అశ్రుతర్పణం | Private Colleges Doing Business With Education | Sakshi
Sakshi News home page

అశ్రుతర్పణం

Apr 27 2019 12:51 AM | Updated on Apr 27 2019 12:51 AM

Private Colleges Doing Business With Education - Sakshi

ప్రస్తుతం తెలంగాణ ఇంటర్‌ బోర్డు చుట్టుతా వార్తలు తిరుగుతున్నాయ్‌. జరిగింది చాలా పెద్ద తప్పిదం. తప్పు ఎవరిదన్నా కావచ్చు, దాదాపు ఇరవై యువ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇరవై చిన్న ప్రాణాలని ప్రాణంగా చూసుకుంటూ కనీసం వెయ్యి పెద్ద ప్రాణాలుంటాయ్‌. వారంతా శేష జీవితాన్ని జీవచ్ఛవాల్లా గడపాల్సిందే. ముఖ్య మంత్రి నించి అంతా పరీక్ష తప్పితే ఏముంది, మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. ఉత్తీర్ణత సాధిం చవచ్చు– అంటూ కౌన్సిలింగ్‌ కబుర్లు చెబుతు న్నారు. మూడు లక్షల ముప్ఫై వేలమంది ఇంటర్‌ పిల్లల జాతకాలను కలగాపులగం చేసి పెట్టారు. ముఖ్యంగా టెన్త్, ఇంటర్‌ పరీక్షలంటే చావో రేవో అన్నట్టు అందరూ కలిసి తయా రుచేసి పెట్టారు. దానికి వత్తాసుగా కార్పొరేట్‌ విద్యా సంస్థలు కలుపు మొక్కల్లా వచ్చాయ్‌. వాళ్ల వ్యాపారం కోసం ర్యాంకుల్ని, మార్కుల్నీ జీవిత లక్ష్యంగా మార్చాయ్‌. అన్ని సబ్జెక్ట్‌లనీ పిల్లలకి రుబ్బి పోస్తున్నారు. నేడు వ్యాపార క్షేత్రంలో ప్రముఖ స్థానం వహిస్తోంది విద్యా వ్యాపారం. అందులోనూ విద్యార్థులకు స్టెప్పింగ్‌ స్టోన్స్‌ అయిన ‘టెన్త్, ఇంటర్‌’ ‘ఇక్కడ జారావో ఇంతే సంగతులు’ అంటూ పిల్లలకు పాఠాలతో పాటు నూరి పోస్తున్నారు.

ఉపాధ్యాయులే కాదు, విద్యావేత్తలుగా చలామణి అవుతున్న వారే కాదు, అమ్మ నాన్నలే కాదు అంతా ఇదే హెచ్చరిక. ప్రస్తుతం పోటీ ఉన్నమాట నిజం. అంత మాత్రాన పిల్లల ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. పరీక్షకి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి పిల్లల్ని రానివ్వ లేదు. ఎంతటి క్రమశిక్షణ. మహా నగరంలో ఇళ్ల దగ్గర్నించి రకరకాల ట్రాన్స్‌పోర్ట్‌లలో రావడానికి ఓ నిమిషం ఆలస్యం కావచ్చు. అంత మాత్రాన అంత శిక్షా?! ఇప్పుడు మూడు లక్షల ముప్ఫై వేల మంది భవితవ్యాన్ని వీధిన పడేసిన ఈ అధికారులకు ఏమి శిక్ష విధిస్తారు? నిన్న ముఖ్యమంత్రిగారు నిమ్మకి నీరెత్తినట్టు మాట్లాడారు. ప్రాణంతో ఉన్న పిల్లలకు భరోసా ఇచ్చారు. కనీసం ఇన్ని రోజులుగా పిల్లల తల్లిదం డ్రులు తల్లడిల్లుతుంటే సరైన స్పందన లేదు. ఒక పనికిమాలిన ఏజెన్సీకి బాధ్యతాయుతమైన పరీక్షల వ్యవహారం అప్పగించారన్నది మాత్రం నిజం. మన దేశంలో జవాబుదారీతనం లేదు. ఉండదు. ఇదే ప్రజా రాజ్యానికి అమరిన అలం కారం. ఎంత తప్పు జరిగినా ఎవరికీ శిక్షలుం డవ్‌. ఇంతటి ఘోరం జరిగినప్పుడు, రాష్ట్రం పెద్ద పెట్టున రోదిస్తున్నప్పుడు, సంబంధిత మంత్రి అప్పటికప్పుడు రాజీనామా చేసి ఉండ వచ్చు. చేస్తే... పోయిన ప్రాణాలు వస్తాయా అని అడగచ్చు. కనీసం అసమర్థతని అంగీకరిం చడం ఒక మంచి లక్షణం.

ముఖ్యమంత్రిగారు పరీక్ష పోతే జీవితం పోయినట్లు కాదని పదే పదే వక్కాణిస్తున్నారు. మంత్రి పదవి పోతే ఎంత? కాస్త ఈ గొడవ సద్దుమణగగానే దీని బాబులాంటి పదవి రానే వస్తుంది. పొరబాట్లు అందరూ చేస్తారు. త్యాగాలు కొందరే చేస్తారని నానుడి. కేసీఆర్‌ మొన్నీమధ్యనే అవినీతి మీద పెక్కు బాణాలు సంధించారు. క్షాళనకి దిగుతున్నానని హెచ్చ రించారు.
రెవెన్యూ శాఖ మీద కన్ను వేశారు. చెద పురుగుల్లా రాష్ట్రంలో అవినీతి, ఆశ్రితపక్షపాతం ఎక్కడంటే అక్కడే ఉంది. ఎందుకైనా మంచిది మీమీ సింహాసనాలను ఒకసారి బాగా దులి పించుకోండి. ఈ సంఘటన పట్ల ముఖ్య మంత్రి ఇంకొంత ప్రభావవంతంగా ప్రవర్తించి ఉంటే బాగుండేది. అసలీ ట్రాజెడీ ఇంకా యువ రాజు కేటీఆర్‌ దృష్టికి వచ్చినట్టు లేదు. తాము చెయ్యని తప్పుకు బలైపోయిన విద్యార్థినీ విద్యా    ర్థులకు అశ్రుతర్పణం సమర్పించుకుంటున్నా. వారి పెద్దలకు సానుభూతి తెల్పుకుంటున్నా.

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement