నేటి నుంచే ఇంటర్ పరీక్షలు | inter exams from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

Published Wed, Mar 2 2016 1:48 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

inter exams from today

 * పావుగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతి
* అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది
* హాజరు కానున్న 9.64 లక్షల మంది విద్యార్థులు
* హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు

 సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే పరీక్ష  ప్రారంభమవుతుంది. ఇంటర్ పరీక్షల్లో ప్రప్రథమంగా ఈ ఏడాది నుంచే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. ఎంసెట్ తరహాలోనే ఇంటర్ పరీక్షల్లోనూ హైటెక్ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులను నిర్ధేశిత సమయం కన్నా పావుగంట(8.45గంటలకే) ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యం చేసి ఆ తర్వాత నష్టపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు చెల్లించకపోవడం లేదా ఇతర కారణాలతో ప్రైవేటు జూనియర్ కళాశాలలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వని పక్షంలో వెబ్‌సైట్(www.tsbie.cgg. gov.in) నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది. విద్యార్థుల హాల్‌టికెట్లలో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు గమనిస్తే.. సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి. పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు 50 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 200 వరకు సిట్టింగ్ స్క్వాడ్‌లను పోలీసు, రెవెన్యూ బృందాలతో ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇన్విజిలేషన్ విధుల్లో 24,651 మంది లెక్చరర్లు, 3,388 మంది టీచర్లు పాల్గొంటారు. పరీక్షలకు 1,257 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 478 ప్రభుత్వ కాలేజీలు, 34 ఎయిడెడ్ కాలేజీలు, 745 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. 118 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

 విద్యార్థులకు సూచనలు

 - పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు ఇచ్చిన ఓఎంఆర్ బార్‌కోడ్‌లో పేరు, హాల్‌టికెట్ నంబర్, మీడియం వివరాలను విద్యార్థులు సరిచూసుకోవాలి.

 - జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. వేరు అడిషనల్ షీట్స్ ఇవ్వరు. కొత్త సిలబస్, పాత సిలబస్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిసారి పరీక్షలు రాసే వారంతా న్యూ సిలబస్ ప్రశ్నపత్ర ంతోనే రాయాలి.

 - దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇంటర్ పరీక్షల నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

 - పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఉంటాయి.

 - చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, అనుమతి పొందిన వారు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలి. అదీ ప్రశ్నపత్రాల చేరవేత కోసమే. వారి ఫోన్లపైనా హైటెక్ నిఘా ఉంటుంది. జీపీఎస్ సహాయంతో వారి ఫోన్ నుంచి ఇతరులకు ఫోన్ వెళ్లినా, మెసేజ్ వెళ్లినా, ఇతరుల ఫోన్ల నుంచి వారి ఫోన్లకు  కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా రికార్డు చేస్తారు.

 ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు

 ఫస్టియర్      

 జనరల్         4,20,161

 ఒకేషనల్       36,494

 సెకండియర్         

 జనరల్         4,73,882

 వొకేషనల్       34,127

 మొత్తం         9,64,664

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement