అమృతలూరు (వేమూరు): పేదరాలి ఇల్లును కూల్చారని సానుభూతి లేదు.. జూదాన్ని అరికడదామన్న ఆలోచన లేదు.. వాస్తవాలు రాసిన విలేకరిపై కేసు నమోదు చేయాలని సాక్షాత్తూ రాష్ట్ర సాంఘిక, గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనందబాబు జన్మభూమి సభలో అనడంతో, సభకు వచ్చిన జనం అవాక్కయ్యారు. వివరాలిలా ఉన్నాయి. సాక్షి దినపత్రికలో సోమవారం ‘మంత్రి ఇలాకాలో అరాచకాలు’ అనే శీర్షికన కథనం వెలువడింది. ఉన్న గూడు కోల్పోయిన పేద వృద్ధురాలి వేదన, గ్రామంలో జూదం తీవ్రతతో జరిగిన ఘటనపై ఈ కథనం ప్రచురితమైంది. ఈ కథనం మంత్రికి ఆగ్రహం తెప్పించింది.
చుండూరు మండలం అంబేడ్కర్ నగర్‌లో సోమవారం జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి హాజరైన మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తనపై ప్రచురించిన వార్తపై విచారించి, ఆ విలేకరిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కేసులు సైతం నమోదు చేయమన్నారు. లేదంటే తానే రంగంలోకి దిగుతానని సభా సమక్షంలో మంత్రి పోలీసులను హెచ్చరించడంతో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యచకితులయ్యారు.
మంత్రి హామీతో బాధితులకు బెదిరింపులు...
సాక్షాత్తూ మంత్రి సభలో మాట్లాడిన తీరును ఆసరాగా తీసుకున్న వంగివరపు గురవయ్య, కమలాకర్ వెంటనే బాధితుల వద్దకు వెళ్లి మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన అంజమ్మ, ఆమె కుమారుడు వాసు మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment