హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు తమ పార్టీ దూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ శైలజానాథ్, కొండ్రు మురళి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో వారు మాట్లాడుతూ... రాజధాని కోసం 35 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మరో 50 వేల ఎకరాల అటవీ భూముల డీనోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కోరిందన్నారు. బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వేల ఎకరాల భూ సేకరణ చేపట్టారని ఆరోపించారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన ప్రొ.శివరామకృష్ణ కమిటీని కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై శైలజానాథ్, కొండ్రు మురళి మండిపడ్డారు.