
మట్టి ఏ దేశానిదైనా
ఒకటే అయినప్పుడు
మనుషుల్లో ఇన్ని
అంతరాలెందుకు?
మాటల్లో మానవత్వాన్ని
చాటే మనం మతాలుగా
విడిపోవడమెందుకు?
అభద్రతా భావమేనేమో..!
విభిన్న మతాలను సృష్టించి
ఆధిపత్యం కోసం పాకులాడే
విష సంస్కృతిని ప్రేరేపించింది
ఏదైనా మనదాకా
వస్తేనే కదా తెలిసొచ్చేది
పక్కోడి ఇల్లు కాలినా,
కూలినా మనకేంటి
నోట్లో బూడిద కొట్టి
ప్రసాదమంటే
పరవశించిపోయే
మన లాంటి వాళ్ళ కోసం
కొత్త చట్టాలు పుడుతూనే ఉంటాయి
దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి
లౌకికతత్వాన్ని తుత్తునియలు చేసే
సవరణలు జరుగుతూనే ఉంటాయి
పెద్దనోట్ల రద్దు
నల్లధనం జాడ తీయలేదు
ఒకే దేశం – ఒకే పన్ను నినాదం
అద్భుతాలూ సృష్టించలేదు
సామాన్యుడిని
కష్టాల పాలు జేశాయి
దేశాన్ని మాంద్యం బారిన
పడకుండా ఆపలేకపోయాయి
సవరణ జాతిని ఏకం చేసే
సంస్కరణ కావాలి కానీ
విద్వేషాలను రగిల్చే
కార్చిచ్చు కాకూడదు
-గుండు కరుణాకర్, వరంగల్
మొబైల్ : 98668 99046