ఆర్గస్-2.. వృద్ధాప్యంలో కాంతిరేఖ!
వృద్ధులకు వయసు మీద పడుతున్నకొద్దీ కంటిచూపు మందగించడం సాధారణమే. రెటీనా ఎక్కువగా దెబ్బతింటే కొందరిలో చూపు పూర్తిగా పోతుంది కూడా. అయితే, వయసు రీత్యా అంధత్వానికి గురయ్యే పండుటాకుల జీవితాల్లో ఇకపై వెలుగులు తిరిగి ప్రసరించనున్నాయి. దెబ్బతిన్న రెటీనా పనిచేసేలా ప్రేరేపించే ‘ఆర్గస్-2 రెటీనల్ ఇంప్లాంట్’ వృద్ధులకు కారుచీకట్లో కాంతిరేఖలా మారనుంది. ‘వయసు రీత్యా వచ్చే అంధత్వం(ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్-ఏఎండీ)’ సమస్యతో చూపు కోల్పోయిన ఓ వృద్ధుడికి మొట్టమొదటిసారిగా ఆర్గస్-2తో బ్రిటన్ వైద్యులు విజయవంతంగా చూపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరో మార్గం సుగమం చేశారు.
రేమండ్ ఫ్లిన్. మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు. రెటీనా మధ్యభాగం దెబ్బతినడంతో ఏఎండీ వల్ల కొన్నేళ్ల క్రితమే పూర్తిగా చూపు కోల్పోయాడు. ఇన్నేళ్ల తర్వాత మాంచెస్టర్‌లోని రాయల్ ఐ హాస్పిటల్ వైద్యులు మళ్లీ అతడికి వెలుగులు ప్రసాదించారు. ఆర్గస్-2 ఇంప్లాంట్‌ను అమర్చి ఇటీవల మళ్లీ చూపును తెప్పించారు. సెకండ్ సైట్ సంస్థ రూపొందించిన ఆర్గస్-2 కృత్రిమ రెటీనా పరికరానికి 2013లోనే అమెరికాలో ఆమోదం లభించింది.
రెటీనా దెబ్బతినడం వల్ల దృష్టిక్షేత్రంలో బయటివైపు ఖాళీ ఏర్పడే ‘రెటీనైటిస్ పిగ్మెంటోసా’ అనే వ్యాధికి చికిత్స కోసమే దీనిని ఇంతవరకూ వినియోగించారు. అయితే, ఏఎండీకి కూడా దీనిని ఉపయోగించవచ్చని తొలిసారిగా బ్రిటన్ వైద్యులు నిరూపించారు. ఇంప్లాంట్‌తో సహా మొత్తం చికిత్సకు రూ. 79 లక్షల వరకూ ఖర్చయిందట. భవిష్యత్తులో ఇంప్లాంట్ ఖరీదు తగ్గే అవకాశాలున్నాయి.
ఇలా పనిచేస్తుంది...
* కంటిలో దెబ్బతినకుండా మిగిలిపోయిన రెటీనా కణాలు తిరిగి పనిచేసేలా ఆర్గస్-2 ఇంప్లాంట్ ప్రేరేపిస్తుంది.
* కళ్లజోడులోని కెమెరా తొలుత దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఈ వీడియోలోని చిత్రాలను కంప్యూటర్ ప్రాసెసర్ విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది.
* విద్యుత్ సంకేతాలు వైర్‌లెస్‌గా కనుగుడ్డుకు పక్కన అమర్చిన చిన్న యాంటెన్నాకు చేరుతాయి. యాంటెన్నా నుంచి కేబుల్ ద్వారా రెటీనాపై ఇంప్లాంట్‌కు ఉండే ఎలక్ట్రోడ్‌కు చేరతాయి.
* ఎలక్ట్రోడ్లు రెటీనాపై కణాలను ప్రేరేపిస్తాయి. మెదడుకు సమాచారం చేరి కాంతి తేడాల విశ్లేషణ జరుగుతుంది.
* దీంతో పూర్తిగా కాకపోయినా కొంత మేరకు చూపు తిరిగి వస్తుంది. రోగి అస్పష్టంగా చూడగలుగుతాడు.
* భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధిపరిస్తే చూపు మెరుగవుతుందని చెబుతున్నారు.