భక్త జనహారం
ఏపీలో వెల్లువలా వచ్చిన పుష్కర యాత్రికులు.. స్నాన ఘాట్‌లకు పోటెత్తిన జనం
సాక్షి, రాజమండ్రి: లక్షలాదిగా పోటెత్తిన పుష్కర భక్తజనం గోదారమ్మకు రంగురంగుల రతనాలు పొదిగిన హారంలా భాసించారు. గోదావరి జిల్లాలు భక్తజన సంద్రాన్ని తలపించాయి. లంక గ్రామాల్లో సైతం యాత్రికులు పరవళ్లు తొక్కారు. పుష్కరాల్లో వచ్చిన ఏకైక సోమవారం.. పరమశివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి రెండు జిల్లాల్లో స్నాన ఘాట్‌లకు భక్తులు పోటెత్తారు.
పుణ్య స్నానాలకు 24 గంటలూ అనుమతి ఇవ్వడంతో ఘాట్‌లన్నీ రేయింబవళ్లు భక్తులతో కళకళలాడాయి. రాత్రిపూట వచ్చినవారు అప్పటికప్పుడే స్నానాలు ఆచరించగా.. ఉదయం వచ్చిన వారు ఉదయం స్నానం చేశారు. దీంతో ప్రధాన ఘాట్‌లలో భక్తుల తాకిడి కనిపించలేదు. ఆదివారంతో పోలిస్తే సోమవారం రద్దీ తక్కువగానే ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిలింగాల, పుష్కర, సర్వస్వతి, కోటిపల్లి, సోంపల్లి ఘాట్‌లతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం ఘాట్‌లలో భక్తులతాకిడి ఎక్కువగా ఉంది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల సమయానికి తూ.గో. జిల్లాలో 25 లక్షల మంది, ప.గో. జిల్లాలో 10 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు.
వర్షంతో పరుగులు తీసిన భక్తులు
ఆదివారం అర్ధరాత్రి, సోమవారం సాయంత్రం గోదావరి తీరాల్లో కొద్దిసేపు ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రాజమండ్రిలో ఆదివారం రాత్రి 12 గంటల తరువాత ఒక్కసారిగా వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు కటిక చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై పడుకున్న భక్తులు భయంతో పరుగులు తీశారు.
రికార్డు స్థాయిలో పిండప్రదానాలు
పుష్కరాల్లో సోమవారం పిండప్రదానాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటివరకు దాదాపు 10 లక్షల పిండప్రదానాలు జరగ్గా.. వీటిలో సోమవారం ఒక్క రోజే లక్షన్నరకు పైగా జరిగినట్లు సమాచారం. రెండు జిల్లాల్లోని పంచారామాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ముఖ్యంగా శివాలయాలకు భక్తజనం పోటెత్తారు.