
ఢిల్లీ ప్రభుత్వంపై పన్నెండో పానిపట్టు యుద్ధం చేయాలన్న లక్ష్యంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతిభవన్‌లో కూర్చొని కత్తులు నూరారనీ, ఆ నూరుతున్న చప్పుడు తమ విలేకరి చెవిన పడిందని ఒక ఎల్లో గ్రూప్ పత్రిక ఇటీవల ఒక వార్తా కథనాన్ని రచించి ప్రచురించింది. యథాతథంగా పై వాక్యాలనే వాడనప్ప టికీ, ఆ రచనలో దాగివున్న కవి హృదయం మాత్రం అదే. గడిచిన సోమవారం నాడు ఇద్దరు ముఖ్యమంత్రుల నడుమ సుమారు మూడు గంటల పాటు హైదరాబాద్‌లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం ఎజెండా ఏమిటో ముందురోజే అన్ని పత్రికల్లో వచ్చింది.
నీటి లభ్యత ఎక్కువగా వుండి ప్రతి యేటా వృథాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించి ఉభయ తారకంగా వుండేలా ఉపయోగించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌లు కొంతకాలం కిందట ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, అగ్రనేతల స్థాయిలో చర్చలు జరిగాయి. కనిష్ట వ్యయంతో గరిష్ట ప్రయోజనం పొందడా నికి వీలైన పథకాన్ని రూపొందించడానికి మరికొన్ని మేధోమథనాలు కూడా అవసరం కావచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వున్న ప్రాజెక్టుల గరిష్ట వినియోగ పరిమితి మేరకు అవసరమైన నీటి లభ్యత రెండు ప్రధాన నదుల్లో అందుబాటులో వున్నదనేది నిపుణుల అభిప్రాయం.
కావలసిందల్లా కొంచెం వివేకం... ఇరుగుపొరుగుతో ఇచ్చి పుచ్చుకొనే లక్షణం... ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి గౌరవించడం. గిల్లికజ్జాలు పెట్టు కోవడం వల్ల మరింత నష్టపోవడం తప్ప, ప్రయోజన మేదీ వుండదని గత అనుభవాలు మనకు చెబుతు న్నాయి. తెలంగాణ (అప్పటి ఆంధ్రప్రదేశ్)లో వున్న శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ చేరువలో బాబ్లీ వద్ద మహారాష్ట్ర ఒక బరాజ్ నిర్మించి కొంతనీటిని మళ్లించడం మొదలు పెట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నిర్మాణం జరిగింది. సాగునీటి రంగంలో తన ప్రభుత్వ వైఫల్యాన్ని చంద్రబాబు బాబ్లీ మీదకు, కర్ణాటకలోని ఆల్మట్టి మీదకు నెట్టివేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యకర్తలను తీసుకొని మహారాష్ట్ర మీద యుద్ధానికి బాబ్లీ బయల్దేరాడు. ఫలితంగా, రెండు రాష్ట్రాల మధ్య సమస్య జటిలమయింది.
రాష్ట్రం విడిపోయి తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించగలిగారు. సంక్షోభం ఎదురైనప్పుడు పిరికివాడెప్పుడూ నెపాన్ని ఇతరులపైకి నెట్టి తప్పించుకోజూస్తాడు. సాహసికుడు కొత్తదారులను వెతుక్కుంటాడు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు సాహసోపేత నిర్ణయాలకు వెనుదీ యని తత్వం కలిగినవారు. విశాల జనబాహుళ్య ప్రయో జనాలకోసం సంకుచిత రాజకీయాలకు అతీతంగా రాజనీతిజ్ఞతతో వ్యవహరించగల వివేకం కలిగినవారని ఇప్పటికే రుజువైంది.
అందువల్ల తెలుగు నేలను సస్యశ్యామలం చేయడానికి ఇదే సరైన అదును. ఆ సంగతి చంద్రబాబుకూ, ఆయనను నడిపించే ఎల్లో సిండికేట్‌కు కూడా తెలుసు. ఈ సిండికేట్‌లోని ప్రధాన విభాగమైన ఎల్లో మీడియా భుజ స్కందాలమీద రెండు తక్షణ కర్తవ్యాలున్నాయి. ఒకటి... ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ సర్కార్‌ను గద్దె దించుతానని అన్ని రాష్ట్రాలూ తిరిగి పులివేషం వేసి వచి్చన తమ నాయకుడిని మళ్లీ క్షేమంగా బీజేపీ పెద్దల చరణకమలాల చెంతకు చేర్చడం. రెండవది.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో పనిచేసి తెలుగు భూభాగాలను మాగాణాలుగా మార్చివేస్తే, ఆ ఘనత వారికి దక్కకుండా చూడటం. మొదటి లక్ష్యసాధనలో భాగంగా చేసిన రచనే పైన పేర్కొన్న వార్తా కథనం.
ఇద్దరు ముఖ్యమంత్రులూ కేంద్రంపై గుర్రుగా వున్నారనీ, ఇద్దరూ కలిసి ఏదో గూడుపుఠాణీ చేస్తున్నారని ఓ వార్త రాస్తే, బీజేపీలో మారువేషాల్లో వున్న తమ వేగులవారు దానిని ఢిల్లీ కమలనాథులకు చేరవేస్తారనీ, దీనితో సదరు కమలనాథులు ఈ ముఖ్యమంత్రులను తమకు వ్యతిరేకులుగా పరిగణించి, వారి ప్రత్యర్థి అయిన తమ నేతను క్షమించి చేరదీస్తారని ఒక రకమైన బుద్ధి జాఢ్యజనితోహతో అల్లినట్టు కనిపిస్తున్నది. ఈ కథనం రాసిన నాలుగు రోజుల తర్వాత అదే పత్రిక రెండో లక్ష్యసాధనలో భాగంగా మరో కథనాన్ని వదిలింది. కావేరీ దారిలో గోదావరి పేరుతో కేంద్ర ప్రభుత్వమే గోదావరి జలాలను కృష్ణామీదుగా కావేరీ దాకా తరలించే సన్నాహాలను శరవేగంగా చేస్తున్నదనీ, పనులు జోరందుకున్నాయనీ, నేడో రేపో గోదావరి జలాలు కృష్ణాతో కరచాలనం చేసి, పెన్నాను ముద్దాడి, కావేరితో కలిసిపోతాయని ఆ కథనం సారాంశం.
అచ్చంగా ఇవే వివరాలతో గత మార్చి 5వ తేదీనాడు ఇదే కథనం కొన్ని పత్రికల్లో వచి్చంది. వాస్తవం ఏమిటంటే నదుల అనుసంధానం అనే ఆలోచనను ఇక్ష్వాకుల కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం చేస్తూనే వస్తున్నది. ఈ ఆలోచన చర్చలకే పరిమితమవుతున్నది తప్ప ‘ఊదు కాలదు, పీర్ లేవదు’ అన్న చందంగా కార్యరూపానికి మాత్రం నోచుకోవడం లేదు. అప్పుడప్పుడూ జాతీయ జల అభివృద్ధి సంస్థ రాష్ట్రాలతో సమావేశాలను ఏర్పాటుచేసి రకరకాల ప్రత్యామ్నాయాలపై చర్చలు జరపడం పరిపాటి. అటువంటి ఒక సమావేశం ఆగస్టు 21న జరిగింది. అప్పుడు కేంద్రం తెలంగాణ ముందు వుంచిన ప్రతిపాదనను ఆ రాష్ట్రం తిరస్కరించినట్టు తెలిసింది. రెండు రాష్ట్రాలు గరిష్ఠ ప్రయోజనం పొందేవిధంగా చర్చించుకొని తామే ఒక పథకాన్ని రూపొందించుకుంటామని ఈ రాష్ట్రాలు ఇదివరకే కేంద్రానికి నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇరువురికీ అంగీకారమైన ఒక నిర్ణయానికి వచి్చన తర్వాత అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాబట్టి ఉమ్మడిగా కేంద్ర సాయాన్ని కోరే అవకాశముంటుంది.
గోదావరి నది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన తెలుగు నేలను తాకిన దగ్గర నుంచి సముద్రంలో కలిసేవరకు లభించే నీటి పరిమాణాన్ని గడిచిన పదేళ్ల సరా సరి తీసుకుంటే సుమారు 3100 టీఎమ్‌సీలు. బాగా వరదలొచి్చన ఈ సంవత్సరమైతే దాదాపు అంతే పరిమాణంలో నదీజలాలు కడలిపాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వరకూ, ఆ తర్వాత కలిసే కడెం వంటి వాగుల ప్రవాహాన్ని తీసివేస్తే, వార్ధా–పెన్ గంగ–వైన గంగలతో కూడిన ప్రాణహిత ద్వారానే సుమారు వెయ్యి టీఎమ్‌సీలకు సమానమైన జలప్రవాహం చేరుతుందని ఒక అంచనా వుంది. ఈ సంగమం దిగువనే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రధాన బరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం నిరి్మంచింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వున్న రిజర్వాయర్ల సామర్ధ్యం 141 టీఎ మ్‌సీలు. వీటికి అదనంగా మంజీరా జలాశయాలైన సింగూరు, నిజాంసాగర్‌లను సైతం, ఆ నదీ ప్రవాహం లేనప్పుడు ఈ నీటితో నింపే వెసులుబాటు వుంటుంది. అలాగే శ్రీశైలంపై ఒత్తిడి తగ్గించడం కోసం పాలమూరు –రంగారెడ్డిలో భాగంగా వున్న నల్లగొండ జిల్లాలోని డిండి రిజర్వాయర్‌ను కూడా నింపగల సామర్ధ్యం కాళేశ్వరం ప్రాజెక్టుకు వుంది. మేడిగడ్డకు దిగువన ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి గోదావరిలో కలుస్తున్నది. సుమారు 700 టీఎమ్‌సీల జలసంపదను సృష్టించే వరద ప్రవాహాన్ని ఈ నది ఏటా మోసుకొస్తున్నది.
దానికి దిగువన అనువైన ప్రదేశం నుంచి నీళ్లను ఎత్తిపోసి కెనాల్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించవచ్చన్న ప్రతిపాదన రెండు రాష్ట్రాల మధ్య పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. దీనివల్ల కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు కాకతీయ స్టేజ్–2, ఎస్‌ఎల్‌బీసీ ఆయకట్టును కూడా స్థిరీకరించవచ్చు. తెలంగాణలోని సాగర్ ఎడమగట్టు ఆయకట్టుకు, ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు ఆయకట్టుకు నీటి విడుదలకు భరోసా ఏర్పడుతుంది. కృష్ణానదిపై సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలంపై ఆధారపడి తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజె క్టులున్నాయి. కల్వకుర్తికి 40 టీఎమ్‌సీలు అవసరం. ఎస్‌ఎల్‌బీసీ ఆయకట్టును ప్రతిపాదిత లింక్ కెనాల్‌తో స్థిరీకరించి, డిండి రిజర్వాయర్‌ను కాళేశ్వరంలో భాగం చేస్తే మరో వంద టీఎమ్‌సీలు పాలమూరు–రంగారెడ్డికి అవసరమవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంపైన ఆధారపడిన ప్రవాహాలు ప్రధానంగా నాలుగు తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి వరద కాల్వ, హంద్రీ–నీవా సుజల స్రవంతి. ఈ ప్రవాహాల మీద వున్న అనేక చిన్న, మధ్య శ్రేణి రిజర్వాయర్లు నింపడానికీ, చెన్నయ్ తాగునీటికీ దాదాపుగా 350 టీఎమ్‌సీలు అవసరం కావచ్చు. గడిచిన పదేళ్లలో శ్రీశైలం రిజర్వాయర్‌కు ఏటా సగటున 600 టీఎంసీల నీరు చేరుకుంది. గోదావరి నుంచి ప్రతిపాదిత కెనాల్ ద్వారా కృష్ణా బేసిన్‌కు నీరు తరలించినందుకు ఎగువ రాష్ట్రాలు కృష్ణా జలాల్లో కొంతమేర మినహాయించుకుంటే, ఆమేరకు సాగర్ నుంచి శ్రీశైలానికి సర్దుబాటు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్–దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై శ్రీశైలం మల్లన్న చల్లని చూపు ఎల్లకాలం ప్రసరిస్తుంది.
ఉత్తరాంధ్రను, చిత్తూరు జిల్లాను మినహాయిస్తే, తెలుగు నేలంతా ప్రధానంగా మూడు నదీ బేసిన్‌లుగా విభజితమై ఉంది. సీతారాములకు వనవాస కాలంలో ఆశ్రయమిచి్చన ప్రాంతం గోదావరి బేసిన్. ఆసియా భూఖండం మొత్తానికి బౌద్ధ ధర్మాన్ని బోధించిన ప్రాంతం కృష్ణా బేసిన్. అన్నమయ్య గీతాలు, వేమన్న పద్యాలతో పల్లవించిన నేల పెన్నా బేసిన్. ఈ మూడు నదులకూ తెలుగు నేల మెట్టినిల్లు. తెలుగు ప్రజలకు అవి నదీమతల్లులు. ఆ ముగ్గురు అమ్మలను ఒకచోట కలిపితే, బమ్మెర పోతన కీర్తించిన ఆ ‘అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ...’ ఆ దుర్గమ్మ కూడా సంతసించి దీవిస్తుంది.
-వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment