భక్తజనోత్సాహం
* ఏపీలో పదో రోజూ పోటెత్తిన యాత్రికులు
* అరకోటి మంది పుణ్యస్నానాలు
సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో ఇవి ముగియనున్నాయి. ఇప్పటివరకు ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో 3.95 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. గురువారం ఒక్కరోజే రెండు జిల్లాల్లో కలిపి 50 లక్షల మంది పుణ్య స్నానాలు చేశారు. మిగిలిన రెండు రోజులూ ఇలాగే రద్దీ కొనసాగే అవకాశాలున్నాయని అధికారుల అంచనా.
గోదావరి పుష్కరాల పదోరోజైన గురువారం ఉభయగోదావరి జిల్లాల్లో ప్రధాన ఘాట్‌లన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. గురువారం రాత్రి ఏడు గంటల సమయానికి తూ.గో.లో 33 లక్షలు, ప.గో.లో 14.50 లక్షల మంది, మొత్తంగా ఉభయగోదావరి జిల్లాల్లో 47.50 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. మరో నాలుగైదు లక్షల మంది ప్రధాన స్నానఘట్టాల వద్ద స్నానాలు చేసేందుకు వేచి ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
గురువారం సరస్వతి(వీఐపీ)ఘాట్‌లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ, రాష్ర్ట మున్సిపల్ డెరైక్టర్ కన్నబాబు, మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణరావు, శత్రుచర్ల విజయరామరాజు, ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ అశ్వన్‌మెహతా, నటులు తనికెళ్ల భరణి, విజయచందర్, సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ తదితరులు పుణ్యస్నానాలు ఆచరించారు. ముక్తేశ్వరం ఘాట్‌లో హోంమంత్రి చినరాజప్ప దంపతులు పుణ్య స్నానాలు చేశారు. నిత్యహారతి కార్యక్రమంలో త్రిదండి చినజీయర్‌స్వామి, పరిపూర్ణానంద సరస్వతి, జగ్గివాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
26 నుంచి ‘గోదావరి’కే హారతి
సాక్షి, రాజమండ్రి: గోదావరికి ఇస్తున్న నిత్యహారతిపై ప్రస్తుత విధానాన్ని మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 26వ తేదీ నుంచి ఘాట్ నుంచి గోదారమ్మకు హారతి ఇచ్చేలా మార్పు చేస్తున్నట్లు పుష్కరాల ప్రత్యేకాధికారి ధనుంజయ్‌రెడ్డి తెలిపారు. నదిలో ప్రజలకెదురుగా నిలబడి ఇస్తున్న హారతితో అరిష్టాలేనని ఆధ్యాత్మికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నార ని ‘బాబు ప్రచార హారతి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై చర్చ జరిపి ఈ మార్పు చేసినట్లు ధనుంజయ్‌రెడ్డి తెలిపారు.