ముగిసిన ఇంటర్ పరీక్షలు
ఈనెల ఒకటిన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఆదివారంతో ముగిసాయి.
– చివరి రోజు 601 మంది గైర్హాజరు
కర్నూలు సిటీ : ఈనెల ఒకటిన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఆదివారంతో ముగిసాయి. దీంతో విద్యార్థులతోపాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వాస్తవానికి ఈ నెల 13 నాటికి పరీక్షలు ముగియాల్సి ఉంది. అయితే పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల కారణంగా ఈ నెల9న జరగాల్సిన పరీక్ష 19కి వాయిదా పడింది. చివరి పరీక్ష రోజున 26962 మంది విద్యార్థులకుగాను, 26361 మంది హాజరయ్యారు. మొత్తం 601 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిన నలుగురు విద్యార్థులను మాస్ కాపీయింగ్ కింద బుక్ చేశారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ఉదయం సెషన్‌కు సెలవు ఇచ్చారు. ఇదిలా ఉండగా పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. పరీక్ష కేంద్రాల దగ్గర విద్యార్థులు ఒకరికొకరు బాయ్ చొప్పుకోవడం కనిపించింది. పెట్టెబేడా సర్దుకుని సొంతూళ్లకు బయలుదేరివెళ్లారు.