'ఎప్పుడు స్నానం చేసినా.. పుష్కర స్నాన ఫలమే'
రాజమండ్రి కల్చరల్ : పుష్కర తేదీల్లో వివాదాలు అనవసరమని, మంచి పనులు ఎప్పుడైనా చేయవచ్చని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. రాజమండ్రి గౌతమ ఘాట్‌లోని దత్తముక్తి క్షేత్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘చాంద్రమానం, సౌరమానం.. ఈ వివాదాల జోలికి పోకండి. మంగళవారం సూర్యోదయం నుంచి ఈ ఏడాదిలో ఎప్పుడు గోదావరిలో స్నానం చేసినా, పుష్కర స్నాన ఫలితం లభిస్తుంది’ అని అన్నారు. ‘కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో ప్రకృతి ఆరాధన ఉంది. చెట్టును, పుట్టను, పామును, నదిని, సముద్రాన్ని, పర్వతాలను అన్నిటినీ మనం ఆరాధిస్తాం. అయితే, అవసరం ఉన్నంత మేరకే ప్రకృతిని వినియోగించుకోవాలి.
ఒక చెట్టును నరికితే, పది చెట్లు నాటాలి’ అని చెప్పారు. పంచభూతాలపై విశ్వాసం పెంచుకోవడానికే పుష్కరాల వంటి వైదిక ప్రక్రియలు ఉపయోగపడతాయన్నారు. ఇంటివద్ద స్నానం చేసి నదీ స్నానానికి రావాలని, నదీ స్నానానికి ముందు ఒంటిని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గోదావరికి ప్రతీక రాజమండ్రి అని, ఇది గొప్ప క్షేత్రమని అన్నారు. పుష్కర స్నానంవల్ల జ్ఞానం, ఆరోగ్యం, సంపద కలుగుతాయన్నారు. ‘పుష్కర జలాలను అమెరికా తీసుకు వెళ్తున్నాను. అక్కడ ప్రతిష్ఠించనున్న హనుమంతుని విగ్రహానికి గోదావరి పుష్కర జలాలతో అభిషేకాలు చేస్తాను’ అని స్వామీజీ చెప్పారు. విలేకర్ల సమావేశంలో కంటిపూడి సర్వారాయుడు, వీఎస్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.