![హైదరాబాద్‌లో ‘లెఫ్ట్’ బంద్ ప్రశాంతం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71437166042_625x300.jpg.webp?itok=PEtfMzIe)
హైదరాబాద్‌లో ‘లెఫ్ట్’ బంద్ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెపై సర్కారు తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన పది వామపక్షాలు అందులో భాగంగా హైదరాబాద్‌లో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. విద్యాసంస్థలు పాక్షికంగా బంద్‌ను పాటించాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ చౌరస్తా, ఎంజీబీఎస్ వద్ద లెఫ్ట్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వారిని ఆరెస్టు చేసి, వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు.
నారాయణగూడ వద్ద రాస్తారోకో చేసినందుకు కె. నారాయణ, డాక్టర్ సుధాకర్, టి.వెంకట్రాములు (సీపీఐ), చెరుకుపల్లి సీతారాములు, బి.వెంకట్ , సాయిబాబా, జ్యోతి (సీపీఎం), డీవీ కృష్ణ, అరుణ, పద్మ, ఝూన్సీ (న్యూడెమోక్రసీ), మురహరి (ఎస్‌యూసీసీఐ), కృష్ణ యాదవ్ (టీడీపీ), పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఎంజీబీఎస్ వద్ద బస్సులను అడ్డుకునేందుకు యత్నించినందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, డీజీ నర్సింహరావు (సీఐటీయూ), ఇ.టి. నర్సింహా (ఏఐటీయూసీ), వేములపల్లి వెంకట్రాములు, గోవర్ధన్, రంగయ్య, సూర్యం (స్యూడెమోక్రసీ), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ) తదితరులను అరెస్టు చేశారు.
మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా తమను అరెస్టు చేయడం సరికాదని తమ్మినేని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధనకు త్యాగాలకు వెనుకాడబోమన్నారు. మరోవైపు కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన సర్కారు అణచివేత దోరణులకు పాల్పడటం దారుణమని చాడ విమర్శించారు. ఇదే పరిస్థితి ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆందోళనలు కొనసాగిస్తాం..
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని పది వామపక్షాలు శుక్రవారం ప్రకటించాయి.
వైఎస్సార్ సీపీ మద్దతు
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. కూకట్‌పల్లి, షాపూర్‌లలో వైఎస్సార్‌సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి ఆధ్వర్యంలోబైక్ ర్యాలీలు నిర్వహించారు. అఫ్జల్‌గంజ్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, లంగర్‌హౌస్‌లో శ్యామల తదితరులు ధర్నా చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ స్టేషన్‌కు తరలించారు.