
సందర్భం
బొగ్గుగనుల జాతీయకరణ స్థానంలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గని విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రైవేట్ బొగ్గు సంస్థలు మళ్లీ రాజ్యమేలే పరిస్థితి ఏర్పడనుంది. ధరల నియంత్రణ కూడా వాటి పరమయ్యే ప్రమాదముంది.
స్వాతంత్య్రం నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వ నిర్వహణలో 1956లో ఏర్పడిన జాతీయ బొగ్గు అభివృద్ధి సంస్థ బొగ్గు ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1945 నుంచే కార్యకలాపాలు సాగిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.
భారతీయ బొగ్గు పరిశ్రమ 1950లలో ప్రభుత్వ యాజమాన్య కంపెనీల ఆజమాయిషీలో ఉండేది. ఇవ్వాళ సింగరేణి కాలరీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆజ మాయిషీలో 51:49 నిష్పత్తితో కొనసాగుతోంది. పెరుగుతున్న ఉక్కు పరిశ్రమ అవసరాల రీత్యా, నేలబొగ్గు నిక్షేపాలను వెలికితీసి వాడుకోవడంపై ఆసక్తి పెరి గింది. కానీ దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు తగినంత మూలధనాన్ని సమకూర్చే పనికి ప్రైవేట్ బొగ్గు గని యజమానులు పూనుకోలేదు.
ప్రైవేట్ బొగ్గు గని యజమానులు అశాస్త్రీయ పద్ధతులను పాటించడం, గని కార్మికుల పని పరిస్థితి దిగజారడం వంటివాటిపై స్పందించిన కేంద్రప్రభుత్వం ప్రైవేట్ బొగ్గుగనులను జాతీయం చేయాలని నిర్ణయించుకుంది. ఇది రెండు రకాలుగా జరిగింది. 1971–72లో ఖనిజబొగ్గు గనులను, 1973లో థర్మల్ బొగ్గు గనులను కేంద్రప్రభుత్వం స్వాధీనపర్చుకుంది.
1971లో కోకింగ్ కోల్ మైన్స్ యాక్ట్ ద్వారా బొగ్గు గనులను, బొగ్గు ప్లాంట్‌లను జాతీయం చేసి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక 1973 కోల్ మైన్స్ యాక్ట్ ద్వారా 1971లో స్వాధీనపర్చుకున్న బొగ్గు గనులతోపాటు, 7 రాష్ట్రాల్లోని ఖనిజ, ఖనిజయేతర బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ అన్ని గనులనూ కోల్ మైన్స్ యాక్ట్ 1973 ద్వారా కేంద్రప్రభుత్వం 1973 మే 1న జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది.
ఖనిజయేతర బొగ్గు గనులను ఇలా 1973లో జాతీయం చేసి భారత బొగ్గుగని ప్రాధికార సంస్థ అధీనంలోకి తీసుకొచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ను 1975లో స్థాపించారు. ఇది రాణిగంజ్ బొగ్గుక్షేత్రం లోని అన్ని ప్రైవేట్ కాలరీలను స్వాధీనపర్చుకుంది. దీంతో 29.72 బిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలతో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ దేశంలోనే రెండో అతిపెద్ద బొగ్గు సంస్థగా ఆవిర్భవించింది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోల్ మైన్స్ యాక్ట్ 2015ను పార్లమెంట్ 2015 మార్చిలో ఆమోదించింది. దీంతో బొగ్గుగనులను వేలం పాటద్వారా కేటాయించే అధికారం కేంద్రప్రభుత్వానికి దఖలు పడింది. అలాగే తమ సొంత సిమెంట్, ఉక్కు, విద్యుత్ లేక అల్యూమినియం ప్లాంట్ల వినియోగం కోసం బొగ్గుగనులను తవ్వుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ చట్టం అవకాశమిచ్చింది.
ఇక 2018 ఫిబ్రవరి 20న భారత్‌లో ప్రైవేట్ సంస్థలు వాణిజ్య బొగ్గు పరిశ్రమలో ప్రవేశించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతించేసింది. దీంతో 1973 జాతీయకరణ తర్వాత వాణిజ్యపరమైన బొగ్గుగనులపై ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా సంస్థకున్న గుత్తాధిపత్యం చెదిరిపోయింది. దీంతో టన్ను ధరను ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి గనులు దక్కే విధానం అమలులోకి వచ్చేసింది.
వాణిజ్య బొగ్గు గని తవ్వకాల దుష్ఫలితాలు :
1. బొగ్గు అత్యంత అరుదైన సరుకు కాబట్టి ఒకసారి నిల్వలు ఖాళీ అయ్యాయంటే తర్వాత బొగ్గు లభ్యం కాదు. గతంలో ప్రైవేట్ గని సంస్థలు లాభదాయకంగా ఉండే బొగ్గు నిక్షేపాలలోనే బొగ్గును తవ్వుకుని కఠిన పరిస్థితుల్లోని బొగ్గు గనుల జోలికి వెళ్లేవి కావు.
2. అనుమతించిన ప్రాంతంలోనే కాకుండా ప్రైవేట్ బొగ్గుగనుల యజమానులు అక్రమ తవ్వకాలకు పాల్పడే ప్రమాదముంది.
3. లేబర్ చట్టాల ఉల్లంఘనకు అవకాశమెక్కువ.
4. బొగ్గు తవ్వకాల రికార్డు లేకుండా ప్రైవేట్ కంపెనీలు జరిపే తవ్వకాలవల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలు, పన్నులు తగ్గిపోయే అవకాశం ఎక్కువ.
5. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి, ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నంలో కార్మికుల సంఖ్యను ప్రభుత్వ బొగ్గు సంస్థలు తగ్గించడం అని వార్యం. కార్మికుల తొలగింపు మాత్రమే కాకుండా తాజా నియామకాలు గణనీయంగా తగ్గిపోతాయి.
6. బొగ్గు పరిశ్రమ క్రమేపీ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి, జాతీయకరణకు మునుపుటిలాగా ధరలను ఇతర నిబంధనలనూ వారే నియంత్రించే ప్రమాదం పొంచి ఉంది.
7. ప్రైవేట్ సంస్థల ప్రవేశంతో గనుల్లో ప్రమాదాలు పెరుగుతాయి. అధిక లాభాల యావలో ఇవ కార్మికుల భద్రతను గాల్లో కలిపేయడం తెలిసిందే. దీంతో మరిన్ని ప్రమాదాలు, మరిన్ని మరణ ఘట నలు తప్పవు.
8. కాలుష్య నిబంధనలను ఖాతరు చేయవు కాబట్టి ప్రైవేట్ బొగ్గుగని కంపెనీలు పర్యువరణానికి కలిగించే ప్రమాదం మామూలు స్థాయిలో ఉండదు.
బి. జనక్ ప్రసాద్
వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ
ఈ–మెయిల్ : janakprasad@rediffmail.com
Comments
Please login to add a commentAdd a comment