తన సైనిక ప్రయోజనాలను, లక్ష్యాలను నెరవేర్చుతున్నంత కాలం ఉగ్రవాద సంస్థలపై పాక్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం జరగని పని. కానీ ఉపఖండం మొత్తంలో యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలవంతంగా మోపడం ద్వారా పాకిస్తాన్ భూభాగం కల్లోల పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోందన్న వాస్తవాన్ని ఆ దేశం గుర్తించాల్సి ఉంది. పాక్ భూభాగంలో 2007 నుంచి తాలిబాన్‌లు ఉగ్రవాద క్యాంపెయిన్‌ను కొనసాగిస్తున్నారు. ప్రజలనే కాదు.. పాక్ సైనిక బలగాలను కూడా తాలిబాన్లు వదలడం లేదు. తమ దేశంలోనూ, ఉపఖండంలోనూ నిజంగా శాంతిని పాక్ విధాన నిర్ణేతలు కోరుకుంటున్నట్లయితే తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అనుమతించరాదు.
భారత వైమానిక బలగం తన భూభాగంలో ఏకపక్ష సైనిక చర్యకు పాల్పడిన ఘటన పాకిస్తాన్‌ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన వెనువెంటనే రెండు భిన్నమైన వాదనలకు, ప్రకటనలకు తావిచ్చింది. పాకిస్తాన్ భూభాగంలోనుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న జైషే మహమ్మద్ సంస్థ శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది. కానీ తన భూభాగంలోనికి ప్రవేశించిన భారత్ యుద్ధ విమానాలను పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెంటాడగా తప్పించుకునే ప్రయత్నంలో భారత్ యుద్ధవిమానాలు ఖాళీ స్థలాల్లో బాంబులు జారవిడిచాయని, ఈ దాడిలో తమవైపు ఏ నష్టమూ జరగలేదని పాక్ ప్రకటించుకుంది. జమ్ము–కశ్మీర్‌లోని పుల్వామా సెక్టార్‌లో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఆత్మాహుతి దళసభ్యుడి ఘాతుక చర్యలో 40మంది భారతీయ సైనికులు చనిపోయిన ఘటన తర్వాత ఈ వరుస పరిణామాలు సంభవించాయి.
వైమానిక దాడులు చెబుతున్న వాస్తవం?
భారత్–పాకిస్తాన్‌లు రెండూ తమ తమ యుద్ధతంత్రాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఈ సమాచార యుగంలో కూడా పాకిస్తాన్ భూభాగంలో భారత వైమానిక దాడులకు సంబంధించిన సంపూర్ణ వాస్తవాన్ని తెలుసుకోవడం కష్టంగానే ఉంటోంది. ఇరుదేశాలూ తమకు అనుకూలమైన ప్రకటనలు చేశాయి. కానీ క్షేత్రస్థాయి నివేదికలు మూడో అభిప్రాయాన్ని సూచిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియాలో విçస్తృతంగా సమాచారం పంచుకున్నారు. వైమానిక దాడులు జరిగిన ప్రాంతంలో పనిచేస్తున్న అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులు వీరిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసిన దాన్ని బట్టి చూస్తే, దాడి జరిగిన ప్రాంతంలో పలు గృహాలు ధ్వంసమయ్యాయని, ప్రజలు గాయపడ్డారని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో జైషే మహమ్మద్ నిర్వహిస్తున్న మత పాఠశాలను భారత్ యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయని కూడా కొంతమంది తేల్చి చెప్పారు.
ఈ బహుముఖ ప్రకటనల మధ్యనే వాస్తవం దాగి ఉంది. భారత వైమానిక బలగాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించడం వాస్తవం. అలాగే అవి పాక్ భూభాగంపై బాంబులు జారవిడిచాయనటంలోను ఎలాంటి సందేహం లేదు. కానీ అవి లక్ష్యంమీద దాడి చేశాయా లేదా అనే విషయంపైనే ఇరు పక్షాలూ విభేదిస్తున్నాయి. అందుకే యుద్ధంలో మొదట బలయ్యేది సత్యమే అనే పాత నానుడిని ఈ కొత్త ఘటన కూడా సరికొత్తగా స్పష్టం చేస్తోంది.
ఉగ్రవాదుల అడ్డాగా పాకిస్తాన్
పాక్ అంగీకరించినా, అంగీకరించకపోయినా అది ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని ప్రపంచానికి బోధపడింది. కశ్మీర్‌పై దృష్టి సారించిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలే కాకుండా అప్ఘానిస్తాన్‌ని లక్ష్యంగా చేసుకున్న హక్కాని నెట్‌వర్క్, ఇరాన్‌పై గురిపెట్టిన సున్నీ మిలిటెంట్ గ్రూపులకు కూడా పాకిస్తాన్ అసలైన అడ్డాగా ఉందని తేలిపోయింది. ఇరాన్ భూభాగంలో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ సంస్థలు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన పాతికమందికి పైగా సైని కులను చంపేసిన తర్వాత ఇరాన్ పాలకులు పాక్ పాత్ర గురించి నిందించిన విషయం తెలిసిందే.
ఇటీవలే పాక్ భావల్పూర్‌లోని ఒక మత పాఠశాలపై చర్య తీసుకుంది. తర్వాత అధికారిక ప్రకటనలో ఆ పాఠశాల జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా మరొక ప్రకటనలో జమాత్ ఉద్ దవా, ఫలేహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్‌లపై మళ్లీ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ రెండు సంస్థలూ లష్కరే తోయిబా ముసుగు సంస్థలుగా పేరొందాయి. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 150 మందికి పైగా ప్రజలను చంపేసిన ఘట నకు సూత్రధారి లష్కరే తోయిబానే అన్నది మర్చిపోరాదు. ఇది పూర్తిగా పాకిస్తాన్ భూభాగంనుంచే నాటి దాడులకు పథక రచన చేసి, అమలు చేసిందని కూడా బట్టబయలైంది.
మతపరమైన విద్యాసంస్థల ముసుగులో ఉన్న ఇవి చారిటీ సంస్థలు కావనీ వీటన్నింటికీ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని వీటిపై దాడి చేసిన తర్వాత పాక్ ప్రభుత్వం గుర్తించింది కాబట్టే ఆ తర్వాత వాటిపై పెద్దగా చర్యలు తీసుకోకుండా ఉండిపోయింది. అలాంటి సంస్థలు ఇతరత్రా నిర్వహిస్తున్న ఇదే రకమైన కార్యకలాపాలను పాక్ ప్రభుత్వం ఎందుకు నిషేధించడం లేదు, వాటిని ఎందుకు తన నియంత్రణలోకి తీసుకోలేదు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి సమాధానాన్ని కూడా ఒక పాక్ పత్రిక తన పరిశోధనాత్మకమైన కథనంలో పొందుపర్చింది. ఇలాంటి సంస్థలపై నిషేధం విధించడం మాటవరసకు మాత్రమే జరిగిందని, అవి తమ తమ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను ఇప్పటికీ స్వేచ్ఛగా కొనసాగిస్తున్నాయని ఆ కథనం తేల్చి చెప్పింది. పాక్ ప్రభుత్వం వాస్తవంగా చేపట్టే ఇలాంటి నిషేధాలను, అణచివేత చర్యలను మీరు ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు ఈ సంస్థల నిర్వాహకుల్లో ఒకరు తేలిగ్గా సమాధానమిచ్చారు. ‘ఆ ఏముందీ, మా సంస్థ పేర్లు మార్చుకుంటాం. అంతే.. మళ్లీ పనిచేస్తాం’.
ఉగ్రవాద సంస్థలపై నిర్దిష్ట చర్యలేవి?
దీనికి సమాధానం సింపుల్. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం యుద్ధ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రయోజనాలు పొందుతోంది. ఈ ప్రాంతంలో కొన్ని మిలిటెంట్ సంస్థలు మంద్రస్థాయి సైనిక ఘర్షణలను సృష్టించడాన్ని కొనసాగిస్తున్నాయి. పైగా పాక్ ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయంలో సింహభాగాన్ని గుంజుకోవడం ద్వారా పాక్ సైన్యం ఎక్కువగా లబ్ధి పొందుతోంది. స్వదేశంలో ఆధిపత్య స్థానాన్ని చలాయిం చడం ద్వారా రాజకీయంగానూ పాక్ సైన్యం లబ్ధి పొందుతోంది. అంతకుమించి సరిహద్దుల్లో బలమైన శత్రువుతో వ్యవహరిస్తున్నందున తన చర్యలపై ఎవరూ ఇబ్బందికరమైన ప్రశ్నలను సంధించలేని సానుకూల పరిస్థితివల్ల పాక్ సైన్యం వ్యూహాత్మకంగా కూడా లబ్ధి పొందుతుండటం వాస్తవం.
సైనిక ప్రయోజనాల కోసం, పుల్వామాలో భారత సైనికబలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి వంటి ముందస్తు లక్ష్యాలను నెరవేర్చుతున్నంత కాలం ఉగ్రవాద సంస్థలపై పాక్ ప్రభుత్వం, సైన్యం తగు చర్యలు తీసుకునే ప్రసక్తే కనిపించదు. కానీ ఈ మొత్తం ప్రాంతంలో యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలవంతంగా మోపడం ద్వారా పాక్ భూభాగం కల్లోల పరి స్థితులను ఎదుర్కొనాల్సి వస్తోందన్న వాస్తవాన్ని పాక్ గుర్తించాల్సి ఉంది. దీనికి సాక్ష్యాధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాక్ భూభాగంలో 2007 నుంచి తాలిబాన్‌లు ఉగ్రవాద క్యాంపెయిన్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల తాలిబాన్లు పాక్ భూభాగంలో వేలాదిమంది అమాయకుల్ని చంపేశారు. చివరకు పాక్ సైనిక బలగాలను కూడా తాలిబాన్లు వదలడం లేదు. దీంతో పాక్‌పై ప్రపంచంలోనే ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా ముద్రపడిపోయింది.
శాంతి కావాలంటే ఉగ్రచర్యలు ఆపాల్సిందే!
తమ దేశంలోనూ, ఉపఖండంలోనూ నిజంగా శాంతిని పాకిస్తాన్ విధాన నిర్ణేతలు కోరుకుంటున్నట్లయితే తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్వదేశంలో పాకిస్తాన్ భద్రతా విధానంతో ముడిపడి ఉన్న మౌలిక సమస్యను గుర్తించి తదనుగుణంగా వ్యవహరించడానికి బదులుగా పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఒకరు భారత వైమానిక బలగం దాడుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ పాక్ ప్రతిస్పందనను భారత్ ఎదురు చూడాలని, అణు దాడి జరిపే అవకాశాలను కూడా పాక్ సైన్యం చర్చిస్తోందని ప్రకటన చేశారు. పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి పిలుపిచ్చామని కూడా ఆ ప్రతినిధి సెలవిచ్చారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో అది పూర్తి బాధ్యతారహితమైన చర్య.
ఉపఖండం ఏ స్థాయిలోనూ అణు దుస్సాహసిక చర్యలను భరించలేదు. ఎందుకంటే అణుదాడులు మొదలుకావడమంటేనే ఇరుదేశాల సరిహద్దుల్లోమాత్రమే కాకుండా స్వదేశంలోనూ, అనేక ఇతర దేశాల్లోనూ దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఏర్పడిన తీవ్ర ప్రతిష్టంభనను మరింత ముందుకు తీసుకుపోవడానికి బదులుగా పాకిస్తాన్ తప్పకుండా కాస్త వెనుకడుగు వేసి ముందుగా తన ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ముష్కర సంస్థలపై నిర్ణయాత్మక చర్యలను ఇప్పటికైనా చేపట్టకపోతే పాకిస్తాన్ సార్వభౌమాధికారం మళ్లీ మళ్లీ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తుల నుంచే కాదు.. దేశ న్యాయ చట్టాలను బహిరంగంగా ఉల్లం ఘిస్తున్న అంతర్గత ఉగ్రవాదుల వల్ల కూడా పాక్ పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వ్యాసకర్త : తాహా సిద్దిఖి ,పాక్‌కి చెందిన ప్రవాస జర్నలిస్ట్
ఇంటిగుట్టు పాక్‌కు చేటు
Published Fri, Mar 1 2019 12:34 AM | Last Updated on Fri, Mar 1 2019 4:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment