యూఎస్ స్టేట్ అధికారులకు ఏపీ విద్యా పథకాలను వివరిస్తున్న విద్యార్థిని రిషిత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక విద్యా సంస్కరణలు తమలాంటి పేద పిల్లలకు వరంగా మారాయని అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యార్థులు ఆ దేశ అధికారులకు వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతోపాటు డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు తమలాంటి పేద విద్యార్థుల జీవితాలను సమూలంగా మార్చాయన్నారు.
బాలికా విద్య, వారి సంరక్షణకు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు, పథకాల గురించి వివరించారు. రాష్ట్రం తరఫున ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్లిన 10 మంది ప్రభుత్వ విద్యార్థుల బృందం తమ పర్యటనలో భాగంగా మంగళవారం యూఎస్ డిపార్ట్‌మెంట్ స్టేట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతపై ప్రతినిధులు మాట్లాడారు. ముఖ్యంగా బాలికా విద్య ఎంత ముఖ్యమో చర్చించారు.
ఇంగ్లిష్ మీడియం వల్లే మీతో మాట్లాడగలుగుతున్నాం..
అమెరికాలో అమలవుతున్న విద్యావిధానం గురించి అమెరికా ప్రతినిధి రోసీ ఎడ్మండ్ మన విద్యార్థులకు వివరించారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలు, ఫలితంగా సాధించిన ప్రయోజనాలను రాష్ట్ర విద్యార్థులు అమెరికా అధికారులకు ప్రదర్శన రూపంలో తెలియజేశారు. జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, బాలికా విద్య కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను యూఎస్ అధికారులు ప్రశంసించారు.
ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గతంలో ఇంగ్లిష్ మీడియం లేదని.. సీఎం వైఎస్ జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని విద్యార్థులు తెలిపారు. దాని ఫలితంగానే ఇప్పుడు తాము మీతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలుగుతున్నామని అమెరికా ప్రభుత్వ అధికారులకు వివరించారు. నాడు–నేడు కింద కొత్తరూపు సంతరించుకున్న ప్రభుత్వ పాఠశాలల ఫొటోలను విద్యార్థులు.. అధికారులకు చూపించారు.
అలాగే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, అత్యాధునిక ఫర్నీచర్, ప్లేగ్రౌండ్స్, డిజిటల్ లైబ్రరీ, బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్, ప్రత్యేక టాయిలెట్స్ సౌకర్యాల గురించి కూడా వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు జగనన్న విదేశీ విద్యా కానుక పథకం కూడా ఉందని విద్యార్థులు యూఎస్ అధికారులకు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ కృషికి అమెరికా అధికారుల ప్రశంసలు
ఈ సందర్భంగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో ఇండియా డెస్క్ ఆఫీసర్‌గా ఉన్న రజనీ ఘోష్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి డిప్లొమాట్ కావడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లిష్ చాలా అవసరమని, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధిస్తే భవిష్యత్‌లో దౌత్యవేత్తలు కూడా అవుతారన్నారు.
యూఎస్‌లో ఉన్నత చదువుల కోసం ఏపీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు తమ విభాగం సిద్ధంగా ఉందని వెల్లడించారు. విద్యార్థ్లు ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలను పరిశీలించి ఆమె వారిని అభినందించారు. పేద పిల్లలను రాష్ట్రం తరఫున ప్రతినిధులుగా అమెరికా పంపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయం ఏపీలోని లక్షలాది మంది విద్యార్థులు విద్యను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రశంసించారు.
పేద విద్యార్థులకు టోఫెల్ శిక్షణ సహాయపడుతుంది..
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికారి రోజీ ఎడ్మండ్ మాట్లాడుతూ.. కొలంబియా, ప్రిన్స్‌టన్, హార్వర్డ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ ఇవ్వడం ఎంతో మంచి నిర్ణయమని కొనియాడారు. పేద మెరిట్ విద్యార్థులకు ఈ శిక్షణ సహాయపడుతుందన్నారు.
అమెరికాలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఆర్థిక సహాయం కూడా అందుతుందని తెలిపారు. 400 యూనివర్సిటీలు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ గుర్తింపు పొందాయని.. విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ డిప్లమసీ ఎఫైర్స్ ఆఫీసర్ ఎరిక్ క్రిస్టెన్‌సన్ మాట్లాడుతూ.. విద్య, సమాచార మార్పిడి.. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు.
అనంతరం విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యా అవకాశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు విద్యార్థులు చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడడాన్ని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సీనియర్ ఎక్స్‌టర్నల్ ఆఫీసర్ మోలీ స్టీఫెన్‌సన్ ప్రశంసించారు. చిన్న వయసులోనే చాలా తక్కువ సమయంలో భాష నేర్చుకుని ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు.
యూఎస్ విద్యార్థుల ప్రతినిధి బృందంలో 8 మంది బాలికలకు అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యూఎన్‌వో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ మాట్లాడుతూ.. యూఎస్ డిపార్ట్‌మెంట్ స్టేట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఎస్పీడీ, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment