శల్యసారథ్యం రాష్ట్రానికి శాపం | Ummareddy Venkateswarlu Write About TDP ministers resign | Sakshi
Sakshi News home page

శల్యసారథ్యం రాష్ట్రానికి శాపం

Published Thu, Mar 22 2018 8:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Ummareddy Venkateswarlu Write About TDP ministers resign - Sakshi

టీడీపీ మంత్రుల రాజీనామాలను, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొన్న నిర్ణయంగా కాక.. 2019 ఎన్నికల వ్యూహంలో భాగమేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం టీడీపీకి ఊహించని దెబ్బ. నాలుగేళ్లుగా ఏ దశలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం.. చివరకు అనివార్యంగా మంత్రులతో రాజీనామా చేయించడం తెలుగుదేశం బలహీనత, తప్పిదంగానే యావత్‌ దేశం పరిగణిస్తోంది. 

విసిరిన పాచికలు అన్నిసార్లూ అనుకొన్నట్టు పారవు ఎవరికైనా! ప్రతి అడుగును రాజకీయంగా ఆచితూచి వేసే ఏపీ సీఎం చంద్రబాబు అందుకు మినహాయింపు కాదు. కేంద్రంలో తమ ఇద్దరు మంత్రులు అశోక గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించగానే.. రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా మారతాయని ఊహించిన టీడీపీకి జరుగుతున్న పరిణామాలు, వస్తున్న విమర్శలు మింగుడుపడటం లేదు. అయితే, మంత్రులతో రాజీనామా చేయించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని ప్రధాని మోదీ గానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా గానీ సీరియన్‌గా తీసుకోలేదు. తెలుగుదేశం తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తేలిగ్గా తిప్పికొట్టవచ్చునన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కనిపిస్తున్నది. బాబు ప్రభుత్వం చేసిన తప్పుల చిట్టా కేంద్రం వద్ద ఉండి ఉండొచ్చు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న బీజేపీ.. ఏపీలో కూడా తెలుగుదేశాన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు కన్పిస్తోంది. టీడీపీ మంత్రుల రాజీనామాల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొన్న నిర్ణయంగా కాక.. 2019 ఎన్నికల వ్యూహంలో భాగమేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ. నాలుగేళ్లుగా ఏ దశలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం.. చివరకు అనివార్యంగా మంత్రులతో రాజీనామా చేయించడం టీడీపీ బలహీనత, తప్పిదంగానే యావత్‌ దేశం పరిగణిస్తోంది.

ప్రజల ఆకాంక్షల్ని నాలుగేళ్లుగా గుర్తించలేదా?  
ప్రజల ఆకాంక్షల మేరకు మోదీ మంత్రి వర్గం నుండి తమ ఇరువురు నేతలు తప్పుకొన్నారని, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించే ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలుగుదేశం నేతలు ప్రచారం చేస్తున్నారు. తద్వారా తప్పంతా బీజేపీ మీదకు నెట్టి... కడిగిన ముత్యంలా బయటపడటం టీడీపీ వ్యూహం! కానీ.. ఏం చెప్పినా నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు కదా? గత 4 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీ పరిపాలిస్తోందా? నిర్ణయాలు తీసుకొంటున్నదా? ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా’ అన్నది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదిగా ప్రజలందరూ పరిగణిస్తే.. తెలుగుదేశం దానిని రాజకీయాంశంగానే పరిగణించిందని ప్రజా బాహుళ్యానికి పూర్తి అవగాహన ఉన్నది కదా! రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదట్నుంచీ నిరసిస్తూనే ఉంది. వైఎస్సార్‌సీపీ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా చేసినప్పుడు, రాష్ట్ర బంద్‌ చేసినపుడు.. గుంటూరులో అమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, ప్రతి జిల్లాలో యువగర్జన సదస్సులు జరిపినప్పుడు, పాదయాత్రలో పదేపదే ప్రత్యేకహోదా విషయం ప్రస్తావిస్తున్నప్పుడు... ఇంకా అనేక సందర్భాలలో ఈ అంశంపై పలు రకాలుగా ఉద్యమాలు చేసిన సందర్భాలలో అధికారంలో ఉన్న టీడీపీ ఎదురుదాడికి దిగింది. అక్రమ కేసులు బనాయించింది. ఏ రాజకీయ పార్టీకీ చెందని విద్యార్థులు ఆందోళనకు దిగితే.. వారిపై పి.డి. యాక్ట్‌ కింద కేసులు పెడతామని, జైళ్లకు పంపిస్తామని, భవిష్యత్తు నాశనం అవుతుందని బెదిరించింది టి.డి.పి. ప్రభుత్వం. విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించింది. 

రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ అడ్డగోలుగా విభజించిందన్న వాదనను ప్రజ ల్లోకి బీజేపీ, టీడీపీలు బలంగా తీసుకువెళ్లడం, ఆనాడు దేశవ్యాప్తంగా మోదీకి లభించిన ఆదరణ తదితర అంశాలు తోడు కాగా స్వల్ప ఓట్ల తేడాతోనే చంద్రబాబు ఏపీకి సీఎం కాగలిగారు. అయితే, విభజన కారణంగా రాష్ట్రానికి సంక్రమించిన కష్టాలను పరిష్కరించవలసిన ప్రభుత్వం.. దానికి బదులుగా కొత్త కష్టాలను ప్రజలపై మోపింది. రుణమాఫీ హామీ ఇచ్చి.. దానిని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రైతాంగం అప్పుల్లో కూరుకు పోయింది. డ్వాక్రా రుణాలమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అమలు వంటి ప్రధాన ఎన్నికల హామీల్ని నెరవేర్చలేదు. దశల వారీ మద్యపాన నిషేధం కాస్తా.. దశదిశల మద్యపానంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. హక్కుగా లభించవలసిన విభజన చట్టంలోని ప్రధాన హామీల్ని కేంద్రం నుంచి సాధించుకోవడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేక పోయింది.

చివరి వరకు ప్యాకేజీనే ముద్దు అన్నారు
రెవెన్యూలోటును రాష్ట్ర ప్రభుత్వం రూ.16,078 కోట్లుగా చూపితే, కేంద్రం ఇచ్చింది రూ.4,117 కోట్లు మాత్రమే! రాష్ట్ర ప్రభుత్వం చూపిన రెవెన్యూలోటు లెక్కల్లో తేడాలున్నాయని కేంద్రం ఎన్నోసార్లు స్పష్టం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యులైన ఆర్ధికశాఖమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి ఆ లెక్కల్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు. రాజధాని నిర్మాణానికి తొలుత 5 లక్షల కోట్ల రూపాయిలు  కావాలని అడిగి, రూ.43,000 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, అందులో కేంద్రం ఇచ్చింది. రూ.2,500 కోట్లు. కడప స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణం మొదలైన ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలను.. కేంద్రాన్ని ఒప్పించి పరిష్కరించుకునే చొరవ సీఎంగానీ, టీడీపీ ఎంపీలుగానీ చేయలేదు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, జిల్లాలకు కోరాపుట్, బుందేల్‌ ఖండ్‌ ప్యాకేజీ వంటిది అందిస్తామని విభజనచట్టంలో ఉండగా, ఆ పద్దు కింద 4 ఏళ్లలో జిల్లాకు రూ.5 కోట్లు చొప్పున 7 జిల్లాలకు కేవలం రూ.105 కోట్లుతో కేంద్రం సరిపుచ్చగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు సరికదా.. ఆ నిధుల్ని కూడా పూర్తిగా ఆయా జిల్లాలకు ఖర్చు చేయకుండా దారి మళ్లించింది. ఇక కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడులు అర్ధరాత్రి విలేకర్ల సమావేశం పెట్టి..విభజన చట్టంలోని హామీల్నీ చదివేసి వాటిని రీప్యాకేజీ చేస్తే.. అందులో ఏమున్నదో కూడా చూడకుండానే సీఎం బాబు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్యని ఓపెన్‌ జీపులో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఓపెన్‌టాప్‌ జీపులో ఎక్కించుకొని విజయవాడ నగరంలో తిప్పారు.

ప్రత్యేకహోదా నిరాకరించడానికి కేంద్రం సాకులు చూపుతున్నా, ప్రత్యేకహోదా లభించకుంటే ఎన్నికల్లో తాను చేసిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలిసినా.. చంద్రబాబు మహా మౌనిలా వ్యవహరించారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా లభిస్తే చేకూరే ప్రయోజనాలకు, ప్రత్యేక ప్యాకేజీ వల్ల పరిమితంగా కలిగే చిరు లాభానికి తేడా తెలియదని అనుకోవాలా? రాష్ట్రానికి నష్టం జరిగిందని, దానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమంటూ పదేపదే జరిగిపోయిన వాటిపై ఆక్రోశించిన చంద్రబాబు.. పార్లమెంట్‌ ఆమోదించిన పునర్‌విభజన బిల్లులో పేర్కొన్న అంశాలు, బీజేపీ నేతలు ఇచ్చిన హామీల అమలుపై కంటితుడుపుగా విజ్ఞాపన ప్రత్రాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఏనాడూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదు. కేవలం కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడినట్లుగా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తే.. కేసులు బనాయించారు, హేళన చేశారు. ప్రత్యేకహోదా వల్ల ఫలితంలేదని, అది సంజీవని కాదని, ప్యాకేజీయే మేలని.. ఇలా రకరకాల వాదనల్ని విన్పించారు. కేంద్రం 2017–18 బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత.. రాష్ట్రానికి అన్నీ వచ్చేశాయని సి.ఎం. చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ఇంతకుమించి అడగలేం’’ అని కూడా తేల్చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా మీడియా సమావేశంలో ‘‘అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించాం.. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి’’ అని సాధికారంగా చెప్పారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిగా సిద్ధార్ధనాథ్‌ సింగ్‌ చంద్రబాబు తమను ఏనాడు ప్రత్యేకహోదా కావాలని అడగనేలేదని, ప్రత్యేక ప్యాకేజికే మొగ్గుచూపారని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించవలసిన వారే శల్య సార«థ్యం వహించారు. 

పోరాడింది వైఎస్సార్‌సీపీ, వామపక్షాలే
ప్రత్యేకహోదా అంశాన్ని మరుగుపర్చడానికి అధికార తెలుగుదేశం ఎంతగా ప్రయత్నించినా.. ఎప్పటికప్పుడు నిర్విరామంగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ దానిని ఓ ఆశాదీపంగా నిలిపింది వైఎస్సార్‌ సీపీయే! వైసీపీ అధ్యక్షులు వై.యస్‌.జగన్‌ ‘‘ప్రత్యేకహోదా’’ కల్పించాలంటూ ఢిల్లీలో ధర్నాచేశారు. అసెంబ్లీలో సమర్ధవంతంగా తన వాదనల్ని విన్పించారు. ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పారు. కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఉద్యమాలు చేశాయి. అయితే, కేంద్రంలో ఐదవ బడ్జెట్‌ ప్రతిపాదించిన తర్వాత.. పార్లమెంట్‌ వెలుపల, లోపల తెలుగుదేశం పార్లమెంట్‌ సభ్యులు మొక్కుబడిగా సాగించిన నిరసనను సీఎం చంద్రబాబు ‘పోరాటం’గా అభివర్ణిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన పార్లమెంట్‌ సమావేశాలకు ఇచ్చిన విరామంలో.. టీడీపీ ఏ ఒక్క కార్యక్రమమైనా చేయగలిగిందా? ఫిబ్రవరి 8న వామపక్షాలు ప్రతిపాదించగా వైఎస్సార్‌ సీపీ సంపూర్ణ మద్ధతు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ను విఫలం చేయాలని శతవిధాలా ప్రయత్నించింది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు విధిలేక బంద్‌లో తామూ పాల్గొన్నట్లు ప్రచారం చేసుకున్నారు.

 ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటానికి మోదీకి సాగిలపడిపోయిన ఫలితంగానే.. టీడీపీ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతిష్ట పోగొట్టుకొందని ప్రజాబాహుళ్యం చెవులు కొరుక్కోవడం, చర్చించుకోవటం, నిరసనలు తెలపడం ప్రభుత్వానికి వినపడటం లేదా, లేక కనపడటం లేదా! కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన ప్రత్యేకహోదా రాకుండా ఎవరు అడ్డుపడ్డారు? విభజన బిల్లు అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు, ప్రతిపక్ష నేతగా వెంకయ్య ప్రత్యేకహోదా కోసం గర్జించిన విధానం, తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగిన ఎన్నికల సభలో ఆనాడు మోదీ, వెంకయ్య, బాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతను గురించి చేసిన భీకర ప్రసంగాలు ఏమైపోయాయి? పాలకులు మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోలేదు. టీడీపీ దోబూచులాటలను ఇకనైనా కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సమాయత్తం కావటం విజ్ఞత అనిపించుకొంటుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు 184వ నిబంధన క్రింద పార్లమెంటుకు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో భాగస్వాములు కావడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల పట్ల టీడీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన పరీక్షా సమయమని గుర్తిం చుకోవాలి. వైఎస్సార్‌ సీపీ తీర్మానానికి పోటీగా అవిశ్వాస తీర్మానం చేసిన టీడీపీ కనీసం దాన్నయినా నిజాయితీగా ముందుకు తీసుకుపోతుందా అనేది సందేహాస్పదమే.  రాష్ట్రానికి ప్రస్తుత తరుణంలో కావాల్సింది శల్య సార«థ్యం కాదు... చిత్తశుద్ధితో కూడిన సారథ్యం.


వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మొబైల్‌ : 99890 24579

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement