ప్రతీకాత్మక చిత్రం
ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ స్వార్థ ప్రయోజనాలు పట్టుసాధిస్తున్నాయి. ప్రజలు నష్టపోయే ప్రక్రియలనే అమలు చేస్తూ వస్తున్నారు. ఈ అసంబద్ధ పరిణామం సంభవించని ప్రాంతం దేశంలో ఎక్కడైనా ఉందా?
ఎన్నికైన ప్రజాప్రతినిధి తనను ఎన్నుకున్న ప్రజలనే పట్టించుకోకుండా పోతే ఏం జరుగుతుంది? ఎన్నికైన వారికి ఏమీ కాదు. ఎందుకంటే మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అతడు లేక ఆమెకు తమదైన మార్గాలు ఉండి ఉంటాయి. కులం, డబ్బు, పరి చయాలు, పోలింగ్ సమయంలో అందించే ప్రోత్సాహ కాలతోపాటు గతంలో కండబలం ప్రదర్శించేవారు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఉపయోగించేవారు కూడా.
సిద్ధాంతాలు అనేవి కేవలం నటన మాత్రమే, లేదా అవి సీజన్లో అద్దే ఫ్లేవర్ల లాంటివి. ఇవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మన దేశంలో అయితే దానిపట్ల నమ్మకంతో పనిలేకుండా ఓట్లు సాధించే శక్తి ఉన్నంతవరకు సిద్ధాంతం మారుతూనే ఉంటుంది. హరియాణా ఎమ్మెల్యే గయాలాల్ 1967లో కేవలం పక్షం రోజుల్లోనే మూడుసార్లు పార్టీలు మారినప్పుడు ప్రజాగ్రహం పెల్లుబికింది. చివరకు తన పేరుతో ఆయారాం, గయారాం పేరు కూడా ఇలాంటివారికి స్థిరపడిపోయింది. సైద్ధాం తిక నిబద్ధతే పార్టీలు మారడానికి కారణం కాకపోవచ్చు లాభం ఆశించి పార్టీలు మారటం అనేది ఆధునిక భారత రాజకీయాల్లో తెలియని విషయమేమీ కాదు.
ప్రస్తుతం ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి త్వరగా మారిపోతున్నారు. దీని ఉద్దేశం సొంత సీటును కాపాడుకోవడం మాత్రమే కాదు. కుటుంబ పరిరక్షణ కోసం కూడా ఫిరాయిస్తున్నారు. పార్టీలు మారటం అనేది ఇప్పుడు కుటుంబ వ్యాపారంగా మారిపోయింది. దీంతో నియోజకవర్గాలు కూడా వారసత్వంగా తయారయ్యాయి. కాబట్టి ప్రజా ప్రతినిధి అనే పదానికి ఇప్పుడు కాలం చెల్లిపోయింది. దీంట్లో ప్రజలు రెండో స్థానంలోకి పడిపోయారు. దేశంలో చాలా నియోజకవర్గాలు ఇప్పుడు వారసత్వ జమానాలుగా మారాయి. పలువురు జాతీయ నేతలు కూడా దీంట్లో భాగమే. కనీసం ఒక జాతీయ పార్టీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగితే ఆ పార్టీ నేతలు భోజనాల బల్ల వద్ద విస్తరించిన పెద్ద కుటుంబంలా కనిపిస్తుంటారు. ప్రజలకు దీంతో ఏవగింపు కలుగుతోంది.
రాజకీయాల్లో భవన నిర్మాతలు ప్రవేశించడంతో మేం ఇక ఎవరిని సంప్రదించాలి అని సామాజిక కార్యకర్తలు ఆవేదన చెందుతుంటారు. 1,560 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి వారు పోరాడుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు ఇది మునకలో ఉంటుంది. ఒకప్పుడు మాగాణినేలగా ఉన్న దీన్ని తర్వాత ఉప్పు తయారీకి లీజుకిచ్చేశారు. బృహన్ ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో వాసై–విరార్‌లో ఉంటున్న భూమి ఒక అభివృద్ధి కేంద్రంగా గుర్తింపు పొందింది.
చెరువులు, కుంటలను ఆక్రమించి కాలనీలుగా మార్చిన హైదరాబాద్ తరహాలోనే వాసై–విరార్ ప్రాంతాన్ని కూడా గత సంవత్సరం వర్షాలు ముంచెత్తాయి. ముంబై ఇప్పుడు రుతుపవనాల సమయంలో ఏర్పడే జలాశయాలను కోల్పోయింది. వాటిని ముట్టకుండా ఉండి ఉంటే నగర ప్రాంతాలకు అది ఊపిరి పోసేది. కాని రాజకీయాలతో కలగలిసిన రియల్ ఎస్టేట్ లాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం నగరంలోని అనేక ప్రాంతాల్లో తిష్ట వేసింది.
వాసై–విరార్ కేసును చూస్తే, ఆ నియోజకవర్గం, పురపాలక సంస్థ దాదాపుగా ఒక కుటుంబం యాజమాన్యంలో ఉంది. వీరు భారీస్థాయిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో, నిర్మాణ రంగంలో మునిగితేలుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామీణ పట్టణ ప్రాదేశిక వాతావరణాన్ని ప్రజలు కోల్పోతున్నారు. ప్రజా ప్రతినిధులు తమ సొంత వ్యాపార ప్రయోజనాలను కాకుండా తమ నియోజకవర్గ సామూహిక ప్రయోజనాలను గౌరవించాలని ప్రజలు భావిస్తున్నారు. కానీ మన రాజకీయ, పాలనా నీతి నేపథ్యాన్ని చూస్తే సొంత ప్రయోజనాలే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంటాయి. కానీ అలా జరగకూడదు. వరదల నుంచి తమకు రక్షణ కావాలని ప్రజలు కోరితే దానికి న్యాయం చేకూర్చాలి. అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షను తోసిపుచ్చకూడదు.
గత 30 ఏళ్లలో, సుదూరంలోని పట్టణ శివార్లలో ప్రజలకు గోదాములను కట్టి ఉంచేవారు. ఒక ప్రణాళిక, పథకం లేకుండా ఎదుగుతున్న ముంబైకి అవి శ్రామికులను అందించేవి. అభివృద్ధి అంటే 1,560 ఎకరాల భూమిని గ్రోత్ సెంటర్ కోసం తీసుకుని మొత్తం నగర ప్రాంతాన్నే ప్రమాదంలో ముంచెత్తడం అని కాదు అర్థం. ఆ ప్రాంతం ఇప్పటికే జనంతో నిండి ఉంటే, ఈ భూమిలో జరిగే కొత్త ఆర్థిక కార్యాచరణ లేవనెత్తే సంక్షోభానికి నగరం చెల్లించవలసిన మూల్యం ఎంత? ఇందుకు రాజకీయ వర్గాన్ని మాత్రమే తప్పుపట్టే పనిలేదు. నగర ప్లానర్లు, ప్రభుత్వం కలిసే ఆ వృద్ధి కేంద్రం ఏర్పాటును ప్రతిపాదించాయి.
ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ స్వార్థ ప్రయోజనాలు ప్రస్తుతం పట్టుసాధిస్తున్నాయి. ఉన్నతాధికారవర్గం, ఆర్థిక ప్రయోజనాలు చివరకు ప్లానింగ్ కూడా అంతిమంగా ప్రజలు నష్టపోయే ప్రక్రియలనే అమలు చేస్తూ వస్తున్నాయి. ఈ అసంబద్ధ పరిణామం సంభవించని ప్రాంతం దేశంలో ఎక్కడైనా ఉందేమో వెనక్కు తిరిగి ఆలోచించండి.
- మహేశ్ విజాపుర్కర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment