పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
పిడుగురాళ్ల టౌన్: స్థానికంగా జరిగిన క్రికెట్ పోటీలో ఓటమి పాలైన అక్కసుతో ముస్లిం యువకులపై గొడవకు దిగి.. అది చాలక పిడుగురాళ్ల నుంచి రౌడీమూకలను తీసుకువచ్చి గ్రామంలోని ముస్లిం కాలనీపై టీడీపీ నేతలు దాడిచేయటం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన అల్లరి మూకలు, రౌడీలతో టీడీపీ నాయకులు పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ ముస్లింలపై శనివారం రాత్రి చేసిన దాడులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ, గ్రామంలోని ముస్లింలపై టీడీపీ గూండాలు మహిళలను కూడా వదలకుండా దాడిచేయటం దారుణమన్నారు.
గ్రామంలో ఇంత ఘోరం జరిగినా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేని దుస్థితి నెలకొని ఉందని తెలిపారు. జానపాడులో గొడవ జరిగితే పిడుగురాళ్ల నుంచి రౌడీ మూకలను రప్పించి రాడ్లు, కర్రలతో దాడిచేశారన్నారు. పోలీసులు టీడీపీ వారికి అండగా ఉన్నట్లు తెలుస్తోందని అంబటి తెలిపారు. గుంటూరు తూర్పు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా, పార్టీ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు పట్టణ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు మర్రి రాజశేఖర్, కాసు మహేష్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు తదితరులు మాట్లాడుతూ, టీడీపీ నేతల ఆగడాలకు హద్దు లేకుండాపోతోందని దుయ్యబట్టారు. వారి దాడులను ఇక ఉపేక్షించే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. మళ్లీ పల్నాడులో గొడవలు జరిగితే స్థానిక ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కాగా, టీడీపీ నేతలపై కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తామని డీఎస్పీ కాలేషావలి, సీఐ హనుమంతరావుల హామీతో నేతలు ఆందోళన విరమించారు. ఈ ధర్నాలో వేలాదిమంది ముస్లింలు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment