భారత సామాజిక వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వాలకు నోచుకోక, అంటరానితనానికి గురవుతున్న నిమ్నకులాల కోసం తొలిసారిగా కలం పట్టిన అక్షరయోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన గ్రంథకర్తగానే గాక ప్రజాహిత పాత్రికేయునిగా ముద్రవేసుకున్న మేధావి. ఆంగ్లేయ పాలనలో నిమ్నకులాలకు అంచలంచెలుగా రక్షణలు సాధించేం దుకు కృషి చేశారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎస్.కె.బోలే, ఘొలప్ వంటి సంస్కర్తలతో కలిసి 1924లో బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా నిమ్నకులాల విద్యార్థులకు పాఠశాలలు, హాస్టళ్ళ ఏర్పాటుతో పాటు ‘సరస్వతి విలాస్’ పత్రికను ఏర్పాటు చేశారు. నిమ్నకులాల ఉద్యమంలో భాగంగా పత్రికారచనకు పూనుకున్నారు. స్వయంగా పత్రికలను నిర్వహించారు. సామాజిక పునర్నిర్మాణం కోసం ఆయన పత్రికలు కీలకపాత్ర పోషించాయి. డాక్టర్ అంబేడ్కర్ నిర్వహించిన ‘మూక్‌నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘సమత’, ‘జనత’ పత్రికలు నిమ్నకులాల ఆత్మగౌరవ, హక్కుల ఉద్యమానికి వాహికగా నిలిచాయి.
కొల్హాపూర్ మహారాజా ఆర్థిక సహకారంతో 31, జనవరి, 1920లో డాక్టర్ అంబేడ్కర్ ‘మూక్‌నాయక్’ పక్ష పత్రికను ప్రారంభించారు. నిమ్నకులాల పోరాటాలు, అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు, రచనలు ఈ పత్రిక ప్రచురించేది. విషయం పట్ల అవగాహనతో, ఆధారాలతో, పాఠకులు వాస్తవాలను గ్రహించి, అంగీకరించే రీతిలో ‘మూక్‌నాయక్’’ పత్రికను ఆయన నిర్వహించారు. అంటరానితనం నిర్మూలన, సంఘసంస్కరణ మీద జరుగుతున్న చర్చలు, వాదప్రతివాదాలు ఈపత్రికలో ప్రచురించేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎమ్మెస్సీ చదివే అవకాశం రావడంతో ఆయన తన మిత్రులకు ‘మూక్‌నాయక్’ పత్రిక నిర్వహణను అప్పగించారు. ఆర్థిక కారణాలతో పత్రిక ప్రచురణ ఆగిపోయింది.
డాక్టర్ అంబేడ్కర్ 1927, ఏప్రిల్ 3న ‘బహిష్కృత భారత్’ మరాఠీ పక్ష పత్రికను బొంబాయి కేంద్రంగా ప్రారంభించారు. తాగునీటికోసం జరిగిన మహద్ పోరాటంలో సంఘసంస్కర్తలను తన రచనలతో సమన్వయ పరిచిన ఘనత ఆయనదే. నిమ్న కులాలను ఒకతాటిమీదకు తీసుకొచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపగలిగారు. ‘బహిష్కృత భారత్’ పత్రిక ద్వారా అంబేడ్కర్ నిమ్నకులాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగారు. ‘అంటరానితనం నిర్మూలన నా జన్మహక్కు’ అనే నినాదాన్ని 27 నవంబర్, 1927న ‘బహిష్కృత్ భారత్’ పత్రికలో ప్రచురిం చారు. ఈలోపు సైమన్ కమిషన్‌తో సంప్రదింపులు, అనంతరం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావలసి రావడంవల్ల అంబేడ్కర్ ‘బహిష్కృత్ భారత్’ పత్రిక ప్రచురణ నిలిపివేశారు.
అంబేడ్కర్ తన పత్రికల ద్వారా కోట్లాది మంది అంటరాని ప్రజానీకంలో కొంతమేర సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితి గతుల్లో మార్పు తీసుకొచ్చారు. నిమ్నకులాలకు పత్రికా రచన వారసత్వాన్ని తీసుకొచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో పత్రిక స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మాట్లాడే స్వేచ్ఛ లేని, దోపిడీకి గురవుతున్న కోట్లాదిమంది నిమ్నకులాల కోసం అంబేడ్కర్ పాత్రికేయునిగా అవతరించారు. అణగారిన వర్గాల దాస్యవిమోచకునిగా నాటి పత్రికారంగం ఆయన సేవలను కొనియాడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందుస్తాన్ టైమ్స్, ది ప్రి ప్రెస్ జర్నల్, ది అమృత్ బజార్ పత్రిక, ది న్యూయార్క్ టైమ్స్, ది టైమ్స్ (లండన్) మొదలైన పత్రికలు అంబేడ్కర్ స్వాతంత్య్ర ఉద్యమంలోను, భారత సామాజిక పునర్మిర్మాణంలోనూ పోషించిన పాత్రను కొనియాడుతూ సంపాదకీయాలను ప్రచురించాయి. నిర్మాణాత్మక తప్పిదాలపై ఉద్యమించి ఫలితాలు సాధించిన వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను ఈ దేశం సుదీర్ఘ కాలం గుర్తిం చుకోవలసి వుంటుందని ‘ది ప్రి ప్రెస్ జర్నల్’ పేర్కొంది. ‘ది అమృత బజార్ పత్రిక’ తాను అనుకున్న లక్ష్యాలను సాధించడంలో, దేశభక్తునిగా వ్యవహరించడంలో భారత ఉపఖండంలోనే ఉన్నతునిగా డాక్టర్ అంబేడ్కర్‌ను కీర్తించింది. మానవహక్కుల కోసం, ప్రజాహితం కోసం పోరాటం చేసిన మరుపురాని వ్యక్తిగా ఆయన్ని కొనియాడింది.
(అంబేడ్కర్ 1920 జనవరి 31న స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా)
డా. జి.కె.డి. ప్రసాద్
వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం,
ఏయూ, విశాఖపట్నం మొబైల్ : 93931 11740
Comments
Please login to add a commentAdd a comment