మాంద్యానికి బిస్కెట్‌ మేలుకొలుపు | Sidharth Bhatia Article On Parle G Workers Layoff | Sakshi
Sakshi News home page

మాంద్యానికి బిస్కెట్‌ మేలుకొలుపు

Published Sat, Aug 24 2019 1:11 AM | Last Updated on Sat, Aug 24 2019 1:11 AM

Sidharth Bhatia Article On Parle G Workers Layoff - Sakshi

బిస్కెట్‌ చాలా చౌక వస్తువు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పార్లే జి బిస్కెట్‌ ధర యథాతథంగా ఉండటం కంపెనీ పాటించే వ్యాపార సూత్రం. దేశంలో ఒకపూట భోజనం చేయడానికి డబ్బులు లేని వారు కూడా ఒక కప్పు టీ, దాంతోపాటు రెండు బిస్కెట్లను తినడానికి పూనుకుంటారు. ప్రజల అభిరుచులు దెబ్బతీయని చోట ప్రభుత్వ విధానాలు దెబ్బతీస్తున్నాయి. బిస్కెట్లపై జీఎస్టీ విధింపు వల్ల ధరలు పెరిగాయి. బిస్కెట్‌ని కారుతో పోల్చి చూడలేం. ఎందుకంటే కారును ఒకసారి మాత్రమే కొనగలం. దాన్ని మళ్లీ మళ్లీ మార్చలేం. కానీ కేవలం ఐదు రూపాయల విలువైన బిస్కెట్‌ ప్యాకెట్‌ను కొనడానికి కూడా ప్రజలు వెనకాముందూ ఆలోచిస్తున్నారంటేనే ఆర్థిక సంక్షోభం తీవ్రమైందనే అర్థం.  పారిశ్రామిక వేత్తల అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు కానీ బిస్కెట్ల అమ్మకాల పతనం ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి.

దాదాపు పదివేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రముఖ బిస్కెట్‌ తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్‌ చేసిన ప్రకటన ఆటోమొబైల్స్‌ రంగంలో పొంచి ఉన్న మాంద్యాన్ని తలపిస్తూ కలవరం కలగించింది. బిస్కెట్లకు డిమాండ్‌ పడిపోవడంతో పాటు ప్రభుత్వ విధానాలు కూడా సంక్షోభాన్ని మరింత పెంచి పోషించాయని సంస్థ పేర్కొంది. అతి తక్కువ ఖర్చు అయ్యే ఒక బిస్కెట్‌ పాకెట్‌ కొనడానికి కూడా ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారంటే దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం పొంచివున్నట్లే లెక్క. ఒక బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనుగోలు చేయడం అంత కష్టమైన పనా అని ఎవరైనా అడగవచ్చు. కానీ ఇది నిజం. కానీ ఈ సంక్షోభం ఇంకా తీవ్రస్థాయిలో ఉందని  వార్తలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి ఎంతగా కుదించుకుపోయిందంటే, అతి తక్కువ ఖర్చు అయ్యే ఉత్పత్తులను కొనడానికి కూడా వారు సంసిద్ధంగా లేరు.  భారత్‌ ఆర్థిక మాంద్యం వైపుగా పయనిస్తోందని దీనర్థం. అంతకు మించి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలోకూడా ఎవరికీ తెలీనట్లు కనిపిస్తోంది. 

బిస్కెట్‌ని కారుతో పోల్చి చూడలేం. ఎందుకంటే కారును ఒకసారి మాత్రమే కొనగలం. దాన్ని మళ్లీ మళ్లీ మార్చలేం. తిరిగి కొనలేం. కానీ బిస్కెట్లను మాత్రం వినియోగదారులు నిత్యం కొంటుంటారు. వారానికి పలుమార్లు కొంటుంటారు. ఒకేసారి లక్షల విలువైన వస్తువును కొనాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ కేవలం 5 రూపాయల విలువైన బిస్కెట్‌ ప్యాకెట్‌ను కొనడానికి కూడా ప్రజలు వెనకాముందూ ఆలోచిస్తున్నారంటేనే ఆర్థిక సంక్షోభం తీవ్రమైందనే అర్థం. 

దేశంలో అతి మారుమూల ప్రాంతాల్లో కూడా పార్లే జి బిస్కెట్లు అందుబాటులో లేని ప్రాంతం అంటూ లేదని ఆ సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకప్పుడు నాకు చెప్పి ఉన్నారు. ఆయన తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా హిమాలయాల్లోని అతి మారుమూల ప్రాంతాలను, సాధారణంగా ఎక్కడానికి వీల్లేని కొండ మార్గాల్లోని అతి చిన్న గుడిసెలను కూడా సందర్శించేవారు. అక్కడ సైతం ఆయనకు తమ కంపెనీ బిస్కెట్లు ఉన్న ఒక షాప్‌ అయినా కనిపించేది. అది తమ సంస్థ కున్న సమర్థమైన పంపిణీ యంత్రాంగం మాత్రమే కాదని, పార్లే జి బిస్కెట్లకు డిమాండ్‌ ఉన్నందునే దుకాణదార్లు తమకుతాముగా వాటిని కొనడానికి ప్రయత్నించేవారని ఆయన చెప్పారు.  

ఒక బిస్కెట్‌ అనేక అవసరాలను నెరవేరుస్తుందని ఆ ఎగ్జిక్యూటివ్‌ అభిప్రాయం. ఉదయాన్నే వేడి టీ తాగుతూ బిస్కెట్‌ని తినడంతో రోజు మొదలవుతుంది. పిల్లల లంచ్‌ బాక్సుల్లో అది స్నాక్‌గా ఇమిడిపోతుంది. వేళకు భోజనం ఆరగించలేనప్పుడు ఆకలిని చంపుకోవడానికి బిస్కెట్‌  తిని సరిపెట్టుకుంటుంటారు. అలాగే శ్రమజీవికి బిస్కెట్‌ లోని తియ్యదనం ప్రాణం పోస్తుంటుంది. 

అన్నిటికంటే మించి బిస్కెట్‌ చాలా చౌక వస్తువు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పార్లే జి బిస్కెట్‌ ధర యథాతథంగా ఉండటం కంపెనీ పాటించే వ్యాపార సూత్రమని ఆయన చెప్పారు. కొన్ని రకాల బిస్కెట్ల ధరలు కాస్త పెరుగుతున్నప్పటికీ ప్రారంభ స్థాయిలో సగటు బిస్కెట్‌ ధరలు పెరగకుండా కంపెనీ జాగ్రత్తపడేది. పాకెట్‌ సైజులను మార్చడం, ఇతర పద్ధతులను అవలంబించడం ద్వారా ధర మాత్రం పెరగకుండా చూసుకునేవారు. పన్నులు ఏవైనా ఉంటే వాటిని చివరగా బిస్కెట్‌ పాకెట్‌ ధరకు జోడించేవారు. మరిన్ని డబ్బులు వెచ్చించి కొనడానికి శక్తిలేని కొనుగోలు దారుకు బిస్కెట్‌ అతి సరసమైన ధరకే లభిస్తూ ఉంటుంది. ప్రతి దినం నిత్యావసర వస్తువులన్నింటి ధరలు పెరుగుతున్నా బిస్కెట్‌ ధర మాత్రం స్థిరంగా నిలిచి ఉంటుంది. కంపెనీ అప్పీల్‌కి అది అదనపు జోడింపుగా ఉండేది. 

ఒక వస్తువుకు బ్రాండ్‌ని సృష్టించే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో నాణ్యత ఒకటయితే, విశ్వసనీయత మరొకటి. ఇప్పుడు దాని పట్ల వ్యామోహం కూడా ఒక బ్రాండ్‌ స్థాయికి చేరుకోవడం విశేషం. మార్కెట్‌లో ట్రెండ్‌లకు అనుగుణంగా మార్పులు చేస్తున్న కంపెనీ తమ ఉత్పత్తిని వినియోగదారులు గుర్తుపెట్టుకోవడానికి గానూ పార్లే జి బిస్కెట్‌ పట్ల వారికి గతంనుంచి కొనసాగుతున్న వ్యామోహంపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. అయితే మార్కెట్లో పోటీ కారణంగా అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ పార్లే జి కంపెనీ మాత్రం సంవత్సరాలుగా తన ఆధిపత్య స్థానాన్ని పదిలపర్చుకోవడమే కాకుండా విస్తరించుకుంటూ వచ్చేది. ప్రజల అభిరుచులు దాని స్థానాన్ని దెబ్బతీయని చోట ప్రభుత్వ విధానాలు ఇప్పుడు దెబ్బతీస్తున్నాయి. బిస్కెట్లపై జీఎస్టీ విధింపు వల్ల ధరలు పెరిగాయి. పైగా పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగాలు కోల్పోవడం, భవిష్యత్తు నిరాశాజనకంగా కనిపించడం వంటి కారణాలతో ఒక చిన్న బిస్కెట్‌ పాకెట్‌ను కొనడం కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా వినియోగదార్లకు భారమవుతూ వస్తోంది.
 
దేశంలో ఒకపూట భోజనం చేయడానికి డబ్బులు లేని వారు కూడా ఒక కప్పు టీ, దాంతోపాటు ఒకటి లేక రెండు బిస్కెట్లను తినడానికి పూనుకుంటారు. రోజు కూలీకి లేక కాంట్రాక్ట్‌ లేబర్‌కి ప్రతి రూపాయి లెక్కే మరి. ఈరోజు వారికి పని దొరక్కపోవచ్చు, రేపు కూలీ ఉండకపోవచ్చు. నెలవారీగా వేతనాలు పుచ్చుకునే ఉద్యోగులకు కూడా మరికొన్ని నెలలు తమ ఉద్యోగం ఉంటుందనే గ్యారంటీ లేదు. ఆటో మొబైల్‌ రంగాలకు మీడియా విపరీత ప్రాధాన్యం ఇచ్చి కథనాలు రాస్తూండవచ్చు కానీ, చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలన్నీ మీడియా కంటికి కనిపించకుండానే అనేక మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తుండటం పరిపాటిగా మారింది. 
ఉదాహరణకు, జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ కుప్పకూలిపోయినప్పుడు వేలాదిమంది అత్యంత నిపుణులైన, కఠినశ్రమకు ఓర్చుకోగల వృత్తి జీవులు రాత్రికి రాత్రే నిరుద్యోగులుగా మారిపోయారు. ఇంటి అద్దె, స్కూల్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే వారు సెలవుల్లో ఎక్కడికైనా విహారానికి వెళ్లాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఇదే పరిస్థితి నిర్మాణరంగంలో ఉన్న కార్మికులకు కూడా వర్తిస్తుంది. భవన నిర్మాణ పనులు లేని పరిస్థితుల్లో ఒక పాకెట్‌ బిస్కెట్‌ కొనడానికి కూడా వీరికి గగనమవుతూ ఉంటుంది. 

తమ వ్యాపారం సజావుగా సాగించేందుకు ఏదైనా ఉపశమన చర్యలు కల్పించాలని పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతుంటాయి. కాస్త కష్టం తగలగానే వ్యాపారసంస్థలు కేవలం చాపల్యం తోనే అలా వాదిస్తుంటాయని, పరిశ్రమవర్గాలు చీటికీమాటికీ ప్రభుత్వ సహాయాన్ని కోరకూడదని స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్థికవేత్తలు వాదిస్తున్నప్పటికీ పరిశ్రమ డిమాండును అర్థం చేసుకోవలసిందే. వ్యాపారంలో మీకు మీరుగా ఎదగాల్సిందే తప్ప ప్రతిదానికి నాన్నా, నాన్నా అంటూ అడిగే చిన్నపిల్లల్లా వ్యవహరించ కూడదని ప్రభుత్వ ఆర్థిక సలహాదార్లు వ్యాపారస్తులకు చెబుతుంటారు.  

కానీ వాస్తవమేమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత నిరాశాపూరితమైన పరిస్థితిని ప్రభుత్వం తప్పక పట్టించుకోవలిసి ఉంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమకు ఎదురవుతున్న సంక్షోభాన్ని ఉద్యోగుల తొలగింపు, లేక వారి సంఖ్య తగ్గింపువంటి చర్యలద్వారా అధిగమించవచ్చు. కానీ బడుగుజీవులకు మాత్రం ఎలాంటి రక్షణ కవచమూ లేదు. ఒకదశలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పథకాలు బాగా అమలైన రోజుల్లో దేశంలోని నిరుద్యోగులందరికీ ఎంతో కొంత ఆదాయం లభించేది. వారికి పని, వేతనం దొరికి కాస్త గౌరవ లభించేది కూడా. పట్టణాల్లోకి వలసపోయిన వారు కూడా ఈ జాతీయ ఉపాధి పథకం పట్ల ఆకర్షితులై తమతమ గ్రామాలకు వెళ్లిపోవడంతో పారిశ్రామిక, కాంట్రాక్టు వేతనాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇది పూర్తిగా తల్లకిందులైంది. 

రానున్న కొద్ది సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల డాలర్ల విలువకు ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవడం అనేది ప్రభుత్వం నుంచి అందమైన ప్రకటనగా మిగిలిపోవచ్చు కానీ దేశం అంతర్జాతీయ శక్తిగా వెలిగేందుకు మదుపులను ఎలా అందిస్తుందనేది పరిశ్రమవర్గాలకు అంతుబట్టడం లేదు. ఇక వేతనజీవికి తన నెలవారీ ఈఎంఐలు ఎలా చెల్లించాలన్నిది భారంగా మిగులుతోంది. ఇక రోజు కూలీకి కనీసం కుటుంబానికి బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనడానికైనా పని దొరుకుతుందా అనేది వేదనగా మిగిలింది. 

మాంద్య పరిస్థితుల్లో ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ ప్రారంభాన్ని కనిపెట్టే ‘అండర్‌వేర్‌ ఇండెక్స్‌’  గురించి ఆర్థికవేత్తలు మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచించే ‘బిస్కెట్‌ ఇండెక్స్‌’ రంగంలోకి వచ్చింది. పారిశ్రామిక వేత్తల అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు కానీ బిస్కెట్ల అమ్మకాల పతనం గురించి వార్తలు ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి.    


సిద్ధార్థ్‌ భాటియా

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌, ద వైర్‌ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement