
ప్రపంచంలో కొన్ని దేశాల్లో అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులుగా యువత ఎదుగుతుండగా భారత్‌లో వృద్ధ రాజకీయాలు బలంగా కొనసాగుతుండటం గమనార్హం. తరుణ భారత్‌కు తరుణ నేతలు ఎంతో అవసరం.
ఆస్ట్రియా నూతన చాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ వయస్సు కేవలం 31 సంవత్సరాలు. న్యూజి లాండ్ నూతన ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే. పైగా ఈమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా నేత. ఇక టోనీ బ్లెయిర్, డేవిడ్ కేమరూన్ 43 ఏళ్ల ప్రాయంలో బ్రిటన్ ప్రధానులయ్యారు. 39 ఏళ్ల ఎమాన్యువల్ మెక్రాన్ ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీ సగటు ఆయుర్దాయం కేవలం 43 సంవత్సరాలు మాత్రమే. రాజకీయ పార్టీల వయో దుర్బలత్వంతో ఓటర్లు విసిగిపోతుండటంతో అలాంటి పార్టీలన్నీ మనగలగడానికి కొత్త రక్తాన్ని తీసుకువచ్చి అధికారం కట్టబెడుతున్నారు.
కానీ భారత్‌ను చూస్తే సీనియారిటీపట్ల, అధికారపు దొంతరపట్ల విధేయతను కొనసాగిస్తూ రాజకీయ పార్టీలు గడ్డకట్టుకుపోయినట్లు కనపడుతోంది. 2014లో, మన ప్రస్తుత పార్లమెంటులో 30ఏళ్ల వయస్సులోపు ఉన్న ఎంపీలు 12 మంది మాత్రమే. ఇక 55 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఎంపీలు 53 శాతంమంది కాగా, ఎంపీల సగటు వయస్సు 50ఏళ్లకు పైబడి ఉంది. (బీజేపీ సగటు ఎంపీల వయస్సు 54 ఏళ్లుకాగా, కాంగ్రెస్ ఎంపీల వయస్సు 57 ఏళ్లు) జనాభాలో యువత శాతం పెరుగుతుండగా (మన యువత సగటు వయస్సు 25 ఏళ్లు), మన పార్లమెంటు సభ్యుల వయస్సు మాత్రం పెరుగుతోంది. తొలి లోక్‌సభ సగటు వయస్సు 46.5 ఏళ్లు కాగా, 10వ లోక్‌సభ నాటికి ఇది 51.4 ఏళ్లకు పెరిగింది. ఇక రిటైర్మెంటుకు దగ్గరపడిన రాజకీయ నేతలు వానప్రస్థ జీవితాన్ని జాప్యం చేస్తూ అధికారపు అంచులను పట్టుకుని వేలాడుతున్నారు. ఇతరులు తమ వారసులు ఎదిగి వచ్చేంతవరకు తమ పదవులను అంటిపెట్టుకుని ఉంటున్నారు. దీని ఫలితంగా భారత రాజకీయ పార్టీలలో చాలావరకు కుటుంబ వ్యాపారంలో ఉంటున్నాయి. రాజకీయ సాధికారత మన సమాజంలో పెద్దల ఇలాకాగా మారిపోయింది.
అయితే దీంట్లోనూ మినహాయింపులున్నాయి. పలు సందర్భాల్లో, ప్రధానంగా రాజకీయ వారసత్వం కారణంగా కొంతమంది యువనేతలను బాధ్యతాయుత స్థానాల్లోకి ప్రోత్సహిస్తున్నారు. కానీ వీరి సంఖ్య తక్కువే. భారత రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ పురాతన సంప్రదాయం కారణంగా నేను కూడా లబ్ధి పొందాను. అయితే రాజకీయ పార్టీలు భారతీయ యువతకు సభ్యత్వం ఇవ్వడం లేదని దీని అర్థం కాదు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు తమవైన యువజన, విద్యార్ధి సంఘాలు ఉంటున్నాయి. కానీ రాజకీయాల్లో వారి పెరుగుదల తగ్గుతున్నట్లు కనబడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు 75 ఏళ్లను రిటైర్మెంటుకు తగిన వయస్సుగా నిర్ధారించుకోవడం అభిలషణీయమే అయినా ఈ దిశగా చేయవలసింది చాలానే ఉంది. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ఇప్పుడు సంపద, వారసత్వం, పరిచయాలు వంటివాటిపై ఆధారపడి ఉంది. పోతే, యువతను, వ్యక్తులను సాధికారతవైపు తీసుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి.
సెర్బియా ఈ దిశగా 500 మంది యువ రాజకీయ నేతల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించడం కోసం యువ నేతలను గుర్తించి, ఎంపిక చేయడం ద్వారా యువత రాజకీయ భాగస్వామ్యం చేపట్టడాన్ని వేగవంతం చేస్తున్నారు. యంగ్ పొలిటికల్ లీడర్స్ ప్రోగ్రాం (యుఎన్‌డీపీ) 2.6 మిలియన్ డాలర్లతో ఒక జాతీయ యువ పౌర విద్యా కేంపెయిన్‌ను అమలు చేసింది. రాజకీయాల్లో యువ నేతల ఎంపిక దిశగా వారి వైఖరులలో మార్పు తీసుకురావడం, పౌరసమాజ విజ్ఞానాన్ని, కౌశలాలను పెంచడం దీని లక్ష్యం. కెన్యా అయితే 2001 నుంచి యువ రాజకీయ నాయకత్వ అకాడెమీని నిర్వహిస్తోంది. చర్చలు, సలహాలు వంటి అంశాలపై పార్టీలకు అతీ తంగా నిపుణతలను పొందడం, వాటిని తమ తమ పార్టీలలో అమలు చేయడానికి కృషి చేసేలా యువతను తీర్చిదిద్దుతున్నారు. యూనిసెఫ్ 2010, 2013 సంవత్సరాల మధ్యన కోసావోలో ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు నిధులు సమకూర్చింది. 2007–2009 మధ్య కాలంలో ఆసియన్ యంగ్ లీడర్స్ ప్రోగ్రాంకి యుఎన్‌డిపి ఆతిథ్యమిచ్చింది. జాతీయ, ప్రాంతీయ వర్క్‌షాపుల సమ్మిశ్రణ ద్వారా యువ ఆసియా నేతల్లో నాయకత్వ కుశలతలను పెంపొందించడం దీని లక్ష్యం.
ఇలాంటి కార్యక్రమాలతోపాటు వ్యవస్థాగత జోక్యం కూడా తగువిధంగా తోడ్పడుతుంది. ప్రస్తుతం అనేక దేశాలు (మొరాకో, పాకిస్తాన్, కెన్యా, ఈక్విడార్ వగైరా) తమ చట్టసభల్లో యువనేతలకు నిర్దిష్టంగా చోటు కల్పిస్తున్నాయి. జాతి, కుల ప్రాతిపదిక బృందాలకు రిజర్వేషన్లు అందిస్తుండగా యువతకు వాటిని ఎందుకు కల్పించకూడదు? ఉదాహరణకు ఈక్వడార్, ఎల్‌సాల్వడార్, సెనెగల్, ఉగాండా, బురుండి వంటి ఇతర దేశాలు కూడా అన్ని చట్టసభల ఎన్నికలకు కనీస వయో పరిమితిని 18 ఏళ్లకు కుదించాయి. బోస్నియాలో ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఆధిక్యత రాకపోతే అలాంటి స్థానాలను పోటీచేసిన వారిలో పిన్న వయస్కులకు కేటాయించాలని ఎన్నికల చట్టంలోని అధికరణం 13.7 ద్వారా నిర్దేశించింది. 18 ఏళ్ల వయసుకొస్తున్న యువత బాధ్యతలు నిర్వహించేలా ప్రోత్సహించడానికి ఎల్‌సాల్వెడార్ తన పాఠశాలల్లో కేంపెయిన్లు నిర్వహిస్తోంది. ఇక కెన్యా 2006లో జాతీయ వయోజన విధానాన్ని, 2009లో జాతీయ యువజన చట్టాన్ని ప్రకటించింది. ఈ రెండూ ఎన్నికల్లో మరింతగా పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తున్నాయి.
వీటికి అదనంగా మన రాజకీయ వ్యవస్థ యువత రాజకీయ సాధికారతకు అనేక అవకాశాలను ప్రతిపాదించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో అనుభవం కలిగిన వారు నేతలుగా ఎదగడానికి వారికి మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలి. ఇలాంటి నేతలు కాస్త అనుభవం పొందాక రాష్ట్రస్థాయిలో, కేంద్ర స్థాయి చట్టసభల్లో స్థానాలకు కూడా పోటీ పడగలరు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వ్యవస్థల్లో నాయకులు ఇలాగే ఎదుగుతున్నారు. కానీ అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యం క్షీణించడం, మునిసిపల్, పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్‌ను వంతుల ప్రకారం మార్చడం, ఎన్నికల ఖర్చు పెరగడం వంటివి యువనేతల ఆశలకు అవరోధాలను కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ వంతుగా రాజకీయ నేపథ్యంలేని యువతకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వృత్తి నిపుణులను రప్పించడానికి చొరవ తీసుకోవాలి. తరుణ భారత్ ఏం కోరుకుం టోంది, తమ ఆశలు, ఆకాంక్షలు ఏమిటి అనే అంశంపై యువ రాజకీయ నేతలకు అవగాహన ఉంటుంది. ఇలాంటి నేతలకు ప్రతిభ ఆధారంగా ఎదిగించే విషయంలో రాజకీయ పార్టీలు తగు చోటు కల్పించాలి.
- వరుణ్ గాంధీ
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, fvg001@gmail.com
Comments
Please login to add a commentAdd a comment