తెలుగు భాషపై నిర్లక్ష్యం దురదృష్టకరం
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ
ఢిల్లీలో ‘ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్’ పుస్తకావిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష ఇతర రాష్ట్రాల్లో నిర్లక్ష్యానికి గురికావడం దురదృష్టకరమని, ఇతర రాష్ట్రాల దురభిమానం వల్ల తెలుగు వారు కష్టాలు ఎదుర్కొంటున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి చదివిన భాషలో కాకుండా ఆ రాష్ట్రాల అధికార భాషల్లో పరీక్షలు రాయాల్సి వస్తోందని, వారి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరారు. కృష్ణ వీర్ అభిషేక్ రచించిన ‘ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్’ పుస్తకాన్ని జస్టిస్ రమణ న్యూఢిల్లీలో మంగళవారం ఆవిష్కరించారు. మాతృ భాషాదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరగ డం సంతోషమని, జాతి మనుగడలో భాష అత్యంత అవసరమని చెప్పారు.
అభిషేక్ ఆలోచనా ధృక్పథం సరైనదని, దేశ వ్యాప్తంగా అవసరమైన పున్తకాన్ని ఆయన అందించారని అభినందించారు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాకపోతే ఏదీ సాధ్యం కాదేమోనని అనిపిస్తుందని, అన్ని వృత్తులలో కంటే న్యాయవాద వృత్తిలో ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిదే ఎవరూ కూడా కోర్టులో నిలబడి వాదించి తన క్లయింట్ కు న్యాయం చేకూర్చలేరని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి పేర్కొన్నా రు. అభిషేక్ చేసిన ప్రయోగం వల్ల పలువురు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహా దారుడు (కమ్యూనికేషన్ స్కిల్స్) కె.లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర హిందీ సమితి సభ్యలు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.