ఆదివాసీలంటే ఇంత చిన్న చూపా? | Vooke Ramakrishna dora writes on adivasis issues | Sakshi
Sakshi News home page

ఆదివాసీలంటే ఇంత చిన్న చూపా?

Published Tue, Feb 13 2018 4:05 AM | Last Updated on Tue, Feb 13 2018 4:05 AM

Vooke Ramakrishna dora writes on adivasis issues - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేడు రాష్ట్రంలో, దేశంలో ఆదివాసీలు అస్తిత్వం కోసం అల్లాడిపోతుంటే, తమ హక్కుల కోసం గొంతెత్తి విల్లం బులు ఎక్కుపెట్టి, రాజ్య హింసలో రాలిపోతుంటే ఆది వాసీల వైపు నిలబడాల్సిన కళాలు, గళాలు ఎందుకు మూగబోతున్నాయి? ఎందుకు భయపడుతున్నాయి? 5వ షెడ్యూల్‌ ఆదివాసీ ప్రాంతాలలో గిరిజనేతర ఆధిప త్యాన్ని ఎదిరించి సవాల్‌ చేస్తున్న ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావంతులు, రచయితలు, కవులు, కళా కారులు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక వేత్తలు నోరు మెదపడం లేదెందుకు? వారి ప్రయాణం ఎటువైపు..?

తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు తమ రిజర్వేషన్లు కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించటం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదివాసీ విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు మిలిటెంట్‌ ఉద్యమాలు చేస్తుంటే, ఆదివాసీల ప్రజాస్వామిక డిమాండ్‌ను ఎందుకు ఆమో దించట్లేదు. తెలంగాణలో లంబాడీలకూ – ఆదివాసీ లకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం, సంఘర్షణ నెలకొంటే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఎందుకు నోరు విప్పటం లేదో సమాధానం చెప్పాలి.

ఏజెన్సీలో నెల రోజులుగా 144 సెక్షన్‌ విధించి ఆదివాసీల గొంతు నొక్కుతుంటే ఈ నాగరిక సమాజం, మేధావి వర్గం ఆదివాసీల పట్ల ఎందుకు సవితి తల్లి ప్రేమను చూపిస్తోంది? ఆదివాసీ ఉద్యమ వార్తలను ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియా కవర్‌ చేయొద్దు, ఎలాంటి వార్తలు రాయద్దు అని పాలక వర్గాలు నిరంకుశత్వపు శాసనాలు జారీ చేస్తుంటే.. ఆదివాసీల వైపు కళాన్ని, గళాన్ని వినిపించాల్సిన ప్రజాసంఘాలు, రచయితలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎటువైపు ఉన్నారు?

ఎందుకు ఆదివాసీలంటే అంత చిన్నచూపు. ఆది వాసీలు ఈ దేశ పౌరులు కాదా? వాళ్లు మనుషులు కారా? ఈ దేశ మూల వాసులు కాదా? ఈ దేశ చట్టాలు, సంస్కృతి, పాలక వర్గాల సంక్షేమ పథకాలు ఇక్కడి ఆదివాసులకు చెందవా? ఆదివాసీలపై ఎందుకంత నిర్లక్ష్యం? పవిత్రమైన ఆదివాసీ ఉద్యమాలపైన ఎందుకు ఇంత ఉదాసీన వైఖరి? ఆదివాసీ ఉద్యమానికి మావో యిస్టు ముద్ర వేయటం ఎంతవరకు సమంజసం. మావోయిస్టు ముద్ర వేసి ఆదివాసీల గొంతు నొక్కాలని చూస్తున్నా కూడా మేధావులు, కవులు, కళాకారులు ఎందుకు స్పందించరు?

నేడు భారతదేశంలో 5వ, 6వ షెడ్యూల్‌ ఆదివాసీ భూభాగంలో ఉన్న గిరిజనేతరుల గురించి, గిరిజనే తరుల దోపిడీ గురించి మాట్లాడటం వృథా అవుతుంది. ఒకే బోనులో పులి, జింక ఎలా జీవిస్తాయో, ఒకే బోనులో, ఒకే కలుగులో ఎలుక, పిల్లి ఎలా జీవిస్తాయో కూడా నేడు గిరిజనేతర పార్టీలు సమాధానం చెప్పాలి.

- వూకే రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం మొబైల్‌ : 98660 73866

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement