ఈ బడ్జెట్‌లోని ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. ప్రాథమిక, మాధ్యమిక, తృతీయక ఆరోగ్య సేవా కేంద్రాలను పెంపొందించాలన్న ఆలోచనను స్వాగతించవలసిందే. ఇందుకు అవసరమైన కార్యాచరణ కోసం నిష్ణాతులైన భాగస్వాములను కలుపుకొని బడ్జెట్ పరిధిని దాటి విస్తృత పరచవలసిన అవసరం ఉన్నది. జాతీయ ఆరోగ్య భద్రతా పథకాన్ని 50 కోట్ల మంది లబ్ధిదారులకు అన్వయించడం కూడా ముదావహం.
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మెజారిటీ వర్గాల్లో, ప్రజల్లో, ప్రాంతాల్లో తీవ్ర నిరుత్సాహమే మిగి ల్చింది. స్వతహాగా ఎంతో ఉత్సాహంగా, హాస్యోక్తులను జోడించి, వైరి వర్గాల, పార్టీల వారిని సున్నితంగా ఎత్తిచూపుతూ ప్రసంగించే ఆర్థికామాత్యులు, అందుకు భిన్నంగా, చప్పగా, పేలవంగా తన ప్రసంగాన్ని ముగించడం ఆయన సమర్ధకులనే కాదు, ప్రత్యర్థులను కూడా ఒకింత విస్మయపరచిన మాట వాస్తవం. ఇందుకు కారణం ప్రస్తుత బడ్జెట్‌లో లక్ష్యసిద్ధి, గమ్య స్పష్టత, నిర్దిష్ట ప్రణాళికా గమనం, నిబద్ధత లోపించడం కావచ్చు.
2016, నవంబర్ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు చర్య తర్వాత క్రమక్రమంగా ఈ ప్రభుత్వ ఆర్థిక గమనం, సాంద్రత తగ్గి పలుచబడటం మొదలయ్యింది. ఈరోజు సాధారణ బడ్జెట్ స్వరూపం కూడా అందులో భాగమేనేమో! తాజా బడ్జెట్‌లో ఉటంకించిన మూడు ప్రధాన లక్ష్యాలు: 1. వ్యవసాయరంగం, గ్రామీణ ఆర్థికవ్యవస్థలపై స్పష్టమైన దృష్టి. 2. ఆరోగ్య, విద్యా, సామాజిక ఉత్పత్తి (Social Production) రంగాలను ప్రత్యేక ప్రోత్సాహకాలతో అభివృద్ధి చేయడం. 3. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (M Mఉ) పరిశ్రమలను ప్రోత్సహించడానికి చర్యలు.
ఈ మూడింటినీ వరుస క్రమంలో మొదట పరిశీలిద్దాం. తర్వాత ఇతర అంశాలను విశ్లేషించుకుందాం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీ. అంటే వ్యవసాయానికి కావలసిన ఇన్ పుట్స్, సాధనాలు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి, మౌలిక వసతులు, ఎరువులు వగైరాలపై దృష్టి పెట్టడం ద్వారా అధిక ఉత్పత్తి సాధించడం. అందుకు భిన్నంగా ప్రధాని పిలుపు మేరకు 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశలో ఒక నమూనా మార్పు, లేదా పారడైం షిఫ్ట్‌ని ప్రవేశపెడ్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. దీనికోసం వ్యవసాయాన్ని ఒక ఎంటర్‌ప్రైజ్‌గా పరిగణించి రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశలో వ్యవసాయ ధరలను మార్కెట్ ద్వారా పెంచేందుకు ప్రయత్నం చేయడం గమనార్హం.
అంటే ధాన్యాలు, దినుసులు, పండ్లు, కూరగాయలు, నూనెగింజలు, వంటనూనెలు మొదలైన వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను కార్పొరేట్ పరిధిలోకి తీసుకురావడంగా అర్థమవుతుంది. దీనివల్ల రైతులకు ఒనగూడే ప్రయోజనం సంగతి అటుంచి, దళారీలకు, కార్పొరేట్లకు లాభాలు తెచ్చి పెట్టే అవకాశమే ఎక్కువ. ఈ వాస్తవాన్ని ఆచరణలో ఉన్న గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా కనిపించే అనుభవాల సారం సూచిస్తున్నాయి. కనీస మద్దతు ధర విషయంలో రాష్ట్ర, కేంద్ర పథకాల ప్రయోజనాలు రైతులకు చేరడం లేదనేది అందరికీ తెలిసిన సత్యమే. ప్రసంగంలోని 15వ పేరాలో చెప్పిన ప్రకారం కోతల తర్వాత పంటలకు సరసమైన ధరలను సాధించుకోవడం కోసం రైతులు ‘సరైన నిర్ణయాలు’ తీసుకోవాలని సూచించడం స్పష్టంగా ‘ఏ ధరకు అమ్ముకోవాలో మీరే నిర్ణయించుకోండి’ అని రైతులను ప్రోత్సహించడంగానే చూడవచ్చు. 2018–19లో పంట రుణాల సౌకర్యాన్ని రూ. లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రతిపాదించారు. ఈ అంశం ద్వారా స్పష్టమయ్యే ఒక వాస్తవం ఏదంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ కూడా కౌలుదారుల వివరాలను సమగ్రంగా సేకరించలేదు. కాబట్టి నిజమైన కౌలుదారుడు లబ్ధి పొందటం కష్టం. ఈ పరిస్థితులలో రుణ సదుపాయాలు కూడా సరిౖయెన ఫలితాలను సాధించటం కష్టం.
ఆర్థిక, సామాజిక స్వప్నాలు సాకల్యం చేసుకోవడం కోసం జనాభా గణన, సామాజిక–ఆర్థిక కుల పరిగణన, అనాథ పిల్లలు, దివ్యాంగుల వివరాల ఆధారంగా జాతీయ సామాజిక సహాయతా కార్యక్రమానికిగాను ఈ సంవత్సరం రూ. 9,973 కోట్లు కేటాయించడం హర్షించతగినదే. ప్రాథమిక విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయ శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇంకా ఎన్నో చర్యలు తక్షణం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా బడి చదువులు మధ్యలోనే ఆపివేసే, బాలబాలికల సంఖ్యను గణనీయంగా తగ్గించవలసిన అవసరం ఉన్నది. ఈ బడ్జెట్‌లోని ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. ప్రాథమిక, మాధ్యమిక, తృతీయక ఆరోగ్య సేవా కేంద్రాలను పెంపొందించాలన్న ఆలోచనను స్వాగతించవలసిందే.
ఇందుకు అవసరమైన కార్యాచరణ కోసం నిష్ణాతులైన భాగస్వాములను కలుపుకొని బడ్జెట్ పరిధిని దాటి విస్తృత పరచవలసిన అవసరం ఉన్నది. జాతీయ ఆరోగ్య భద్రతా పథకాన్ని 50 కోట్ల మంది లబ్ధిదారులకు అన్వయించడం కూడా ముదావహం. అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా కొత్త ఒరవడి సృష్టించారు. కానీ అధిక ప్రయోజనాలను కార్పొరేట్ హాస్పిటల్స్ దండుకున్నాయి. సామాన్య ప్రజలు, దళితులు, ఆదివాసీలు, బడుగువర్గాలు పొందిన ప్రయోజనాలు స్వల్పమేనని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో ప్రకటించిన పథకం అలాంటి లోటుపాట్లకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చిన్న మధ్య, సూక్ష్మ పరిశ్రమలు తక్షణమే కుదుటపడాలంటే రూ. 3,794 కోట్ల రుణ సదుపాయం ఒక్కటే సరిపోదు. మన దేశంలో ఈ రంగానికి చెందిన పరిశ్రమలు 95 శాతం ఉద్యోగావకాశాలు సృష్టిస్తున్న విషయం మన వార్షిక పారిశ్రామిక సర్వే గణాంకాల ద్వారా స్పష్టమైంది. అందులో ప్రస్తావించని విషయం ఏమిటంటే, ఈ కార్మికుల వివరాలు రిజిస్టరులో నమోదు కావు. దీనికి పెద్ద కారణం ఉంది. తాత్కాలిక భృతితోనో, కాంట్రాక్టులతోనో కాలం గడిపేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ కారణంచేత లావాదేవీలన్నీ నగదు రూపేణా తప్ప, డిజిటల్ రూపంలో ఉండవు. అందుకే నోట్ల రద్దు కాలంలో తక్షణ ప్రభావం ఈ రంగంపైన కలిగిందనడం వాస్తవం. ఈ పరిస్థితి మారడానికి కూడా చాలా కాలం పట్టవచ్చు. ఈ రకమైన రుణ సదుపాయాలు ఏ మేరకు లక్ష్యాన్ని సాధించగలవన్నది ప్రశ్నార్థకమే. చివరగా 24,000 ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకం ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించడం అంత విజ్ఞతతో కూడిన చర్య అనిపించుకోదు.
ప్రొ జె. మనోహర్‌రావు
వ్యాసకర్త హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు
Comments
Please login to add a commentAdd a comment