
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన రాష్ట్రంలోని జాతీయ రహదారులు అన్నింటినీ దిగ్బంధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. హోదా సాధన కోసం చేసే ఏ పోరాటానికైనా, ఆందోళనకైనా మద్దతిస్తామని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి చేయనున్న ఆందోళనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం ఉదయం 10.00 గంటలకు ప్రారంభమయ్యే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో కోరింది. ఇతర పార్టీలను, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ముఖ్య నాయకులతో బుధవారం జిల్లాస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించింది.