![Jayant Sinha Reacts On Garlanding Ramgarh Lynching Convicts - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/7/jayanth-sinha-garlanding-ly.jpg.webp?itok=_wkdhiO2)
హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో జయంత్ సిన్హా
సాక్షి, న్యూఢిల్లీ: గోవు మాంసం విక్రయిస్తున్నాడనే అనుమానంతో గతేడాది జూన్‌లో అలీముద్దీన్ అన్సారీ అనే వ్యక్తిని ఉరి వేసి చంపారు. రామ్‌ఘర్‌లోలో జరిగిన ఈ ఘటనలో 11 మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ జార్ఖండ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పుకు హైకోర్టులో బ్రేకులు పడ్డాయి. విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు నిందితులందరికీ బెయిలు మంజూరు చేసింది. అయితే కోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా హత్య కేసులోని 8 మంది నిందితులకు శుక్రవారం హజారీబాగ్‌లోని తన ఇంటిలో పూల మాలలు వేసి సన్మానం చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో సిన్హాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నత విద్యనభ్యసించిన జయంత్ తీరు మరీ అధ్వానంగా ఉందనీ జార్ఖండ్ ప్రతిపక్ష నేత హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు అజోయ్ కుమార్‌లు మండిపడ్డారు. మత విద్వేశాల్ని రెచ్చగొట్టే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర మంత్రి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాగా, ఈ విమర్శలపై జయంత్ సిన్హా శనివారం స్పందించారు. రాజకీయ పరిపక్వత లేనివారు తనను విమర్శిస్తున్నారని అన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకముందనీ, హైకోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేయడం నేరం కాదని స్పష్టం చేశారు. సిన్హా హర్వార్డ్ బిజినెస్ స్కూల్లో పట్టభద్రులు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment