మాతృభాషకు పూర్వవైభవం ఎలా? | how to get priority for mother tongue | Sakshi
Sakshi News home page

మాతృభాషకు పూర్వవైభవం ఎలా?

Published Wed, Dec 13 2017 1:38 AM | Last Updated on Thu, Dec 14 2017 11:41 AM

how to get priority for mother tongue - Sakshi

వేలాది రూపాయలను కొత్త బట్టలకు తగలేసే మనం.. ఇంట్లో మన పిల్లలకి కనీసం పట్టుమని పది పుస్తకాలైనా కొనివ్వం. ‘తెలుగు భాష’ని మాట్లాడటం తల్లిదగ్గరే నేర్చుకున్న విద్యార్థికి ఇంట్లో చదవడానికి ‘పుస్తకా’లుండాలి.

బాల్యంలో.. కోడిపిల్లలకి మల్లే అమ్మ రెక్కల కింద పదిలంగా, వెచ్చగా ఉండే మనం– వయసు పెరిగేకొద్దీ క్రమేణా ఆ రెక్కల కింద నుంచి తల బైటపెట్టి, బయటి ప్రపంచపు వింతలు చూసేందుకు ఉవ్విళ్లూరుతాం తప్ప, ఆ రెక్కల కిందే ఎప్పటికీ ఉండిపోవాలనుకోం. అమ్మ రెక్కల కింద ఉన్నన్నాళ్లూ మనకి విన్పించేది, అమ్మ భాష ఒక్కటే అయితే.. బయటి ప్రపంచంలో అడుగెట్టాక విన్పించేవి ఎన్నో భాషలు. బతుకుతెరువు కోసం.. పరభాషలు నేర్చుకునే పరిస్థితి మనది. కార ణం.. భాషాపరంగా మనదేశ చరిత్ర విభిన్నమైంది. ప్రపంచ యవనికపై ఇన్ని విభిన్న అధికార భాషలున్న దేశాలు అతి తక్కువగా కన్పిస్తాయి.

ఇక రాష్ట్ర సరిహద్దులు దాటితే మనకెదురయ్యేవి ఎన్నో ప్రాంతీయ భాషలు, అక్కడ ఎవరి మాతృభాష వారికి పనికిరాదు. అందుకే అన్ని రాష్ట్రాల ప్రజల్ని ఏకం చేసేందుకు హిందీని ‘జాతీయ భాష’గా ‘ఇంగ్లిష్‌’ని ‘అనుసంధాన భాష’గా ప్రకటించి త్రిభాషా సూత్రాన్ని పాటిస్తోంది మన దేశం. ‘ఇంగ్లిష్‌ మీడియం’లో చదు వులు, ఉద్యోగాలకీ, వివిధ ఐటీ కంపెనీల్లో గుర్తింపు నకూ అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి– చాలా మంది గ్రామీణ ప్రజలు తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడి యంలోనే చదివించడానికి మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదివించే స్తోమత లేకనే– తప్పని పరిస్థితుల్లో పేరెంట్స్‌ తమ పిల్లలను తెలుగు మీడియం స్కూళ్లలో చేర్పిస్తున్నారు.

ఇంగ్లిష్‌లో ‘కమ్యూనికేషన్‌ స్కిల్స్‌’ లోపం మూలంగా తమ పిల్లలు పట్టణ విద్యార్థులతో పోటీ పడ లేకపోతున్నారన్న అసంతృప్తి.. గ్రామీణ ప్రజల్లో ఉందని తెలిసి, వారి అభీష్టం మేరకే కేజీ నుంచి ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లని ప్రవేశపెడ్తూ పేద ప్రజలకి ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందుబాటులోకి తెస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. నిజానికిది అభినందించదగ్గ విషయం.

అయితే బతుకుతెరువు కోసం మనం ఇంగ్లిష్, చైనీస్, ఫ్రెంచ్‌ లాంటి భాషల్ని ఎన్ని నేర్చుకున్నా మాతృభాషని అలక్ష్యం చేస్తే.. కొన్నాళ్లకి అది కూడా అంతరించి పోయిన భాషల్లో ఒకటిగా మిగిలిపో తుంది. ఈ మధ్య తెలుగు భాషా పరిరక్షణ అనగానే– ఇంతకీ ఏ తెలుగు– తెలంగాణ తెలుగా– రాయలసీమ తెలుగా– కోస్తాంధ్ర తెలుగా అంటూ మాండలికాల సెగలు కూడా చుట్టుముడుతున్నాయి.

పరభాషా పదాలను ఇంగ్లిష్‌ వాడే తన డిక్షనరీలో చొప్పిస్తూ తన భాషని ఎప్పటికప్పుడు క్రొంగొత్త పదా లతో అప్‌డేట్‌ చేసుకుంటూంటే తెలుగునాట ఎవరి మాండలికానికి వారే పెద్దపీట వేసుకోవడం.. తెలుగు భాషా వికాసానికి అవరోధమవుతుంది. దీనికి బదులుగా తెలంగాణ మాండలికంలోని సొగసైన పదా లను, రాయలసీమ మాండలికంలోని సొంపైన పదా లను, కోస్తాంధ్ర మాండలికంలోని ఇంపైన పదాలనూ, ఆయా జిల్లాల్లో జనుల నాలుకల మీద నడయాడు తున్న మాండలిక పదాలను.. ప్రస్తుత ‘ప్రామాణిక భాష’లో ఉపయోగించడం అవశ్యం.

ఇంటి విషయానికొస్తే.. కొన్ని వేల రూపాయలను కొత్త బట్టలకు తగలేసే మనం.. ఇంట్లో మన పిల్లలకి కనీసం పట్టుమని పది పుస్తకాలైనా కొనివ్వం. ‘తెలుగు భాష’ని మాట్లాడటం తల్లిదగ్గరే నేర్చుకున్న విద్యార్థికి ఇంట్లో చదవడానికి ‘పుస్తకా’లుండాలి. అవి తల్లిదం డ్రులే తెప్పించి, తమ పిల్లలతో చదివించాలి. పిల్లల్ని తమ దగ్గర కూర్చోబెట్టుకుని తెలుగు కథల్ని చదు వుతూ, వాళ్ల చేత చదివిస్తూ ఉంటే విద్యార్థికి తెలుగు భాష పట్ల ఎనలేని మక్కువ ఏర్పడుతుంది.

టీవీల్లో నయీంలాంటి ఖల్‌నాయక్‌ల కథలతో ఊదరగొట్టకుండా ‘టీవీ చానల్స్‌’ వారు తెలుగు సాహిత్యంపై క్విజ్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తే విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు లభిస్తుంది. తెలుగు మెసేజీలని ఇంగ్లిష్‌ అక్షరాలతో టైప్‌ చేస్తూ.. రాసిన భావం చదవ డానికే కష్టమై ఉభయ భ్రష్టులవుతున్నాం. కానీ, సెల్‌ ఫోన్లలో ‘తెలుగు ట్రాన్స్‌లేటర్‌’ టూల్‌ని డౌన్‌లోడ్‌ చేసు కుని తెలుగులోనే టైప్‌ చేస్తే – ‘తెలుగులిపి’లో మెసే జీలు చదవడం ఎంత తేలికో.. పిల్లలకే కాదు, మనకూ అర్థమవుతుంది. అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని అందిపుచ్చుకుని మనమైనా, మన అమ్మైనా బయటికి వెళ్తాము. ఆ వెళ్లే క్రమంలో ఉన్నఫళాన ఇంట్లోని ఫార్మల్‌ బట్టలు వేసుకొని బయటికి వెళ్లం. ట్రిమ్‌గా తయారై వెళ్తాం. అమ్మ పట్టుబట్టలు కట్టు కుంటుంది. మనం సూటూబూటూ వేసుకుంటాం.

బయటి పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాక మళ్లీ మనం ఫార్మల్‌ బట్టలు వేసుకుంటాం. అమ్మ నూలు చీర కట్టుకుంటుంది. అమ్మ మెత్తటి బట్టలు మనని సేదదీరుస్తాయి. ఒక్కమాటలో చెప్పా లంటే అమ్మ పట్టుచీరల్లాంటివి పరాయి భాషలైతే.. అమ్మ మెత్తటి నూలు చీరలాంటిది మన మాతృభాష.

అలాంటి మన మాతృభాషని మనం పరిరక్షిం చుకోలేకపోతే.. ఎలెక్ట్రానిక్‌ మీడియాలో వచ్చీరాని తెలుగు మాట్లాడే యాంకరమ్మలే దొరుకుతారు. తెలు గులో పట్టీపట్టీ డైలాగ్స్‌ చెప్పే సినీ హీరోయిన్లతోనే సరి పెట్టుకుంటాం. ‘అబ్బో! తెలుగా? రాయటం కష్టం!’ అనుకునే విద్యార్థులనే చూస్తాం.

అందుకే.. మన భాషకి ఆ దుర్గతి దాపురించకూడ దని తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం, ప్రింట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియా తదితరులు తెలుగు భాషా పరిరక్షణకై ఇతోధికంగా తమ వంతు కృషి చేస్తే, తెలుగు భాషకి పూర్వ వైభవం చేకూరుతుంది.

– డాక్టర్‌ అమృతలత, రచయిత్రి, విద్యావేత్త
మొబైల్‌ : 98488 68068

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement