తెలంగాణ కోసం పురుషులతో సమానంగా మహిళలు ఉద్యమించారు. కానీ క్యాబినెట్‌లో మíహిళలు లేకుండానే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న కేసీఆర్ మహిళా సంక్షేమం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే.
మార్చి ఎనిమిది... ప్రపంచ మహిళలంతా సంఘటితమై పురుషాధిక్యాన్ని సవాల్ చేస్తూ సమానత్వం కోసం కదం తొక్కే రోజు. స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షిస్తూ 1910లో కోపెన్‌హగెన్‌లో అంతర్జాతీయ మహిళా సమావేశం జరిగింది. 46 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. జర్మనీ మహిళ క్లారా జెట్కిన్ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రతిపాదించగా, ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదట మహిళా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు వేర్వేరు రోజుల్లో నిర్వహించేవి. కానీ కాలం గడిచే కొద్దీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదినే జరపడం అలవాటయింది.
భారతదేశ ప్రాచీన చరిత్రను పరిశీలిస్తే లింగభేదం లేకుండా స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మధ్యయుగం నాటికి పురుషాధిక్యం వేళ్లూనుకోవడం మొదలైంది. నేటివరకు నిర్విరామంగా కొనసాగుతున్నది. కాలక్రమంలో కొంతమంది సంఘసంస్కర్తల ఉద్యమాలతో చైతన్యవంతులైన స్త్రీలు కొన్ని హక్కులు సాధించుకున్నారు.
ఫలితంగా ఆధునిక మహిళలు రాజకీయ, రక్షణ, పారిశ్రామిక రంగాల్లో అత్యున్నత పదవులను అలకరించారు. ఇది దేశానికి, ప్రపంచానికి గర్వకారణం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి ఉన్నతమైన పదవుల్లో కొనసాగుతూ మహిళాలోకం అభ్యుదయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది.
అయినా గణాంకాలను పరిశీలిస్తే సాధించాల్సినది ఇంకా ఎంతో ఉన్నదని తెలుస్తుంది. మహిళలు అన్ని రంగాల్లో తమ నైపుణ్యంతో పురుష ప్రపంచానికి సవాలు విసురుతున్న సమయంలో, గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఆడబిడ్డ అంటే భారంగానే భావిస్తున్నారు. జనాభా లెక్కలలో కూడా స్త్రీ, పురుష నిష్పత్తిలో చాలా తేడా కన్పిస్తుంది.
జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 943మంది మహిళలున్నట్లు తేలింది. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా రాష్ట్రంలో మరీ దారుణమైన పరిస్థితి. అక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు 879 మంది మాత్రమే మహిళలున్నారని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఉద్యోగావకాశాలను పరిశీలిస్తే ఉన్నత విద్యావకాశాలను అందుకుంటున్న మహిళలు 10 నుంచి 30 శాతం మాత్రమే.
స్త్రీని దేవతగా పూజించే భారతావనిలో మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. యావత్ భారతావనిని తీవ్ర వేదనకు గురి చేసిన నిర్భయ ఘటన తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ప్రజానీకమంతా ఊహించింది. మళ్లీ అలాంటి ఘటన జరగకుండా నిర్భయ చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది కూడా. అయినా మార్పు రాకపోవడం దురదృష్టకరం.
ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ బయటకి వచ్చే వార్తలు కొన్నే. పరువు, ప్రతిష్టలని అనుకుంటూ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవచ్ఛవల్లా మిగిలిన మహిళలెందరో! ఇటీవల ఒక ప్రముఖ సినీ దర్శకుడు తీసిన సినిమా మహిళల మనోభావాలను కించపరిచేదిగా ఉందని ఓ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, ఆ కేసును కూడా పట్టించుకోని అసమర్థ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయి.
మహిళల పట్ల బీజేపీ వైఖరి మరీ దుర్మార్గంగా ఉందని చెప్పడానికి ఆ పార్టీ కీలక నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలే చాలు. మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసింది. మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు మహిళా సంఘాల నిర్మాణం చేపట్టి వారికి వడ్డీలేని రుణాలను అందించి, ఆర్థికంగా వెసులుబాటు కల్పించింది.
స్వయానా మహిళలే అప్పులు ఇవ్వగలిగే స్థాయికి వారిని తీర్చిదిద్దింది. మహిళా శక్తిని కాంగ్రెస్ గుర్తించి దేశంలోని 14 రాష్ట్రాలలోని మహిళలకు శిక్షణ ఇచ్చి వారు రిసోర్స్ పర్సన్స్‌గా ఎదిగేందుకు అన్ని విధాల చేయూతనిచ్చింది. మహిళల ప్రశంసలు అందుకున్న అభయహస్తం, ఆసరా పించన్, జనశ్రీ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన వంటి పథకాలను స్వీకరించకుండా మహిళా సాధికారతను నేటి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
ప్రత్యేక తెలంగాణ కోసం పురుషులతో సమానంగా మహిళలు ఉద్యమించారు. జెండాలు మోసి, ప్రత్యేక రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాడిన మహిళలు ఎందరో ఉన్నారు. అయినా కూడా మంత్రిమండలిలో మహిళా సభ్యురాలు లేకుండానే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న కేసీఆర్ మహిళా సంక్షేమం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది. చట్టసభల్లో ఉంటేనే మహిళాభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ యూపీఏ హయంలో రాజ్యసభలో బలం ఉండటంతో చరిత్రాత్మకమైన మహిళా బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపచేయడానికి తన వంతు కృషి చేసింది.
ఆనాడు లోక్‌సభలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో మహిళా బిల్లు చట్ట రూపం దాల్చలేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు చొరవ తీసుకోవాలని కోరుతూ మహిళల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవ్ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. బీజేపీకీ, ఆ పార్టీ ప్రభుత్వానికీ చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలనీ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుతున్నాం.
ఇందిరా శోభన్
వ్యాసకర్త టీపీసీసీ అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment