ఇటీవలే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన నారాయణ రాణే మంత్రివర్గంలో సీటు కాదు కదా.. ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో చిక్కుకు పోయారు. మాతృ సంస్థ శివసేన ఆయనపై పగ సాధింపుకు సిద్ధమైంది.
నారాయణ్ రాణే ఉల్లాసకరమైన స్థితిలో కాలం గడుపుతున్నారు. బీజేపీకి తానిచ్చిన మాట ప్రకారం తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తన శాసనమండలి సభ్యత్వాన్ని కూడా వదిలేశారు. కొత్త మిత్రురాలి సహాయంతో ఆ స్థానాన్ని వెనువెంటనే దక్కించుకుంటానని తప్పుగా అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే, బీజేపీ రాణేపట్ల ఆసక్తి ప్రదర్శిస్తే దేనికైనా తెగిస్తానని రాణే మాజీ పార్టీ లేదా అతడి తొలి ప్రేమికురాలు అయిన శివసేన తీవ్రంగా హెచ్చరించింది.
బీజేపీ సాధించిన 122 స్థానాలతో పోలిస్తే 63 స్థానాల్లో మాత్రమే గెలిచిన శివసేన మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామి. శివసేన ఎప్పటికైనా తన కాళ్లకింది తివాచీని లాగేస్తుందన్న బీజేపీ భయాన్ని అర్థం చేసుకోవలసిందే. శివసేన నమ్మదగిన భాగస్వామి కాదు. ఒకవైపు బీజేపీతో అధికారం పంచుకుంటూనే కాంగ్రెస్, ఎన్సీపీల కంటే సమర్థంగా ప్రతిపక్షపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వంలో ఉంటూ వచ్చే అన్ని ప్రయోజనాలనూ అందుకుంటూనే దానిపై నాలుగు రాళ్లు వేస్తూ ఉండటం దాని లక్షణం.
రాణేపై శివసేనకు ఉన్న పట్టు చాలా గట్టిది. ఆ పార్టీకి చెందిన మనోహర్ జోషి స్థానంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణేపై దాని పగ ప్రబలంగానే ఉంది. బహిరంగంగా అలా చెబుతోంది కూడా. ప్రజలు, రాజ కీయ వాదుల అవగాహన కూడా అదే మరి. రాణే తన ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తే, కాంగ్రెస్, బీజేపీ రెండూ శివసేనకు మద్దతు ఇవ్వవచ్చు, లేదా దాని మద్దతును అవి అంగీకరించవచ్చు.
మాజీ శివసైనికుడు, ప్రస్తుతం మాజీ కాంగ్రెస్ వాది అయిన రాణే తనను సభ్యుడిగా చేర్చుకున్న పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారవుతాడని చాలామంది వర్ణిస్తుంటారు. పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్న అశోక్ చవాన్‌ను లేదా పృథ్వీరాజ్ చవాన్‌ను తొలగించి తాను వారి స్థానాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం మద్దతును పొందడం చాలా సులువైన విషయమని రాణే భావించారు. అది బాల్ ఠాక్రేను ఒప్పించడమంత సులువైన అంశమని భావించారు.
ఆయన అసహనం, పార్టీకిమించి తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునే వైఖరి వల్లే రాజకీయాల్లోనే కాకుండా సొంత నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు తనను చుట్టుముడుతూ వచ్చాయి. అందుకే 2014 ఎన్నికల్లో రాణే ఆయన కుమారుడు తమ కంచుకోటలను కోల్పోయారు. ఆ తర్వాత ముంబైలో అసెంబ్లీ స్థానాన్ని కూడా రాణే గెల్చుకోలేకపోయారు. ఇప్పుడు తన సంరక్షణలోని కొంకణ్ ప్రాంతంకోసం పోరాడుతున్నారు. ఇతరుల మద్దతుతో కాకుండా స్వయంగా దీనికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గెలిస్తే, అప్పుడు బీజేపీ అభినందనలను అందుకోవచ్చు.
రాణేను తన చెంత చేర్చుకునే విషయమై బీజేపీ చాలా అప్రమత్తతతో ఉంది. రాణే ఆగ్రహ ప్రవృత్తి, ఉన్నట్లుండి ఆకస్మిక దాడిగా మారి తాను సొంత పార్టీ పెట్టుకుని చిన్న మిత్రపక్షంలా మారే అవకాశం ఉందని కూడా బీజేపీకి బాగా తెలుసు. నరేంద్ర మోదీ, అమిత్ షా పట్ల విశ్వాసం ప్రకటించేటట్లయితే ఎలాంటి భావజాలం నుంచి వచ్చిన వారికైనా సభ్యత్వం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. రాణే బీజేపీలో చేరడానికి గట్టిగానే లాబీయింగ్ చేశారు. కానీ తనకు కేబినెట్‌లో స్థానం ఇవ్వాలంటే బీజేపీకి మద్దతు ఇస్తున్న శివసేన ఆమోదం తప్పనిసరిగా మారింది.
రాణే సభ్యుడిగా ఒకే మంత్రివర్గంలో తన సరసన కూర్చోవడానికి శివసేన నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. రాణేను బీజేపీలో చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచీ దానివల్ల కలిగే పర్యవసానాల గురించి ఉద్దవ్ ఠాక్రే పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. తన మాజీ శత్రువు (శివసేన నుంచి బయటకు వచ్చేటప్పుడు రాణే ఆ పార్టీని అత్యంత పరుషమైన రీతిలో దూషించాడు) ట్రంప్ కార్డును గట్టిగా పట్టుకోవడంతో రాణేకి చేదుమాత్ర మింగినట్లయింది. తన, తన కుటుంబ భవిష్యత్ అవకాశాలకు సంబంధించి రాణే సొంత చొరవతో చేయగలిగిందేమీ లేకుండా పోయింది.
ఎక్కువ సీట్లు ఖాళీగా ఉండే శాసన మండలి ఎన్నికలలాగా కాకుండా, ఎమ్మెల్యేల నుంచి ఓట్ల కోటాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఉపఎన్నికలో పరిస్థితి అలాంటిది కాదు. రాణే తన స్థానాన్ని తిరిగి పొందాలంటే, ప్రస్తుతం శాసనసభలో ఉన్న మొత్తం సభ్యులలో సగంకంటే ఎక్కువ ఓట్లను తాను సాధించాల్సి ఉంటుంది. కానీ ఉన్నట్లుండి ఆయన మొత్తం ప్రతిపక్షాన్ని తనకు వ్యతిరేకంగా ఐక్యం చేసిపడేశారు. అందులోనూ శివసేన ఆయనపై పగ సాధించడానికి పొంచుకుని ఉంటోంది. ఈ మొత్తం దృశ్యాన్ని పరిశీలించినట్లయితే నారాయణ్ రాణే భారతీయ జనతాపార్టీకి ఇప్పటికయితే పెద్ద ఆస్తిగా కనిపించడం లేదు.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment