సుపరిపాలనే గెలిపించింది | Good Administration leads win in Himachal, Gujrath | Sakshi
Sakshi News home page

సుపరిపాలనే గెలిపించింది

Published Tue, Dec 19 2017 1:17 AM | Last Updated on Tue, Aug 21 2018 2:56 PM

Good Administration leads win in Himachal, Gujrath - Sakshi

అభిప్రాయం
రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడినా గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో బీజేపీ గెలుపొందడానికి నరేంద్రమోదీ హామీ పడిన సుపరి పాలనే కారణం. ఆర్థిక సంస్కరణలు కొనసాగింపునకు ఇది ఊతమిచ్చే విజయం.

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి 3 రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించింది. 19 ఏళ్లపాటు సోనియాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించి తన వారసత్వాన్ని తన కుమారుడు రాహుల్‌ గాంధీకి అప్పగించారు. లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువ స్థానాలతో (44) కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తరుణంలో అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించడం, ముందున్న ముళ్లబాట మీద నడవటం యువకుడు రాహుల్‌ గాంధీకి సవాలే. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో రాహుల్‌ గాంధీ ఒక సవాల్‌ని స్వీకరించినట్లే. కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ 5వ తరం నాయకుడు.

ప్రస్తుత ఎన్నికలకు వస్తే హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమి నుంచి కాంగ్రెస్‌ పార్టీ పాఠాలు నేర్వవలసిందే. గత 3 దశా బ్దాలుగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే నాయకుణ్ణి పట్టుకుని వేళ్లాడింది కాంగ్రెస్‌ పార్టీ. కురువృద్ధుడు వీరభద్రసింగ్‌నే నమ్ముకుంది. మరో నాయకుణ్ణి తయారు చేయలేకపోవడం, కాంగ్రెస్‌ నాయకత్వం అసమర్థతే అనాలి. అనేక రాష్ట్రాల్లో యువతరం నాయకులు ముందుకొస్తుంటే, మరోపక్క హిమాచల్‌లో మాత్రం యువ నాయకత్వాన్ని గానీ, కొత్త నాయకత్వాన్ని గానీ ప్రోత్సహించనందుకే అక్కడ అధికారం కోల్పోయింది. మరోవైపున నరేంద్రమోదీ తన సుపరిపాలనతో ప్రజలకు మరింత దగ్గరవుతూ, ఒక్కో రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇప్పుడు బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. నరేంద్రమోదీ, అమిత్‌ షా ద్వయం ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి ఎన్నికనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఎన్నికలకు సిద్ధమవుతారు. మునిసిపల్‌ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా వీరిద్దరూ ఒకేవిధంగా పనిచేస్తారు. అందరితో పని చేయిస్తారు. విజయాన్ని సాధిస్తారు.

అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వలేమితో సతమతమవుతోంది. పెద్ద రాష్ట్రాలైన బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేరనే చెప్పాలి. కొత్త తరం నాయకులు రావాలి. అప్పుడే కొంత కోలుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వడం కూడా అనుమానమే. 27 ఏళ్లుగా కాంగ్రెస్‌ బిహార్‌లో అధికారానికి దూరంగా ఉంటోంది. అలాగే బెంగాల్‌లో గత 40 ఏళ్లుగా, ఒడిశాలో గత 20 ఏళ్లుగా అధికారంలోకి రాలేకపోయింది. తమిళనాడు సరేసరి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ గత 14 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంటోంది. ఒకవైపున ఈ రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలి. నాయకత్వాన్ని పెంచాలి. మరోపక్క భాజపా నాయకత్వాన్ని, నరేంద్రమోదీ–అమిత్‌ షా లను ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే పలు సర్వేలు 2019 ఎన్నికల్లో కూడా ప్రధానిగా నరేం ద్రమోదీకే పట్టం గడుతున్నాయి. అందుచేత రాహుల్‌ గాంధీ ఏవిధంగా ఎన్నికలకు సిద్ధమవుతారు, ఎలా ఎదుర్కొంటారు? అనేదే ఇప్పుడు ప్రశ్న. గుజరాత్‌ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ గత 23 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఒక నాయకుణ్ణి కూడా తయారు చేయలేకపోయింది. మాధవ్‌ సింగ్‌ సోలంకి తర్వాత అంత పెద్ద నాయకుడు గానీ, కొత్త తరం నాయకులు గానీ కాంగ్రెస్‌ దగ్గర లేరనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌ పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న శంకర్‌ సింగ్‌ వాఘేలా కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన ఒకప్పటి బీజేపీ నాయకుడే. కాంగ్రెస్‌ పార్టీకి గుజరాత్‌లో నాయకుడు లేడు. మరి ఎన్నికల్లో ఎలా పోరాడతారు, ఎలా గెలుస్తారు?

మరోవైపున, సర్దార్‌ పటేల్‌ తర్వాత అంత పెద్ద నాయకునిగా నరేంద్రమోదీని గుజరాతీలు అభిమానిస్తారు. గుజరాత్‌ అభివృద్ధిలో నరేంద్రమోదీ పాత్రని ఎవరూ కాదనలేరు. పటేళ్ల రిజర్వేషన్ల పోరాటంతో బీజేపీ పని అయిపోయిందని, హార్దిక్‌ పటేల్, జిగ్నేస్, ముగ్గురు యువకులను ముందుపెట్టి, వారితో కాంగ్రెస్‌ కుల రాజకీయాలు చేసినా, కాంగ్రెస్‌ పార్టీ గెలవలేక చతికిలబడింది.

గుజరాత్‌లో బీజేపీ వరుసగా 6వ సారి చారిత్రక విజయం సాధించి దేశ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పింది. కొన్ని సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం బీజేపీకి గతం కన్నా 4 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్‌కు మరోవైపున 3 శాతం ఓట్లు ఎక్కువ వచ్చినా బీజేపీ కాంగ్రెస్‌ మధ్య వ్యత్యాసం మాత్రం 8 శాతం పైగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొంత నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పక తప్పదు. నోట్ల రద్దు, జీఎస్టీ, రిజర్వేషన్లు, కుల రాజకీయాలు మొదలైన అంశాలు ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడ్డాయి. వ్యాపారులు, నిరుద్యోగులు, రైతులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని కాంగ్రెస్‌ ఎంతో నమ్మకంగా ఉంది. చివరివరకూ కాంగ్రెస్‌ నాయకులు తమ గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్‌ ఫలితాలపై చాలా నమ్మకంగా ఉన్నారు. గుజరాత్‌ సీఎం రూపానీ అంత ఆకట్టుకోలేకపోవడం, తమ పరిపాలన ప్రజలకు అంతగా నచ్చకపోయినా, మోదీ–షా ద్వయం వల్ల బీజేపీకి ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు. ఈ విజయం ముఖ్యంగా మోదీకి మరింత బాధ్యతను పెంచిందని చెప్పాలి. ఆర్థిక సంస్కరణలు కొనసాగిస్తానని, పటేళ్ల రిజర్వేషన్లు ఇవ్వలేమని కరాఖండిగా చెప్పి మరీ మోదీ గుజరాత్‌లో విజయం సాధించిన విషయం మనం గమనించాలి. ఈ మాటలు చెప్పడానికి ఎంతో దమ్ముండాలి.

వ్యాసకర్త బీజేపీ జాతీయ సమన్వయకర్త
ఈ–మెయిల్‌ : raghuram.delhi@gmail.com
పురిఘళ్ల రఘురాం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement