‘కోవిడ్ –19 అనేది భయంకరమైన రోగం, ఇది అంటరానిదనే భావన దయచేసి అందరూ బుర్రలోంచి తీసేయండి‘ అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనపై మీడియాలో ఒక వర్గంతో పాటు కొందరు ప్రతిపక్ష నాయకులు విపరీతార్థాలు తీస్తున్నారు. కోవిడ్–19తో కలిసి జీవించాల్సి వస్తుందనీ, ప్రస్తుతానికి దీనికి మందు లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమనీ ఆయన సలహా ఇచ్చారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రకటన పరిపక్వతతో, వాస్తవికంగా ఉంది. వైరస్ వల్ల వచ్చే మహమ్మారుల చరిత్ర చూస్తే అవి మారణహోమం సృష్టించి, కొంతకాలం కనుమరుగై మళ్ళీ కోరలు చాచాయని శాస్త్రవేత్తలంటున్నారు. నేటి కోవిడ్–19కు 1918–1920 మధ్య వచ్చిన హెచ్ 1ఎన్1 (స్వైన్‌ఫ్లూ)కు దగ్గర పోలికలున్నాయి. స్వైన్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు నుంచి వది కోట్లమంది చనిపోయారు.
ఇటువంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలతో మెలిగి ప్రాణాలు కాపాడుకోవడం అవసరమని వైఎస్ జగన్ చెప్పారు. స్వైన్‌ఫ్లూకు ఇంతవరకూ వ్యాక్సిన్ లేదు. 1978లో వెలుగుచూసిన ఎయిడ్స్ వ్యాధి హెచ్.ఐ.వి. వల్ల వస్తుంది. దీనికి ముందు జాగ్రత్తలు తప్ప మందులు లేవు. వైరస్‌ల వల్ల వస్తున్న ఇంకొన్ని రకాల క్యాన్సర్లకు కూడా ఇంతవరకూ మందులు లేవు. చరిత్రను పరిశీలిస్తే వైరస్‌లతో సహజీవనం చేయడం మానవాళికి అనివార్యమని అర్థమవుతుంది. క్రీస్తు శకం 165–180 మధ్య ఎంటోనిన్ ప్లేగ్ 50 లక్షలమంది ప్రాణాలు తీసింది. 541–544 మధ్య ప్రబలిన ప్లేగ్ రెండున్నరకోట్ల మందిని, 1334–1340 మధ్య వచ్చిన బ్లాక్‌డెత్ ప్లేగ్ ఆరు కోట్ల మందిని, 1855–1875 థర్డ్ ప్లేగ్ కోటి మందిని, 1945–47 నాటి టైఫస్ 30 లక్షల మందిని బలిగొన్నాయి.
మంచి ఆహార అలవాట్లు, రోగనిరోధకశక్తి పెంచుకుంటే ఈ వ్యాధి దానంతటదే అంతరించిపోతుందని వైఎస్ జగన్ చెప్పడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. కానీ దీన్నే అమెరికా బయోలాజికల్ ఇంజనీర్ శివ అయ్యాదొరై ధ్రువీకరిస్తున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాస్తూ, అమెరికా పౌరులకు సమతుల పోషకాహా రాన్ని రెండు నెలలపాటు ఇస్తూ, వారికి రోగనిరోధకశక్తి పెరగడానికి ఉపయోగపడే విటమిన్ ఎ, విటమిన్ డి మాత్రలు ఇవ్వాలని సలహా ఇచ్చారు. మానవ దేహానికి మించిన అద్భుతమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరొకటి లేదని ఆయన అంటారు. మానవ శరీరంలో సుమారు ఆరు ట్రిలియన్ల రోగనిరోధక కణాలు ఉంటాయని, ఇవి మానవ శరీరం వెలుపల, లోపల దాడి చేసే వైరస్‌లను, బాక్టీరి యాను సంహరిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్లు విధించడాన్ని కూడా ఆయన బహిరంగంగా వ్యతిరేకించారు. ఏపీ సీఎం కూడా పూర్తి లాక్‌డౌన్‌కు అయిష్టత తెలిపిన విషయం గమనార్హం.
ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని అనేక దేశాల్లో పూర్తి లాక్‌డౌన్లు లేకపోయినప్పటికీ అక్కడ కరోనా కేసులు స్వల్పంగా ఉన్నాయి. కరోనాపై అధ్యయనం చేస్తున్న సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగ్ ఘూషిన్ భారత్‌లో ఈ మహమ్మారి మే 21 నుంచి తగ్గుముఖం పట్టవచ్చని చెబుతున్నారు. మానవాళి ఉన్నంతవరకూ వైరస్‌ల బెడద ఉంటుందని, వీటిని ఎదుర్కోవడానికి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్ల పేరిట ప్రజల్ని ఇళ్ళలో ఉంచడం వల్ల ఆయా దేశాలకు ఆర్థికంగా జరిగే నష్టాలతోపాటు ఆరోగ్య, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియా ఈ నెల 15వ తేదీన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించింది.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లలో లాక్‌డౌన్ విధించి మిగిలిన ప్రాంతాల్లో సడలించడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. అమెరికా రాజ్యాంగ రూపకర్తల్లో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్‌ను ఒక సభ్యుడు ‘మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని మాకు ఇవ్వబోతున్నారు?’ అని ప్రశ్నించగా, ‘అది మనకు లభించే ప్రతి పక్షాన్ని బట్టి ఉంటుంది‘ అన్నారు. మన దేశంలో ప్రతిపక్షంలో ఉండటమంటే అధికార పక్షం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడమనుకుంటున్నాయి. మీడియా కూడా సమాజ పరిణామాలకు దర్పణంగా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఒక వర్గం మాయాదర్పణంగా మారి ఉన్నది లేనట్టుగానూ, లేనిది ఉన్నట్టుగానూ చూపించే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల సమాజానికన్నా ఆ మీడియాకే ఎక్కవ నష్టం వాటిల్లే ప్రమాదముంది.
వి.వి.ఆర్. కృష్ణంరాజు
వ్యాసకర్త అధ్యక్షుడు, ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్
మొబైల్ : 95052 92299
Comments
Please login to add a commentAdd a comment