ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నింపుతున్న నిర్వాహకుడు
జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల యువతకు స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ రుణాల మంజూరుకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించడంతో యువతలో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం రుణ సహాయంతో తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం రానుండడంతో అభ్యర్థుల మధ్య పోటి పెరుగుతుంది. దీంతో వైశ్య, కమ్మ, క్షత్రియ, ఆదివెలమ, ఆర్యవైశ్య, రెడ్డి, పఠాన్ , ముస్లిం, హరిదాసు, తదితర వర్ణాలకు చెందిన అభ్యర్థులు పెద్త ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మండలాల వారీగా ప్రకటించిన రుణాలు పదుల సంఖ్యలో ఉండగా జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు వేల సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో రుణ యూనిట్లు ఎవరిని వరిస్తాయోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
సత్తెనపల్లి: ప్రభుత్వం కేటాయించిన రాయితీ రుణ యూనిట్ల సంఖ్య తక్కువ. ఆశావాహులు ఎక్కువ అన్నట్లుగా తయారైంది. ఇందులో జిల్లాకు 638 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్‌కు రూ. 2 లక్షలు రుణం మంజూరు చేస్తారు. ఇందులో రూ. లక్ష బ్యాంకు రుణం పోనూ మిగిలిన రూ. లక్ష రాయితీ కల్పిస్తోంది. జిల్లాకు రాయితీ రుణాల కింద రూ. 12.76 కోట్ల నిధులు కేటాయించారు. నియోజక వర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గానికి కేవలం 35 నుంచి 38 యూనిట్ల మధ్య మాత్రమే మంజూరయ్యాయి. అయితే మండలానికి ఎన్ని యూనిట్లు మంజూరనేది స్పష్టత లేకుండా పోయింది. లక్ష్యమంటూ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. జిల్లాలో 57 మండలాలు, 13 పురపాలక సంఘాల వారీగా చూస్తే ఒక్కో మండలానికి, పురపాలక సంఘానికి కేవలం 9 నుంచి 10 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎవరికి రాయితీ యూనిట్లు మంజూరవుతాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకుంది.
అదృష్టవంతులు ఎవరో?
ప్రభుత్వం రూ.లక్ష రాయితీ ఇవ్వడంతో ఈబీసీ రుణాలకు లెక్కకు మించి ఆశావాహులు పోటీ పడుతున్నారు. దీంతో ఇప్పటికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో కొందరూ నిమగ్నమయ్యారు. జిల్లాలో పురపాలకం, మండలం, పంచాయితీల ప్రకారం ఇందులో సామాజిక వర్గాల మేరకు దరఖాస్తులను పరిశీలిస్తే ఇబ్బడి ముబ్బడిగా ఆశాహహులు దరఖాస్తు చేసుకునేందుకుపోటీ పడుతున్నారు. వీరిలో అదృష్టం ఎవరిని వరించనుందో వేచిచూడాలి. దరఖాస్తుల అనంతరం సర్పంచులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, జన్మభూమి కమిటీలు వీరంతా అయ్యాక శాసనసభ్యుని ఆమోద ముద్ర పడాలి. చివర్లో బ్యాంకు అధికారులు సమ్మతించాలి. ఇది ఇలా ఉంటే మరోవైపు ఈబీసీ ధ్రువీకరణ పత్రానికి రెవిన్యూ అధికారులు టీసీకి లింకు పెడుతున్నారు. టీసీలో కులము నమోదై ఉంటుందని, అది తీసుకొస్తే తప్ప ఈబీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయలేమని చెబుతున్నారు. మరోవైపు గడువు లేకపోవడతో ఈబీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అర్హతలు ఇవీ..
♦ దరఖాస్తుదారుడు 21–50 ఏళ్ల వయస్సు కలిగిన వారై ఉండాలి.
♦ దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నట్టు తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి.
♦ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షల›లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.81 వేలు లోపు ఉండాలి.
♦ గతంలో ఎలాంటి రాయితీ రుణం తీసుకొని ఉండకూడదు.
♦ ఈబీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి.
♦ ఈ నెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఉండాలి.
ఈబీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు
ఈబీసీ వర్గాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించా ల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓసీ కులంలో తెల్లరేషన్ కార్డు కలిగి ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ రుణాలు పొందేందుకు అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు బుధవారం వరకే గడువు ఉంది. – ఆర్.గడ్డెమ్మ,ఈడీ బీసీ కార్పొరేషన్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment