. వాటిలో బయటపడేవి కొన్నే! అనాథలు, తల్లిదండ్రులు లేని వారు, వీథి పిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నవారు ఎక్కువగా ఈ దురాగతాలకు బలవుతున్నారు.
తోడవుతున్న పాడు పరిస్థితులు...
పెరుగుతున్న శాస్త్ర–సాంకేతికతను ఆసరా చేసుకొని జడలు విప్పే విష సంస్కృతిపై నియంత్రణ లేకపోవడం పిల్లల పాలిట శాపంగా మారుతోంది. విజ్ఞానం పెరుగుతున్నా విలువలు తగ్గుతున్న సామాజిక స్థితి వారెదుర్కొం టున్న లైంగిక దాడుల సమస్యను జటిలం చేస్తోంది. సెక్స్ ఎడ్యుకేషన్ లేని మన వ్యవస్థలో ఇంటర్నెట్ విస్తృతి, విచ్చలవిడి శృంగార వెబ్‌సైట్లు (పోర్నో), గేమింగ్ కల్చర్ వంటివి యువతను, పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. పోర్నో సైట్లపైనే కాక పిల్లలపైన కూడా తల్లిదండ్రులకు నియంత్రణ లేని పరి స్థితి సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. స్మార్ట్ ఫోన్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత, ముఖ్యంగా కౌమారదశలో ఉన్న పిల్లలు సదరు సైట్లు చూసే అవకాశం, ప్రమాదపు ఆస్కారం రమారమి పెరిగింది. ఆన్‌లైన్‌లో యుక్తవయసు పిల్లల్ని లైన్‌లో పెట్టి ప్రేరేపణలు చేసే దురాలోచనాపరులు, మోసగాళ్ల అవకాశాలు మెరుగయ్యాయి. ముఖ్యంగా పెద్దవాళ్లతో చనువుగా ఉండే పిల్లల భద్రతకు ముప్పు ఏర్పడింది. పిల్లలతో మాటా మాటా కలపడం, నచ్చేలా ప్రవర్తించడం, పొగడటం, అర్ధనగ్న–నగ్న చిత్రాల పరస్పర మార్పిడి.... ఇలా మెల్లమెల్లగా ముగ్గులోకి లాగుతారు. బయటివారెవరికీ తెలియకుండానే బాధితులకి–నిందితులకి మధ్య బంధం బలపడుతుంది. తెలిసీ తెలియని పిల్లల బలహీనతల్ని ఆసరా చేసుకొని, నిర్మిత (వర్చువల్) శృంగార ప్రపంచంలో రెచ్చగొట్టి, వాస్తవిక ప్రపంచంలో ప్రయోగాలకు పురిగొల్పుతున్నారు. ఏదో రూపంలో లొంగదీసుకుంటారు. ఒక బలహీన క్షణంలోనో, బ్లాక్‌మెయిల్ ద్వారా బలవంతపెట్టో తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారని కౌన్సిలర్లు, సైబర్‌నేరాలు దర్యాప్తు చేసే అధికారులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి పిల్లలపై లైంగిక హింసను పెంచుతోంది.
సమాజంపైనే దుష్ప్రభావం
దీర్ఘకాలం పాటు లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లల్లో మానసిక, శారీరక వేదనకు తోడు ఆత్మన్యూనతా భావం బలపడుతుంది. తానెందుకూ పనికిరానన్న భావన పెరిగిపోతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులితరులపై విశ్వాసం సన్నగిల్లుతుంది. క్రమంగా ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలు అధికమౌతాయి. లైంగిక హింస బాధితులపై దీర్ఘకాలపు దుష్ప్రభావాన్ని చూపడమే కాకుండా కుటుంబంపైన, జనసమూహంపైన, మొత్తం సమాజంపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా, అవి సరిపోవటం లేదు. సమాజం వైపు నుంచి పెద్ద ఎత్తున సహకారం అవసరం. ఒక జాడ్యంలా విస్తరి స్తున్న ఈ లైంగిక హింస పరిష్కారానికి గట్టి మార్గాన్వేషణ సాగాలి. అంతకు ముందు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింది సెక్షన్లతో నేరాల నియంత్రణ సాధ్యపడలేదు. కొన్ని సున్నితాంశాల నియంత్రణకు అందులో పేర్కొన్న నిబంధనలు, పద్ధతులు సరిపోకపోవడంతో 2012లో కేంద్ర ప్రభుత్వం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు ‘పోక్సో’కొత్త చట్టాన్ని తెచ్చింది. లైంగిక హింసే కాకుండా, అందుకు తలపడటం, యత్నించడం, సహకరించడం... తదితరాంశాల్ని నేరాలుగా ఇందులో చేర్చింది. శిక్షల్ని పెంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. వివిధ విభాగాలకు చెందిన మహిళా అధికారులతో ఏర్పడ్డ ఈ కమిటీ పలుమార్లు భేటీ అయి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలు అంతంతే! పిల్లలపై జరిగే లైంగిక నేరాలపై విస్తృత ప్రచారం జరగాలని, అవగాహన కల్పించాలని, చిన్న తరగతుల నుంచే ఈ విషయాన్ని పాఠ్యాంశగా చేర్చి తరగతులు పెరిగే క్రమంలోనే అవగాహనను సిలబస్ ద్వారా పెంచుతూ రావాలని నిర్ణయించారు. ప్రతి విద్యా సంస్థలోనూ సమస్య తలెత్తకుండా ఈ విషయాన్ని వివరించే కౌన్సిలర్లు ఉండాలనీ ప్రతిపాదించారు. ఇది అమలుకు నోచలేదు.
మౌనం ఛేదిస్తేనే...
నేరస్తులకు ఆసరాగా, బాధితులకు శాపంగా మారిన మౌనాన్ని ఛేదించాలి. విషయంపై విస్తృతంగా చర్చ జరగాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ప్రధాన బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుంచే అన్ని విషయాలపై అవగాహన కలిగించాలి. ఆడ–మగ మధ్య తేడా చూపకుండా పెంచాలి. జననాంగాలు, యుక్తవయసులో వాటి ఎదుగుదల, పునరుత్పత్తి, వ్యక్తిగత స్వేచ్ఛ–హక్కుల గురించి బోధిస్తుండాలి. ఇతరులు చేసే ఏ చిన్న వెకిలి చేష్టనయినా సహించకూడదని, ప్రతిఘటించాలని, తమ దృష్టికి తేవాలని నేర్పాలి. ఎదిగే పిల్లలతో బంధువులెవర్నీ పడక పంచుకునే ఆస్కారం కల్పించకూడదు. వారున్న గదిలో ఇతరులెవరూ పడుకోకుండా చూడాలి. ఎవరూ చెడుగా, అభ్యంతరకరంగా వారిని తాకడాలను ఉపేక్షించకూడదు. మేధస్సు తగుస్థాయిలో వికసించే వరకు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దు. ౖ‘చెల్డ్‌లాక్’సదుపాయం ఉన్నా 13 శాతం మందే ఈ పద్ధతిని వాడుతున్నారు. పిల్లల కదలికలు, ఆలోచనలు, ఆచరణల్ని ప్రేమ పూర్వకంగానే తల్లిదండ్రులు గమని స్తుండాలి. మితిమీరుతున్నారనిపించినపుడు కొంత నియంత్రణ అవసరమే! పిల్లల్ని జాగ్రత్తగా పెంచేటట్టు తల్లిదండ్రుల్ని కార్యోన్ముఖుల్ని చేసేలా ప్రసారమాధ్యమాలు కృషి చేయాలి. చర్చని ప్రోత్సహించాలి. పిల్లలపై లైంగిక దాడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని వేల స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వారి కృషి మరింత సమీకృతంగా జరగాలి. ఈ విషయాల్లో ఒకటి మాత్రం అందరూ గ్రహించాలి. మౌనమే శత్రువు, చర్చే నేస్తం!
(‘బాలలపై లైంగికదాడులు–నివారణలో మీడియా పాత్ర’పై నేడు హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సందర్భంగా)
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment