సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్లో సవతితల్లి వేధింపులతో తీవ్ర గాయాల పాలైన ప్రత్యూష(16) కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్థానిక సీఐను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం మీడియా కథనాలపై స్పందించి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేకు లేఖ రాయడంతో స్పందించిన హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.
సవతితల్లి, తండ్రి వేధింపులతో తీవ్ర గాయాల పాలైన ప్రత్యూష(16) ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా గాయాలు, వాతలు, శరీరం లోపల పుండ్లు అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం రీనల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ప్రత్యూష మొహంపైనే యాసిడ్‌తో దాడిచేసిన మచ్చ, గొంతులో యాసిడ్ వల్ల ఏర్పడిన గాయాలు, శరీరంపై చెప్పలేని ప్రాంతాల్లో సహా అన్ని భాగాల్లో సిగరెట్లతో కాల్చిన వాతలు, తలను గోడకు మోదడంతో ఏర్పడినవి, ఆమె దయనీయతను తెలియజేస్తున్నాయి.
'యాసిడ్, హర్పిక్ వంటివి తాగించడం వల్ల నాలుక కమిలిపోయింది. మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కండరాలు వాచిపోయాయి. రక్తహీనతతో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఛాతీలో నీరు ఉండటం వల్ల ఆయాసం వస్తోంది. కుడి భుజం వద్ద కొట్టిన దెబ్బలతో రక్తం గడ్డకట్టుకుపోయింది. చెవుల నుంచి నిరంతరాయంగా చీము వస్తుంది'అని ప్రత్యూషకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.
ప్రత్యూష కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
Published Mon, Jul 13 2015 7:01 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement