కరోనాపై కప్పదాట్లు ప్రమాదకరం | Rajiv Bhatia Articles On Coronavirus Infection And Data | Sakshi
Sakshi News home page

కరోనాపై కప్పదాట్లు ప్రమాదకరం

Published Sat, Jun 13 2020 1:06 AM | Last Updated on Sat, Jun 13 2020 1:06 AM

Rajiv Bhatia Articles On Coronavirus Infection And Data - Sakshi

సమృద్ధికరమైన డేటా అనేది వైరస్‌ ప్రమాదం గురించి మరింత నిర్దిష్టంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. అలాగే వైరస్‌ని ఎదుర్కోవడంలో మన వనరులను సమర్థంగా ఉపయోగించడానికి కూడా దీనివల్ల వీలవుతుంది. దీనికి అవసరమైనది ఏమిటంటే వైరస్‌ వ్యాప్తి గురించిన డేటాను సమర్థంగా సేకరించడం, ప్రజలకు ఉపయోగపడేలా దాన్ని సంఘటితం చేయడమే. కోవిడ్‌ –19 ఇన్ఫెక్షన్లు సోకిన ప్రతి క్లస్టర్‌కు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం వివరాలను సింగపూర్‌ వంటి దేశాలు నివేదించాయి. అమెరికాలోని గోప్యతా ప్రచారకర్తలు దీన్ని వ్యతిరేకించవచ్చు. కానీ సాంక్రమిక వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి ఎలాంటి వ్యక్తిగత సమాచారం అవసరం లేదు. ప్రతి దేశం కోవిడ్‌ 19కి సంబంధించి తమదైన మార్గంలో డేటా సేకరిస్తుండటం ఒక సవాలులాంటిది. 

పందొమ్మిదో శతాబ్దికి చెందిన శస్త్రచికిత్స వైద్యుడు, సాంక్రమిక రోగ విజ్ఞాన శాస్త్రవేత్త జాన్‌ స్నో కలరా వ్యాప్తికి మూల కారణం గాలి కాదని, నీటి ద్వారా అది వ్యాప్తి చెందుతోందని కనుగొన్నాడు. కలరా రోగులు నీరు ఎక్కడినుంచి తెచ్చుకుంటున్నారు అనే సాధారణ ప్రశ్న వేయడం ద్వారా ఆయన కలరా మూలకారణం గుట్టు బయటపెట్టేశాడు. ఇప్పుడు సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్నాం. కానీ మనం సరికొత్త కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్ల గురించి మన ప్రజారోగ్య శాఖలు రోజువారీగా సేకరిస్తున్న డేటా అధ్యయనానికి అలనాటి భూతవైద్య సంబంధ ఉపకరణాలనే అన్వయిస్తున్నాం.  

నాతో పనిచేస్తున్న ప్రజారోగ్య విభాగం ప్రొఫెసర్‌ సాంక్రమిక రోగ విజ్ఞాన శాస్త్రం అంటే రోగ కారణాలను అధ్యయనం చేసే శాస్త్రం అని నిర్వచించాడు. గతేడాది చివరలో ఆవిర్భవించిన కరోనా వైరస్‌ వ్యాధికి తక్షణ కారణాలు ఉన్నాయి. వాటి వెనుక అనేకానేక సమస్యలున్నాయి.  ఒక ఇన్ఫెక్షన్‌ ఎక్కడ, ఎలా మొదలవుతోంది వంటి కారణాలను అర్థం చేసుకోవడం అనేది ఏ వ్యాధి నిరోధానికైనా కీలకం అవుతుంది. అతిపెద్ద ప్రమాదానికి కారణమయ్యే ప్రదేశం గురించిన మెరుగైన వాస్తవాలను కనుగొంటే అది తక్కువ ప్రమాదం ఉండే వ్యాధి చర్యలపై ప్రజలు మరింత ఆత్మవిశ్వాసంతో ఉండటంలో తోడ్పడుతుంది. ఈ సమాచారం వ్యాధి నిరోధంపై ఎక్కడ గురిపెట్టాలనే విషయంలో ప్రజారోగ్య అధికారులకు ఉపకరిస్తుంది. 

సరైన సమాచారం కీలకం
ఎందుకంటే వైరస్‌ అనేది ఎలాంటి లక్షణాలు లేని ప్రజల ద్వారా సులభంగా వ్యాప్తి చెందుతుంది. కేవలం కొన్ని ప్రాంతాలు లేక చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే మనం కోవిడ్‌–19 ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేం. కానీ వ్యాధి సోకడం, అది వ్యాప్తి చెందడం అనేది ప్రతిచోటా, ప్రతి సమయంలో, ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించడం లేదు. సాంక్రమిక వ్యాధిగా పరిణమిస్తున్న కొద్దీ స్థానికంగా వైరస్‌ వ్యాప్తి చెందడం పెరుగుతుందని మనం ఊహించవచ్చు. వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గురించి మనం ఇప్పటికే చాలా విని ఉన్నాం. నర్సింగ్‌ హోమ్స్, మాంసం ప్యాక్‌ చేసే ప్లాంట్‌లు, సంగీత కార్యక్రమాలు, కారాగారాలు వంటి చోట్ల సాంక్రమిక వ్యాధులు బాగా ప్రబలుతున్నట్లు సమాచారం ఉంది కూడా.  అంటే నిర్దిష్టంగా కొన్ని ప్రాంతాలు మరింత ప్రమాదకరంగా ఉంటున్నాయి. ఇంతవరకు వైరస్‌ ఎక్కడ పుట్టి వ్యాప్తి చెందుతుందనే విషయంపై అంచనాలు వేస్తున్నాం. కానీ ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడం ద్వారానే సాంక్రమిక రోగ విజ్ఞాన శాస్త్రం సమర్థంగా వ్యవహరించగలదు. 

వైరస్‌కి సంబంధించిన రిస్క్‌ ఎక్కడుంది అనే అంశంపై అనిశ్చితి వ్యాధిపై కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది. ఇటీవలే చికాగో విశ్వవిద్యాలయం అసోసియేటెడ్‌ ప్రెస్‌ నిర్వహించిన పోల్‌ టెస్టు ప్రకారం సగంమందికి పైగా అమెరికన్లు హెయిర్‌ కట్‌ చేసుకోవాలన్నా, షాపింగ్‌కు వెళ్లాలన్నా, మిత్రులను కలుసుకోవాలన్నా భయపడిపోతున్నారని తెలిసింది. వైరస్‌ వల్ల ఎక్కువ ప్రమాదం సంభవించే ప్రాంతాల గురించి మెరుగైన వాస్తవాలను కనుగొంటే తక్కువ ప్రమాదం కలిగే చర్యల పట్ల జనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ప్రతి కోవిడ్‌ –19 కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన డేటాను సేకరిస్తున్నాయి. కానీ ఇంతవరకు, రిస్క్‌ ఎక్కడ ఎక్కువగా ఉందని చెప్పడానికి ఈ సమాచారాన్ని పెద్దగా ఉపయోగించటం లేదు. పశ్చిమ దేశాల్లో లైసెన్స్‌ ఉన్న నర్సింగ్‌ హోమ్‌లనుంచి అనేక కోవిడ్‌ –19 కేసులు, మరణాల గురించి నివేదికలు వచ్చాయి. విభిన్నమైన జీవన, పని పరిస్థితులు వైరస్‌ వ్యాప్తికి ఎలా దోహదం చేస్తున్నాయనే విషయాన్ని రాష్ట్రాలు, దేశాలు, వ్యాధి నియంత్రణ కేంద్రాలు సరిగ్గా చెప్పడం లేదు.

పని సంబంధిత సంక్రమణ 
పనికి సంబంధించిన స్థలాల్లో వ్యాధి సంక్రమణ తొలి దశ వైరస్‌ వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆసియాలో జరిగిన ఒక అధ్యయనం కనుగొంది. ఆరోగ్య సంరక్షణ పని, డ్రైవింగ్, రిటైల్‌ అమ్మకాలు వైరస్‌ వ్యాప్తికి వీలుకలిగించే ప్రమాదకరమైన కారణాలుగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఆసియా ఖండంలో ఆరు విభిన్న దేశాల నుంచి సేకరించిన కేసుల డేటాను పరిశోధకులు సమగ్రంగా విశ్లేషించిన ఫలితంగానే ఈ అధ్యయనం సాధ్యమైంది. ఒక వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, వారి పని, ఇటీవల వారు ప్రయాణించినప్పుడు ఇప్పటికే వైరస్‌ సంక్రమించిన వ్యక్తులతో సంబంధంలోకి వచ్చారా వంటి వివిధ అంశాలకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని వైద్యులు క్రోడీకరించి కేసు రిపోర్టు పత్రాలను నింపారు.  

వైరస్‌ కాంటాక్టుల జాడ పసిగట్టి చెబుతున్న వారి పని మరిన్ని అదనపు అంశాలను అందిస్తోంది. కాంటాక్ట్‌ ట్రేసర్ల ప్రధానమైన పని క్వారంటైన్‌లో ఉన్న వ్యాధిసోకిన వ్యక్తి కాంటాక్టుల సమాచారాన్ని కనుగొనడమే. ఎంతమందికి వైరస్‌ సోకింది, వైరస్‌ సోకిన వ్యక్తులు ఎంత వేగంగా మన మధ్య సంచరిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి ట్రేసర్ల పని నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే ప్రజలు కూడా ఎక్కడ, ఎలా వైరస్‌తో కాంటాక్ట్‌ అయ్యారు అనే అంశంపై ట్రేసర్లు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. వైరస్‌ ఎక్కడ సోకింది, ఇంటిలోనా, బార్‌లోనా, చర్చిలోనా, స్కూల్‌లోనా, సరుకుల దుకాణంలోనా, ప్రభుత్వ స్విమ్మింగ్‌ పూల్‌లోనా, ప్రజలు కలిసి భోజనం పంచుకున్నారా, కలిసి పనిచేశారా లేక పార్కులో పక్కపక్కనే నడిచారా అనే అంశాలను ట్రేసర్లు తెలుసుకోవచ్చు. 

వైరస్‌ ప్రమాదాలను అర్థం చేసుకోవడం 
సమృద్ధికరమైన డేటా అనేది వైరస్‌ ప్రమాదం గురించి మరింత నిర్దిష్టంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. అలాగే వైరస్‌ని ఎదుర్కోవడంలో మన వనరులను సమర్థంగా ఉపయోగించడానికి కూడా దీనివల్ల వీలవుతుంది. దీనికి అవసరమైనది ఏమిటంటే వైరస్‌ వ్యాప్తి గురించిన డేటాను సమర్థంగా సేకరించడం, ప్రజలకు ఉపయోగపడేలా దాన్ని ఆర్గనైజ్‌ చేయడమే. కోవిడ్‌ –19 ఇన్ఫెక్షన్లు సోకిన ప్రతి క్లస్టర్‌కు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం వివరాలను సింగపూర్‌ వంటి దేశాలు నివేదించాయి. అమెరికాలోని గోప్యతా ప్రచారకర్తలు దీన్ని వ్యతిరేకించవచ్చు. కానీ సాంక్రమిక వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి ఎలాంటి వ్యక్తిగత సమాచారం అవసరం లేదు. ప్రతి దేశం కోవిడ్‌– 19కి సంబంధించి తమదైన మార్గంలో డేటా సేకరిస్తుండటం ఒక సవాలులాంటిది. ఒకే భాషలో, రియల్‌ టైమ్‌లో బహిరంగంగా అందుబాటులో ఉండే సమాచారం మనకు అవసరం.

స్వజాతీయతపై మెరుగైన సమాచారం కోసం పిలుపునివ్వడం అమెరికాలో కొన్ని నెలల క్రితమే ప్రారంభమైంది. వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) డైరెక్టర్‌ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ ఆయా దేశాలు మరిన్ని వాస్తవాలను నివేదించాల్సి ఉందని కోరారు. అయితే ఈ అదనపు వాస్తవాలను ఆగస్టు నెల వరకు పంపాలని ఆయన చెప్పారు. ప్రతి ఉపయోగకరమైన సమాచారాన్ని సేకరిస్తారని భావిద్దాం. ఆగస్టు వరకు సమయం ఇవ్వడం అంటే మరీ ఎక్కువ. ఈ డేటా విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్గనైజ్‌ చేసి, పంచుకోవడం మన ముందున్న సులభమైన సవాళ్లలో ఒకటి. మనం సరికొత్త వెంటిలేటర్‌ను కనుగొనడం లాంటిది కాదు. 

కోవిడ్‌–19 ఎలా, ఎక్కడ వ్యాప్తి చెందుతోంది అనే అంశాన్ని అర్థం చేసుకోవడానికి, 19వ శతాబ్దంలో జాన్‌ స్నోలాగా మురికి గుంటల్లో వ్యాధికారకాన్ని వెతకాల్సిన అవసరం మనకు ఉండకపోవచ్చు. కానీ భద్రతవైపు అడుగేయడంలో అది మనకు తగిన మార్గదర్శకాలను అందిస్తుంది. అమెరికా ఆరోగ్య విభాగాలు ఇలాంటి డేటాను నెలలక్రితమే సేకరిస్తూ వచ్చాయి. ఈ డేటాను మొత్తంగా ఒకచోటికి చేర్చి ఉపయోగించడానికి ఇదే సరైన తరుణం. 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఇప్పటికి నాలుగు నెలలు కావస్తోంది. ఇప్పటికీ అతి చిన్న స్థాయిలో డేటాను మాత్రమే వెల్లడి చేయడం అవమానకరమైందిగానే చూడాలి. విస్తృతస్థాయిలో డేటాను వెల్లడించి ఉంటే  ప్రజలు తమ భద్రతపై మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. కరోనా వైరస్‌ ఎక్కడినుంచి వ్యాప్తి చెందుతోంది అనే విషయంపై డేటాను పంచుకుని ఉంటే ప్రజలు తమ సొంత బాధ్యతగా కూడా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండేవారు. గోప్యత పేరుతో వైరస్‌ వ్యాప్తికి చెందిన ముఖ్యమైన డేటాను బహిరంగపర్చనట్లయితే మరింత నష్టం తప్పదని గ్రహించాలి. 


రాజీవ్‌ భాటియా
వ్యాసకర్త, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మెడిసిన్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement