ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశ స్థూల జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 4.5 శాతానికి పతనమైంది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో 6.1 శాతానికి పెరిగిపోయింది. భారీగా పెరుగుతున్న కుటుంబాల అప్పులు, తగ్గుతున్న కార్మికుల వేతనాలు, కోట్లాదిమందికి ఉపాధి కొరత, వ్యవసాయ సంక్షోభం వంటి ప్రతికూలతల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న 2020–21 బడ్జెట్ ప్రజల కొనుగోలు శక్తి పెంచేదిగా ఉండాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించేదిగా, రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేదిగా ఉండాలి. అలా కాకుండా ఐఎమ్‌ఎఫ్ వంటి ద్రవ్యసంస్థల ఆదేశంతో కార్పొరేట్ సంస్థలకు పన్నుల రాయితీలు కల్పించే రకం సంస్కరణలే ముఖ్యం అనుకుంటే అంతిమంగా భారత్‌ది మరో గ్రీస్ విషాదగాథే అవుతుంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2020–21 ఆర్థిక సంవత్సరపు కేంద్ర డ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2020న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 1991 నాటి ఆర్థిక విపత్కర పరిస్థితుల అనంతరం, అంతకు మించిన ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ ముందుకు వస్తోంది. ఈ బడ్జెట్‌కు నేపథ్యంగా వున్న పరిస్థితులనూ, గణాంకాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్థం అవుతుంది.
2019–20 బడ్జెట్ కాలంలో, ఆర్థిక రంగం తాలూకు అనేక బలహీనతలు ఉధృతంగా బయట పడ్డాయి. స్థూల జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2018 ఆరంభం నుంచీ దిగజారడం మొదలై, 2019–20 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికం అయిన జులై సెప్టెంబర్ 2019 నాటికి గత ఆరేడేళ్లలో లేనంత కనిష్టంగా 4.5 శాతానికి పతనం అయ్యింది. 2017–18 నాటికే, నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠస్థాయి అయిన 6.1 శాతాన్ని మించి పెరిగిపోయింది. అది నేడు మరింతగా పెరిగిపోతోంది. అలాగే, 2011–12లో స్థూల జాతీయ ఉత్పత్తిలో 23% పైబడి వున్న కుటుంబాల ఆదాయాల వాటా, 2017–18 నాటికి 17% మేరకు పడిపోయింది. కుటుంబాల అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమం 2014 అనంతరం మరింత వేగం పుంజుకుంది. సంఘటిత రంగంలోని కార్మికుల వేతనాల పెరుగుదల, 2013లోని రికార్డు స్థాయి అయిన 13% నుంచి 2018 నాటికి 6.05%నికి తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో సుమారు 3.5 కోట్ల మంది రోజువారీ కూలీలకు నేడు ఉపాధి కొరత వుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభం మరింతగా ముదిరిపోయింది. పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించక నష్టాలు పెరిగిపోవడం, రైతులు అప్పులపాలు కావడం తీవ్రతరం అవుతున్నాయి.
వీటి ఫలితంగానే నేడు ప్రజల వినియోగం పతనం అవుతోంది. ఆటో మొబైల్ రంగం నుంచి.. పార్లె కంపెనీ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వరకు ఈ కొనుగోలు శక్తి పతనం దెబ్బతగలని రంగం లేదంటే అతిశయోక్తి కాదు! అందుచేతనే, నేడు దేశీయ పారిశ్రామిక రంగం మార్కెట్‌లో డిమాండ్ లేక, తన ఉత్పత్తి సామర్థాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక, సగటున కేవలం 69.5% సామర్థ్య వినియోగానికే పరిమితం అవుతోంది. పారిశ్రామిక, రిటైల్ విని యోగం కూడా తగ్గిపోయి చమురు కొనుగోళ్ళు పతనం అవుతున్నాయి. విద్యుత్ వినియోగం కూడా తగ్గిపోతోంది.
ఇటువంటి తీవ్ర ఆర్థిక మాంద్య లేదా మందగమన స్థితిలో బడ్జెట్ ఎలా ఉండాలి? దీనికి జవాబు ఒకటే : అది ప్రజల కొనుగోలు శక్తి పెంచేదిగా వుండాలి. అంటే, బడ్జెట్ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించేదిగా, దేశీయ మెజారిటీ అయిన రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేదిగా, పతనం అవుతోన్న ఎగుమతులను కోలుకొనేలా.. మరింత పెరిగేలా చర్యలు తీసుకొనేదిగా ఉండాలి. అలాగే, పెద్ద నోట్ల రద్దు, అవకతవక వస్తు సేవా పన్ను (జి.ఎస్.టి) ల అమలు వలన దెబ్బతిన్న అసంఘటిత రంగంలోని వారిని, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవటంలో కూడా బడ్జెట్ పెద్ద పాత్రను పోషించాలి.
మరి, దీనంతటి కోసం బడ్జెట్‌లో ప్రాథమికంగా ఏం చేయాలి ? ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను అవసరం మేరకు పెంచడం, రైతాంగానికి కనీస మద్దతు ధరను ఇవ్వడం, ప్రజా పంపిణీ వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తెచ్చి దానిని మరింత విస్తరించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడి వాటిలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం, పరిపాలనా యంత్రాంగంలో పేరుకుపోయిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను చేపట్టడం తదితర చర్యలు అమలు జరగాలి.
కాగా, ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆ దిశగా కదిలే అవకాశాలూ, దానికి అనుకూలతలూ ఎంతవరకు ఉన్నాయి? దీనికి జవాబు సులువే. ప్రస్తుత ఉదారవాద ఆర్థిక విధానాలూ, దాని తాలూకు సైద్ధాంతిక అవరోధాలు, వనరుల సమీకరణ అవకాశాలు వంటి వాటి వలన, ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్య స్థితిపై కాయకల్ప చికిత్సకు కావల్సిన సరంజామా ఈ బడ్జెట్‌లో లభించే అవకాశాలు స్వల్పం.
ముందుగా వనరుల అందుబాటును చూద్దాం. నేడు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆదాయ కొరతను ఎదుర్కొంటోంది. పన్నుల ఆదాయం గణనీయంగా పతనం అయ్యింది. హడావిడిగా ప్రవేశపెట్టిన వస్తు సేవా పన్ను జీఎస్టీ ద్వారా ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఎన్నడూ లేని విధంగా, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల ఆదాయం 6% మేరన పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించుకొన్న, ప్రత్యక్ష పన్నుల సేకరణ లక్ష్యం అయిన 13.5 లక్షల కోట్ల రూపాయలలో, 2019 నవంబర్ నాటికి కేవలం 6 లక్షల కోట్ల మేరనే (50% కంటే తక్కువే) సమీకరణ జరిగింది. స్థూలంగా, తాజా బడ్జెట్‌కు కావల్సిన ఆదాయంలో సుమారుగా 2.53 లక్షల కోట్ల మేరన కొరత ఏర్పడనుంది. ఈ పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో కొరతలు 2024–25 ఆర్థిక సంవత్సరం వరకూ కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వమే స్వయంగా 15 వ ఆర్థిక సంఘానికి నివేదించింది.
ఇక, రెండవది: ప్రభుత్వ వ్యయాలపై సైద్ధాంతిక అంశం లేదా ఉదారవాద సంస్కరణల తాలూకు పరిమితి. దీనిలోని ఒక అంశం ద్రవ్యలోటు. అంటే ప్రభుత్వానికి లభించే ఆదాయం కంటే దాని వ్యయాలు అధికంగా ఉండడం. ఉదాహరణకు ప్రభుత్వ ఆదాయం 100 రూపాయలుగా ఉండి, దాని ఖర్చులు 105 రూపాయలు ఉంటే ఆ అదనపు వ్యయం అయిన 5 రూపాయలనే ద్రవ్యలోటు అని పిలుస్తారు. 2020 ఆర్థిక సంవత్సరానికి పెట్టుకొన్న ద్రవ్యలోటు స్థాయి అయిన 3.3% న్ని దాటకూడదనే పరిమితిని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో బహుశా దాటలేకపోవచ్చును. పైగా ఇప్పటికే ద్రవ్యలోటు ఈ 3.3% పరిమితి దాటిపోయింది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెందిన గీతా గోపీనాధ్ ఇప్పటికే భారత్ తన ద్రవ్యలోటు పరిమితిని దాటకూడదంటూ పరోక్షంగా హెచ్చరించారు కూడా. అందుచేత, ప్రభుత్వం నేడు, ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు తెచ్చేందుకు అప్పో సొప్పో తెచ్చి అదనపు నిధులను ఖర్చుపెట్టే సాహసం చేయకపోవచ్చును.
ఇక, ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన మరో ప్రధాన అంశం: ఉదారవాద సంస్కరణలు ప్రవచించే ఆర్థిక వ్యవహార శైలి. ప్రపంచంలో 1979లో ఆరంభమైన ఈ సంస్కరణల విధానాల ప్రకారంగా ప్రభుత్వం తన వద్దనున్న వనరులను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇవ్వడం అనేది వృధా! ఎందుకంటే, దీని వలన ప్రజలు సోమరిపోతులవుతారట. దీనికి భిన్నంగా, ప్రభుత్వాలు గనుక ఈ నిధులను కార్పొరేట్లు, పై వర్గాల వారికి ఇస్తే, ఆ వనరులు పెట్టుబడులూ, సంబంధిత వ్యయాల రూపంలో జన సామాన్యానికి ఉపాధిని కల్పిస్తాయట. అదీ కథ. సాధారణ సంక్షేమ రాజ్యానికీ, దాని తీరుకూ పూర్తి ఉల్టా కథ. ప్రస్తుతం మన ప్రభుత్వాలు ఇదే తరహా విధానాలను అవలంభిస్తున్నాయి. అందుకే, ప్రజల కోసం వెచ్చిం చేందుకు తన చేతికి వస్తున్న కొద్దిపాటి ఆదాయాన్ని కూడా వదులుకుంటోంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 35% నుంచి 25%నికి తగ్గించింది. కాగా, మరో ప్రక్కన ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై మాత్రం కోతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రజల కొనుగోలు శక్తీ, తద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ల పతనం వలన నేడు మాంద్యస్థితి ఏర్పడిందనేది పాలకుల తలకెక్కడం లేదు. ఈ క్రమమే కొనసాగితే, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మరింత ఉధృతం అవుతుంది. పెట్టుబడులకు ప్రోత్సాహం పేరుతో కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడులకు రాయితీలూ, నజరానాలూ ఉంటాయి. చాలాకాలంగా మాటలు కోటలు దాటినా, చేతలు గడపలు దాటని తీరుగా ఉన్న మౌలిక సదుపాయాల రంగంలో లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడుల ‘‘రంగుల కల’’ మాత్రం ఫిబ్రవరి 1న విడుదల కానుంది. సాహసం చేసి, నడిసంద్రంలో తుఫానులో చిక్కుకున్న ఆర్థిక నావను గట్టెక్కించడం అంటే : అంతర్జాతీయ ద్రవ్య సంస్థల షరతుల పరిధిలో సంస్కరణల పల్టీలు కొట్టడమేనని పాలకులు ఇంకా అనుకుంటూ ఉంటే.. అంతిమంగా భారత్‌ది మరో గ్రీస్ విషాదగాధే అవుతుంది.
డి. పాపారావు
వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్ : 98661 79615
Comments
Please login to add a commentAdd a comment