కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ
సాక్షి, కదిరి: ‘‘ఆదాయ పన్నుల శాఖ దాడుల్లో చంద్రబాబుకు ప్రైవేటు కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో రూ.2వేల కోట్లు పట్టుబడ్డాయి. అందుకే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ బాబును తక్షణం అదుపులోకి తీసుకోవాలి. లేదంటే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు సమర్థుడు.’’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శనివారం ఆయన కదిరిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉంటూ రాష్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టి అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఆయన పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయంటే ఇక చంద్రబాబును తనిఖీ చేస్తే ఎన్ని లక్షల కోట్లు బయటకు వస్తాయోనని అనుమానం వ్యక్త పరిచారు. చంద్రబాబు అక్రమ సంపాదనంతా విదేశాల్లో దాచారని.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, ఆ డబ్బు మొత్తం రాష్ట్ర ప్రజలకు పంచిపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బినామీలుగా ఉంటూ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇళ్లు, వారికి సంబందించిన సంస్థల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తే పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడిందని మంత్రి గుర్తు చేశారు.
వీరితో గానీ, ఈ వ్యక్తులతో గానీ చంద్రబాబుకు ఎలాంటి సంబందం లేదని టీడీపీ నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి పదే పదే చెప్పడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రజా ధనం లక్షల కోట్లు దురి్వనియోగం జరిగిందన్నారు. పోలవరంను చూసొద్దాం రండి.. అంటూ అందులో కూడా చంద్రబాబు తో పాటు ఆ పార్టీ నేతలు ప్రజా ధనం దోచుకున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక ఇలా ప్రతిదాంట్లోనూ అవినీతి జరిగిందని, గత ఐదేళ్లలో ఖర్చు చేసిన నిధులపై సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment