హెచార్సీని ఆశ్రయించిన హెచ్.ఎ.రెహమాన్ తదితరులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ. రెహమాన్ ఆరోపించారు. గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయకపు ముస్లిం మైనార్టీ యువకులను టీడీపీ ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసిందని ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసు జులం కొనసాగుతోందన్నారు. న్యాయపరమైన హక్కుల కోసం నినదించిన వారిపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. అమాయకులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇలా చేయడం ఆర్టికల్ 14 ప్రకారం హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు.
ఈ హక్కులను ఉల్లంఘించిన ఏపీ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, ముస్లిం యువకులను అరెస్టు చేయడానికి ప్రోత్సహం అందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెహమాన్ శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌లో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఏపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషాతో కలిసి ఫిర్యాదు చేశారు.
నాలుగున్నరేళ్లలో చంద్రబాబుకు ముస్లిం మైనార్టీలు ఏనాడూ గుర్తుకు రాలేదని మండిపడ్డారు. చంద్రబాబు కేబినెట్‌లో ఒక్క మైనార్టీ మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు ముస్లిం మైనార్టీలను కరివేపాకులా వాడుకుని తీసిపారేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ఏపీ అధ్యక్షులు ఖాదర్ బాషా మాట్లాడుతూ... నారా బట్టేబాజ్... టీడీపీ దోఖేబాజ్ అని నిప్పులు చెరిగారు. సదస్సులో చెప్పులు విసిరితే అరెస్టులు చేయాలి గానీ శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment