నినాదం కాదు... సర్వజన ‘వికాసం’ | Jayant Sinha Praises Narendra Modi | Sakshi
Sakshi News home page

నినాదం కాదు... సర్వజన ‘వికాసం’

Published Thu, Aug 1 2019 1:46 AM | Last Updated on Thu, Aug 1 2019 1:46 AM

Jayant Sinha Praises Narendra Modi - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి ఎన్నికై రెండు నెలలు గడిచాయి. ఈ రెండు నెలల్లో ‘సబ్‌ కా వికాస్‌’, ‘అందరి వికాసమే’ ఆయన ప్రాధాన్యమని నిరూపించారు. పాలనకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ, అవి ఉద్దేశించిన పేద, బలహీన వర్గాల వారికీ మరింత లబ్ధి చేకూరే విధంగా పాలన సాగిస్తున్నారు. ‘సబ్‌కా సాథ్‌’ (అందరితో కలిసి) ‘సబ్‌కా వికాస్‌’ (అందరి వికాసం) – ఈ నినాదానికి ‘సబ్‌కా విశ్వాస్‌’ (అందరి విశ్వాసం) జోడించడం ద్వారా, అందరి అభివృద్ధికీ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ద్వారా, మన ప్రాణాలు కాపాడే సైనికుల శ్రేయస్సుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలిసింది.  జాతీయ భదత్రా నిధి కింద ప్రధాన మంత్రి ఉపకార వేతనాల పథకంలో, మార్పులను ఆమోదించారు.  ఉపకార వేతనాల కింద ఇచ్చే మొత్తాన్ని బాగా పెంచారు. అంతేగాక, ఈ పథకాన్ని రాష్ట్ర పోలీసు ఉద్యోగుల పిల్లలకూ, నక్సల్స్‌ దాడుల్లో చనిపోయిన పోలీసుల పిల్లలకు కూడా వర్తింపజేశారు.

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు కానున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ప్రతి గ్రామీణ కుటుంబానికీ విద్యుత్తు, వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకుం టోంది. ‘ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన’ కింద గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులకు 1.96 కోట్ల గృహాలు నిర్మించనున్నారు. ‘ఉజ్వల యోజన’ కింద ఇచ్చే గ్యాస్‌ సిలిండర్ల ధర భరించలేని వారికి 5 కేజీల గ్యాస్‌ సిలిండర్లు అందజేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జల జీవన్‌ మిషన్‌ ద్వారా పరిశుభమ్రైన త్రాగునీరు– హర్‌ నవ్‌ సే జల్‌ – ప్రతి పంపు నుంచీ నీరు, 2024 నాటికి అన్ని గ్రామాలలోనూ అందించనున్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశంలోని 256 జిల్లాలలోని 1,592 బ్లాకులలో, ప్రజల భాగస్వామ్యంతో జల్‌ శక్తి అభియాన్‌ కృషి చేస్తుంది.

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, మొదటి కేబినెట్‌ సమావేశంలోనే   "ప్రదాన్‌ కిసాన్‌ యోజన’ను 14.6 కోట్ల రైతులకు వర్తింపజేసి, ఐదు కోట్ల అన్నదాతలకు రూ. 10,000 కోట్ల పెన్షన్‌ పథకాన్ని రూపొందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ‘జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌’ను ప్రవేశపెట్టారు. సన్నకారు రైతులను ఆదుకోవడానికి తక్కువ వడ్డీకి రుణాలు లభ్యమై, ఎక్కువ ధరకు అమ్ముకొనే వీలు కల్పిస్తూ, రైతుల ఉత్పత్తి సంఘాల ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరను పెంచడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. కేంద్రప్రభుత్వం ‘ప్రధాన్‌ శ్రమ యోగి మంథన్‌ యోజన’ పేరిట ఒక నూతన పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా,  దాదాపు 3 కోట్ల చిన్న దుకాణదారులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికీ నెలకు రూ. 3,000 లభిస్తాయి. మధ్య, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణ లభ్యత పెంచడానికి ప్రత్యేక ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా 59 నిమిషాలలో కోటి రూపాయల రుణం లభ్యమయ్యేలా చర్యలు తీసుకొన్నారు. జీఎస్‌టీ కింద నమోదైన అన్ని మధ్య, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు 2 శాతం వడ్డీకి కొత్త రుణాలు అందజేయడానికి రూ. 350 కోట్లు కేటాయించారు.  ఈ పరి శ్రమలు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఒక ప్రత్యేక ప్లాట్‌ఫారంను రూపొందిస్తున్నారు.

‘ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన’ ద్వారా గ్రామీణ రోడ్లను గ్రామీణ్‌ అగ్రికల్చర్‌ మార్కెట్స్‌ (గ్రామ్స్‌)ను, ఆసుపత్రులను, పాఠశాలలను కలుపుతూ, 1.25 లక్ష కిలోమీటర్ల రోడ్లను మెరుగుపరుస్తారు. ఇప్పుడు 97 శాతం గ్రామాలలో అన్ని వాతావరణాలనూ తట్టుకొనే రహదారులు నిర్మించారు.  ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రోడ్ల అభివృద్ధితో దేశంలో రవాణా సౌకర్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలతోపాటు పాఠశాలలో హాజరు శాతం పెరి గింది. ఇళ్ళలో జరిగే ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ నినాదమే కాదనీ, భారతీయులందరికీ లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశించినదనీ స్పష్టమైంది. మన దేశంలో 2006–2016 మధ్య 27 కోట్ల జనాభా దారిద్య్ర రేఖకు ఎగువకు వచ్చారని తెలుస్తోంది. అత్యంత పేదరికంలో ఉన్నవారి సంఖ్య 7 కోట్లకు మించదు. మన దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తున్న వేళ పేదరికాన్ని నిర్మూలించనున్నాము. అతి త్వరలో ప్రతి భారతీయుడికీ ఒక ఇల్లు, సరిపడ ఆహారం, పరిశుభ్రమైన త్రాగునీరు, మరుగుదొడ్డి, ఆరోగ్య సౌకర్యం, ఉచిత విద్య, వంట గ్యాస్, విద్యుత్‌ సౌకర్యం, మొబైల్‌ ఫోను, మంచి రహదారులూ, బ్యాంకు అకౌంటు ఉంటుంది. మోదీ ప్రభుత్వం ప్రజలకు గౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందిస్తోంది. ఇదే అన్నింటికంటే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం.


వ్యాసకర్త పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జయంత్‌ సిన్హా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement