సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లాలోని పుష్కర ఘాట్లకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. పుష్కరాలకు విచ్చేసే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఘాట్ల వరకు నేరుగా బస్సులు నడుపుతున్నామని చెప్పారు. బహుశా ఎక్కడా ఘాట్ పాయింట్ వరకు బస్సులు నడుపుతున్న దాఖలాలు లేవన్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి చొప్పున ఘాట్లకు బస్సులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏలూరు నుంచి కొవ్వూరు వెళ్లే వాహనాలను పుష్కరనగర్ వద్ద, నిడదవోలు, రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను రోడ్ కం రైల్ బ్రిడ్జి వద్ద నిలిపివేస్తారని చెప్పా రు. ఆ రెండుచోట్ల తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రెండు బస్‌స్టేషన్ల నుంచి ఘాట్ల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. నరసాపురంలో కూడా ఇదేవిధంగా ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈసారి లెక్క పక్కా
పుష్కరాలకు ఈసారి ఎంతమంది భక్తులు వచ్చారనేది పక్కాగా తెలుస్తుందని కలెక్టర్ భాస్కర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు భారీ జన సమూహాలకు సంబంధించి సుమారుగా లెక్కలు వేస్తున్నామే తప్ప.. పక్కాగా గణన చేసిన దాఖలాలు లేవన్నారు. పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుని పేరు ఆయా ఘాట్ల వద్ద నమోదు చేస్తామని, ఒకవేళ ఒకే వ్యక్తి రెండు, మూడు ఘాట్ల వద్దకు వెళ్లినా ఒక్కసారే పేరు నమోదవుతుందని చెప్పారు. ఇలా జిల్లాలోని అన్ని ఘాట్ల కు వచ్చే భక్తుల సంఖ్యను కలిపి ప్రతిరోజూ సాయంత్రం ప్రకటిస్తామన్నారు. పుష్కరాలు దగ్గర పడుతుండటంతో అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని కలెక్టర్ కితాబిచ్చారు. పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా 20మంది స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లను నియమించామని చెప్పారు. ధరలు పెరగకుండా 14 టన్నుల కూరగాయలను జిల్లాలో రైతుబజార్ల ద్వారా విక్రయించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
ఘాట్ల వరకు ఉచిత బస్సులు
Published Thu, Jul 9 2015 1:27 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement
Advertisement