
ఇంగ్లిష్ భాషను నేర్చుకోవటం అంటే, తెలుగు భాషను వదిలేయమని అర్థం కాదు. ఇంగ్లిష్‌లో మాట్లాడటం అంటే, తెలుగులో మాట్లాడొద్దు అని ఆదేశించటమూ కాదు. తెలుగు కావాల్సిందే. కానీ ఇంగ్లిష్ కూడా తప్పనిసరిగా కావాలి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధన అత్యంత అవసరం. సమాజం ఆధునికత వైపు పరిగెడుతున్నప్పుడు, సరళీకరణ విధానాలు చేతివేళ్ళ సందుల్లోకి వచ్చి చేరుతున్నప్పుడు, స్వదేశంలోకి విదేశీ భాషలు వస్తున్నప్పుడు, ఇంగ్లిష్ భాషలో విశ్వవ్యాపిత గుర్తింపు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పుడు మాతృభాషకు భంగం కలుగకుండానే ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడంలో తప్పేంటి. మాతృభాషా ప్రేమికులు, తెలుగు భాషాభిమానులు, శత సహస్రావధానులు, తెలుగు పీఠాధిపతులు ఇంగ్లిష్ విద్య పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయటం సహజమే.
కానీ వారి పిల్లలు ఏ భాషలో చదువుతున్నారో తెలియపర్చాలి. ఇంగ్లిష్ భాషను వంట పట్టించుకోకుండా రాణిస్తున్నారో లేదో తెలియజేయాలి. అన్ని రంగాలలోవలే ప్రభుత్వ సెక్టారు తగ్గి, ప్రయివేట్ సెక్టారు వృద్ధి చెందుతున్న యుగం ఇది. అరచేతిలో ఆధునికతను గట్టిగా పట్టుకొని బతికేస్తున్న కాలం యిది. ఒకరి ఇష్టాయిష్టాలతో పనిలేకుండానే వ్యవస్థలన్నీ ఇంటి గుమ్మాల్లోకి వచ్చేశాయి. పగలు రేయి తేడా లేకుండా ఆధునిక వ్యవస్థల్లో సమస్త జనులు బతకక తప్పటం లేదు. ఆ వ్యవస్థలను అధ్యయనం చేయకుండా, అలాంటి వ్యవస్థలతో పోటీ పడకుండా విద్యావ్యవస్థల మనుగడ సాధ్యమా అలాంటి పోటీ తత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆంగ్లమాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనాలు లేవా?
సర్కారు బడులంటే బడుగుల బడులు అని అర్థం. ప్రయివేట్ స్కూళ్ళు అంటే బడుగులు కానివారి, పై వర్గాలకు చెందినవారి పాఠశాలలు అని అర్థం. ఇప్పటి వరకూ సర్కారీ బడుల్లో తెలుగు భాషే ప్రామాణికం. ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమమే ప్రామాణికం. అంటే బడుగులు కాని పైవర్గాలకు చెందినవారి బిడ్డలు ఇంగ్లిష్‌లో విద్యాభ్యాసం చేస్తుంటే, బడుగుల పిల్లలు మాత్రమే తెలుగు భాషలో విద్యనభ్యసిస్తున్నారన్న విషయం కాదనని వారు లేరు. అయితే, సమాజంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు, గుర్తింపు ఏ భాషలో ఉన్నాయి స్వదేశీ ప్రమాణాలు, విదేశీ ప్రయాణాలు, స్వదేశీ విదేశీ కొలువులు ఏ భాషా ప్రాతిపదికన మెండైన అవకాశాలు దొరుకుతున్నాయి.
తెలుగు ఒక్కటే నేర్చుకోవటం వల్ల దేశ, విదేశాలలో అవకాశాలు నేటి తరానికి వస్తాయా పోనీ, తెలుగు భాషాసంయుక్త రాష్ట్రాలలో ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే నడుస్తుందా ప్రభుత్వాలు యిచ్చే జీవోలు, సర్కులర్లు, ఆదేశాలు తెలుగులోనే ఇస్తున్నారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు, కోర్టు తీర్పులు, వాదోపవాదాలు తెలుగు మాధ్యమంలోనే జరుగుతున్నాయా, తెలుగు భాషలోకి మనకి తెలియకుండానే ఇంగ్లిష్ భాష పరకాయ ప్రవేశం చేయలేదా అచ్చమైన తెలుగు పదాలకు స్వస్తి చెప్పి ఇంగ్లిష్ మాటలను మనం మాట్లాడటం లేదా ప్రతి గ్రామంలోనూ, మండల కేంద్రాలలోనూ ప్రభుత్వ పాఠశాలలు ఒకటో లేదా రెండో ఉంటే, ఇంగ్లిష్ స్కూళ్లు, కాన్వెంట్లు పదుల సంఖ్యలో ఉంటున్న మాట నిజం కాదా ఏమాత్రం ఆర్థిక పరిస్థితి సహకరించిన క్రింది కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సైతం ఇంగ్లిష్ మీడియం వైపు వెళ్ళటం లేదా, ఇంగ్లిష్ పాఠశాలల్లో చేరటం లేదా అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ భాషను ప్రవేశపెడితే వచ్చే ఇబ్బందులు ఏమిటి, ప్రయోజనం ఎవరికి, ప్రమాదం ఎవరికి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, ఇంగ్లిష్ మాధ్యమ బోధనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
దీనిని డిమాండ్ చేయటంలో ఏ తప్పు లేదు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడమే తప్పుగా, దీనివల్ల తెలుగు భాషకు ప్రమాదం వాటిల్లుతుందని వ్యాఖ్యానాలు చేయటం, అధైర్యపడటం అర్థరహితం. తెలుగు భాషా బోధన గూర్చి బలంగా మాట్లాడుతున్న తెలుగు భాషా ప్రేమికులు ముందుగా సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమం వద్దు అని ప్రశ్నించే ముందు, అత్యధికంగా ఉన్న ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను నిలిపివేయాలని డిమాండ్ చేయవచ్చు కదా లేదా ఉద్యమించవచ్చు కదా లేదా ప్రభుత్వానికి వినతులు సమర్పించవచ్చు కదా పై వర్గాలవారి పిల్లలకు నిలయంగా ఉన్న ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను ప్రశ్నించకుండా, ప్రభుత్వ పాఠశాలల్లోని బడు గుల పిల్లలకు ఇంగ్లిష్ బోధనను ప్రశ్నించటం వెనుక మతలబు ఏమిటి? ఇది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్దం కాదా! నిజానికి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ బోధనకు ప్రాధా న్యత ఇవ్వాల్సిన అవసరం ఎప్పుడో జరగాల్సి ఉంది. అలా జరిగి ఉండి ఉంటే, ప్రభుత్వ పాఠశాలలు సైతం ఇప్పటికే ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి ఉండేవి. అలా జరగనందునే ఇంగ్లిష్ భాషపై కొంతమందికే ‘పేటెంట్ రైట్స్’ వచ్చాయి.
ఇప్పటికైనా ఏపీలో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనకు జీవో తీసుకు రావటం అభినందనీయం. రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు ‘తెలుగు ఉద్దారకులు’గా ముందుకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన ప్రవేశపెట్టడాన్ని మతమార్పిడులతోను, క్రిష్టియన్ మతవ్యాప్తితోను ముడిపెట్టి ప్రభుత్వంపై నిందలు వేయటం ఏమాత్రం సరియై నది కాదు. అలాంటప్పుడు ప్రయివేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన క్రిష్టియన్ మతవ్యాప్తికి దోహదపడుతుందని ఒప్పుకోవాలి కూడా. ఈ చర్య వల్ల నష్టమేదైనా జరిగితే ఇంగ్లిష్ పాఠశాలలకే. ప్రయివేట్ పాఠశాలల్తో పోటీతత్వం పెరిగి ప్రభుత్వ పాఠశాలలు కూడా వృద్ధి చెందుతాయి.
విద్యార్థులు రాక పాఠశాలలు మూతపడే దయనీయ దుస్థితి తొలగిపోతుంది. ఏదైనా ఒక కొత్త విధానం తీసుకువచ్చినప్పుడు సందేహాలు, అసంతృప్తులు వస్తుంటాయి. కానీ నింపాదిగా, క్షుణ్ణంగా, హేతుబద్ధంగా ఆలోచన చేస్తే, రాజకీయ కోణాలను విడనాడితే, కొత్త విధాన సత్సంకల్ప ప్రయోజనం అర్థమవుతుంది. ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను పై వర్గాలవారు తప్ప, క్రింది కులాలకు చెందినవారు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థినీ విద్యార్థులు వ్యతిరేకించటంలేదు అనే సత్యాన్ని మరచిపోవద్దు. ఆంగ్ల విద్యపై రాద్ధాంతం చేసేవారంతా వారి వారి ఇళ్ళలో, దైనందిన కార్యక్రమాల్లో ఇంగ్లిష్‌ను నేర్చుకున్న వాళ్ళే అన్న సంగతి మరువవద్దు.
వ్యాసకర్త: వసంత నాగేశ్వరరావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ శాఖామాత్యులు
మొబైల్ : 99494 11779
Comments
Please login to add a commentAdd a comment