డిశ్చార్జ్ అయ్యాక హాజరుపరచండి
♦ ప్రత్యూష కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
♦ ప్రత్యూష విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాం: ప్రభుత్వం
♦ అయితే ఆమె బాగోగులపై ఆందోళనకు బదులు దొరికినట్లే: ధర్మాసనం
♦ ఆమె తరహా బాధిత బాలికలుంటే చెప్పాలని ఏపీ సర్కారుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆస్తి కోసం సవతి తల్లి, కన్నతండ్రి హింసించడంతో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను వైద్యులు డిశ్చార్జ్ చేసిన వెంటనే తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
అలాగే ప్రత్యూష తరహా బాధిత బాలికలు, యువతుల ఉదంతాలేమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని, వారి విషయంలోనూ తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ వ్యాజ్యంలో ఏపీ సర్కారును కూడా ప్రతివాదిగా చేర్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ ప్రత్యూషను మరో వారంపాటు ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు చెప్పారని, అందువల్ల ఆమెను కోర్టులో హాజరుపరచలేకపోతున్నామని తెలిపారు. ప్రత్యూష విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని, సీఎం కేసీఆర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించారని కోర్టు దృష్టికి తెచ్చారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ పరామర్శ సందర్భంగా ప్రత్యూషతో సీఎం కొన్ని విషయాలు చెప్పినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని, అవన్నీ వాస్తవమని నమ్ముతున్నామని వ్యాఖ్యానించింది. పత్రికా కథనాలు నిజమేనని శరత్ చెప్పగా అయితే ప్రత్యూషను ఎక్కడికి పంపాలి.. ఆమె బాగోగులు ఎవరు చూస్తారు తదితర అంశాల్లో తమ ఆందోళనకు సమాధానం దొరికినట్లేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రత్యూష నర్సింగ్ కోర్స్ చేయాలని ఆసక్తి వెలిబుచ్చిందని...కానీ ఆమె ఇంటర్ పాస్ కానందున ఇప్పుడు నర్సింగ్ కోర్సులో చేర్చడం సాధ్యం కాదని శరత్ తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ తగిన శ్రద్ధ తీసుకుని ఇంటర్ పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇంటి నుంచే ఆర్టికల్ 14 ఉల్లంఘన..
ప్రత్యూష లానే ఎవరైనా బాలికలు, యువతులు తల్లిదండ్రులు, ఇతరుల చేత హింసకు గురవుతున్న ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు మీ దృష్టికేమైనా వచ్చాయా.. అంటూ ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ‘రాజ్యాం గం ప్రసాదించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14) ఉల్లంఘన ఆడపిల్లల విషయంలో మన ఇంటి నుంచే జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలపై తీవ్ర వివక్ష చూపుతున్నారు..
ఈ పరిస్థితుల్లో వారు ప్రభుత్వ హాస్టళ్లలో తలదాచుకుంటున్నారు. అయితే మీరు (ప్రభుత్వాలు) హాస్టళ్ల బాగు కోసం నిధులు ఖర్చు చేయకపోవడంతో వారు అక్కడి నుంచీ వెళ్లిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి ఏజీ వేణుగోపాల్ స్పందిస్తూ ధర్మాసనం కోరిననట్లుగా వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు.
కాగా, ప్రత్యూష ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందంటూ ఆమెకు చికిత్స అందిస్తున్న అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్య బృందం సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. మరోవైపు ప్రత్యూషకు ఇప్పటివరకు దాతల నుంచి వచ్చిన రూ.1,63,650 విరాళాలను ఆమె పేరిట చెక్కు రూపంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు అందజేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.