భవిష్యత్తుపై ఆందోళన వద్దు | Future On Do not worry | Sakshi
Sakshi News home page

భవిష్యత్తుపై ఆందోళన వద్దు

Published Thu, Jul 30 2015 3:00 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

భవిష్యత్తుపై ఆందోళన వద్దు - Sakshi

భవిష్యత్తుపై ఆందోళన వద్దు

ప్రత్యూషతో హైకోర్టు ధర్మాసనం
* ఆరోగ్య స్థితి, యోగ క్షేమాలపై ధర్మాసనం ఆరా
* చదువుపై దృష్టి పెట్టి ఇష్టమైన నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలని సూచన
* తండ్రి జీతం నుంచి కొంత మొత్తం ప్రత్యూషకు అందేలా చూడాలి
* ఇంటి అద్దె కూడా ఆమెకే అందాలి.. ఆ మేరకు ఏర్పాట్లు చేయండి
* స్పెషల్ జీపీకి కోర్టు స్పష్టీకరణ
* సీఎం కేసీఆర్ స్పందించిన తీరుపై ప్రశంస
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేశ్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చింది.

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే తన చాం బర్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి ఆమెతో మాట్లాడారు. ప్రత్యూషకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ధర్మాసనం తమ ఛాంబర్‌లో రహస్య విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్, ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్‌ను మాత్రమే విచారణకు అనుమతించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

సవతి తల్లి, తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురైన తీరును ఆమె కోర్టుకు వివరించింది. సవతి తల్లి, తండ్రికి శిక్ష పడాలని కోరుకుంటున్నానని గట్టిగా చెప్పింది. ఈ విషయాన్ని కోర్టులు చూసుకుంటాయని, చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ధర్మాసనం ఆమెకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తదుపరి ఏం చేస్తావని కూడా ధర్మాసనం ఆరా తీసింది. అందుకు నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి, సేవ చేస్తానని ప్రత్యూష బులిచ్చింది.

భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆందోళన చెందొద్దని, ముందు ఇం టర్ పూర్తి చేసి, ఆ తర్వాత ఇష్టమైన నర్సింగ్ కోర్సును పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని ధర్మాసనం ఆకాంక్షించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న తండ్రి రమేశ్‌కు వస్తున్న జీతం నుంచి కొంత మొత్తం ప్రత్యూషకు అందేలా చూడాలని స్పెషల్ జీపీ శరత్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె పేరుతో డబుల్ బెడ్‌రూం ద్వారా వచ్చే అద్దె మొత్తం కూడా అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆమె పేరుపై ఓ బ్యాంకు ఖాతా తెరచి, ఆ మొత్తాలు అందులో జమయ్యేలా చూడాలంది.

ఈ వ్యా జ్యంలో ప్రతివాదిగా ఉన్న రమేశ్‌తో మాట్లాడి ఎవరైనా న్యాయవాదిని పెట్టుకుంటారా.. లేక హైకోర్టే న్యాయవాదిని ఏర్పాటు చేయాలా..? అన్న విషయాన్ని ఎల్బీ నగర్ పోలీసుల ద్వారా తెలుసుకుని చెప్పాలని శరత్‌కుమార్‌కు తెలి పింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించి, యాసిడ్‌లాంటి ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ ఘటనపై తాత్కాలిక సీజేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ జరపాలని కోరారు. అందుకు అంగీకరించిన జస్టిస్ బొసాలే.. జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే.
 
ముందుకొచ్చిన ఫెర్నాండెజ్ ఆసుపత్రి!
ప్రత్యూష బాగోగులను చూసుకునేందుకు ఫెర్నాండెజ్ ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చినట్లు తెలిసింది. ప్రత్యూషను తమ సంరక్షణలో ఉంచుకుని ఆమె చేత ఇంటర్ పూర్తి చేయించి, తమకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజీలోనే తదుపరి చదువులు చెప్పిస్తామని ఫెర్నాండెజ్ ఆసుపత్రి తెలిపింది. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటామని, అందుకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రత్యూష సిద్ధమైతే.. తమ సంరక్షణలోకి తీసుకోవడానికి అభ్యంతరం లేదని హైకోర్టుకు నివేదించినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని ప్రత్యూషకు తెలిపిన ధర్మాసనం.. ఫెర్నాండెజ్ ఆసుపత్రి సంరక్షణలో ఉండటం మేలని సూచిం చింది. అందుకు ప్రత్యూష అంగీకరించినట్లు సమాచారం. మీడియాతో ఎలాంటి విషయాలను చర్చించవద్దని ప్రత్యూషకు ధర్మాసనం ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం.
 
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
పూర్తిగా కోలుకోవడంతో 21 రోజుల చికిత్స అనంతరం అవేర్ గ్లోబల్ ఆసుపత్రి బుధవారం ప్రత్యూషను డిశ్చార్జి చేసింది. కాగా, ప్రత్యూషకు భవిష్యత్తులో కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తినా ఉచితంగా వైద్యం అందిస్తామని ఆసుపత్రి సీఓఓ వేమూరి విజయ్ తెలిపారు. ఈనెల 8న బాలల హక్కుల సంఘం, ఎల్బీనగర్ పోలీసుల సహకారంతో ప్రత్యూష.. సవతి తల్లి చెర నుంచి బయట పడి న సంగతి తెలిసిందే.
 
బాలల హక్కుల సంఘం హర్షం
ప్రత్యూషకు ప్రభుత్వం అండగా నిలవడంపై బాలల హక్కుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రత్యూష లాంటి విధి వంచితులు సమాజంలో ఎందరో ఉన్నారని, వారందరికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ సంఘం అధ్యక్షురాలు అనురాధారావు అన్నారు.
 
కేసీఆర్‌కు అభినందన
ప్రత్యూష విషయంలో కేసీఆర్ స్పందించిన తీరును ధర్మాసనం అభినందించింది. సీఎంగా బిజీగా ఉండి కూడా కుటుం బసమేతంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించి, భవిష్యత్తు గురించి భరోసా ఇచ్చిన తీరు ఎంతో గొప్పగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న యువతులకే కాక మొత్తం ప్రజలకు.. సమస్య వస్తే తాను ఉన్నానన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించింది. ఈ ఘటన ద్వారా సీఎం మానవతావాది అన్న విషయం రుజువైందని అన్నట్లు సమాచారం. కేసు తదుపరి విచారణపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.
 
నా దుస్థితికి కారణమైన వారిని శిక్షించాలి
అనాథగా అర్ధాంతరంగా తనువు ముగించాల్సి వస్తుందని మానసిక వేదనకు గురయ్యా. ఆ నరకం నుంచి బయటపడ్డందుకు సంతోషంగా ఉంది. ఎంతో మంది నాకు అండగా నిలిచారు. నా ఈ దుస్థితికి కారణమైన సవతి తల్లి, కన్నతండ్రిని కఠినంగా శిక్షించాలి.
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ప్రత్యూష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement