స్త్రీలు తమని తాము తెలుసుకోవాలి. ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని’ ఎదురు చూడకుండా తమ శక్తియుక్తు లకు మెరుగులు దిద్దుకోవాలి. ‘మేము తక్కువవారం’ అన్న భావన పూర్తిగా వైదొలగాలి.
పురుషాధిక్య భావజాలం వేళ్లూనుకున్న సమా జంలో ఆడపిల్ల పుట్టుకే ఒక సమస్య. పైగి ప్రగ ల్భాలు పలుకుతూ, ప్రగతి కాముకులం అని చెప్పు కునేవారు కూడా ‘ఆడపిల్ల’ అనగానే చిన్నచూపు చూస్తారు. ‘మాకు ఆడపిల్లే కావాలి’ అని మనసా వాచా ప్రకటించే వాళ్లని వేళ్లమీద లెక్క పెట్టవచ్చు. అసమానత్వం అనేది ఇంటినుంచే మొదలవుతు న్నది. మనం ఎంతసేపటికి స్త్రీ బయటికి వెళ్లిన తర్వాత ఎదుర్కొనే సమస్యల్నే పరిగణనలోకి తీసుకుంటున్నాం కానీ, ఇంటి లోపల కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.
‘ఆడపిల్ల’ అని తెలిస్తే అంతమొందించేవాళ్లు కొందరైతే అయిష్టంగా, అడుగడుగునా నిందలేస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో పెంచేవాళ్లు, చాలామంది ఆడపిల్లను పుట్టించి తమకు తీరని అన్యాయం చేశాడని దేవుడిని నిందించే వారూ లేకపోలేదు. ఆడపిల్లల తల్లుల్ని తన్ని తగలేసేవాళ్లు, ఆడపిల్లల్ని అమ్ము కునేవాళ్లు, చదువు సంధ్యలు లేకుండా ఇంటిలో వెట్టిచాకిరీ చేయించుకునే వాళ్లు, సరైన పోషకాహారం అందించనివాళ్లు ఈ సమాజంలో కోకొల్లలు. ఆడ పిల్లలు పెరుగుతున్నకొద్దీ తమ గుండెలమీద కుంపటిలా భావిస్తున్నారు. ఏదో ఒక అయ్య చేతిలో పెట్టి తమ బాధ్యత తీర్చుకుందామనుకుంటున్నారే తప్ప ఆమె ఇష్టాయిష్టాలకు, ఆమె మనస్సుకు మాత్రం విలువ ఇచ్చేది లేదు.
స్త్రీలు అడుగడుగునా సమస్యల వలయంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అష్టకష్టాలుపడి పురుషులకంటే మిన్నగా ఎదిగినప్పటికీ అక్కడా పురుషాధి పత్యపు గొడుగు కింద మగ్గిపోవాల్సిందే. అయినప్పటికీ కాటు వేసే కాల సర్పాలెన్నో. ‘స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి’ అని వేనోళ్ల అరుస్తున్నారు. బాగానే ఉంది. సంపాదించే ప్రతి స్త్రీకి తన సంపదను తన ఇష్టానుసారం వినియోగించే పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా?!
స్త్రీ ఒక చాకిరీ చేసే యంత్రం. అది ఎక్కడా ఆగదు. చెడిపోదు. ఈనాటి పరిస్థితులు చూసినట్లయితే ఇంటిపని, పిల్లలపని, ఉద్యోగ బాధ్యతలు, సమాజపు వేధింపులు, చిన్నచూపు... నానాటికీ ఆమె పరిస్థితి తీసికట్టుగానే ఉంది. ఈనాటి స్త్రీ పరిస్థితి మారాలంటే అన్ని కోణాల్లోంచి మార్పు రావాలి. ముఖ్యంగా ఆడ, మగ ఇద్దరూ ప్రాణులే– ఇద్దరికీ మనస్సు ఉంది. ఇద్దరూ సమానం అన్న భావన ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలి.
చివరిగా అన్నింటికంటే ముఖ్య విషయం. స్త్రీలు తమని తాము తెలుసుకోవాలి. ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని’ ఎదురు చూడకుండా తమ శక్తియుక్తులకు మెరుగులు దిద్దుకోవాలి. ‘మేము తక్కువవారం’ అన్న భావన పూర్తిగా వైదొలగాలి. స్త్రీ పురుషులు దేశాభ్యుదయానికి రెండు కళ్లు అనే భావన వెల్లివిరియాలి. తల్లిదండ్రులు ఆడ, మగ తారతమ్యం లేకుండా సమా నంగా పెంచాలి. సమభావన వారిలో కలిగించాలి.
కాసర లక్ష్మీ సరోజారెడ్డి
వ్యాసకర్త ప్రిన్సిపల్, జంగారెడ్డిగూడెం
Comments
Please login to add a commentAdd a comment